రైతు వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలుతోంది | Perni Nani Fires On Chandrababu Naidu Government | Sakshi
Sakshi News home page

రైతు వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలుతోంది

May 18 2026 3:54 AM | Updated on May 18 2026 3:54 AM

Perni Nani Fires On Chandrababu Naidu Government

మామిడి, మొక్కజొన్న రైతులను గాలికొదిలేశారు

రైతుల బాధలు, పంటల గురించి తెలియని వ్యక్తి ఈ రాష్ట్రానికి వ్యవసాయ మంత్రి  

స్థానిక మంత్రికి జగన్‌ను తిట్టడమే తప్ప రైతులకు మేలు చేద్దామనిలేదు 

నూజివీడు మామిడి, మొక్కజొన్న రైతుల సదస్సులో వైఎస్సార్‌సీపీ నేతల ఫైర్‌ 

నూజివీడు: రైతు బాధలను పట్టించుకోని రైతు వ్యతిరేక ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యమేలుతోందని.. మామిడి, మొక్కజొన్న రైతులను గాలికి వదిలేశారని  మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. ఏలూరు జిల్లా నూజివీడులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు ఆధ్వర్యంలో మామిడి, మొక్కజొన్న రైతుల సమస్యలపై ఆదివారం సదస్సు నిర్వహించారు. 

ముఖ్య అతిథిగా హాజరైన పేర్ని నాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయని దుర్మార్గ ప్రభుత్వం ఉండటం రైతుల దౌర్భాగ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2,400ల మద్దతు ధర ప్రకటిస్తే దళారులు కేవలం రూ.1,700లకే కొనుగోలు చేస్తున్నారని.. ఫలితంగా రైతులు రూ.700 నష్టపోతున్నారని చెప్పారు. రైతుల బాధలు, వారు సాగుచేసే పంటల గురించి తెలియని మంత్రి ఈ రాష్ట్రానికి వ్యవసాయ మంత్రిగా ఉన్నాడని.. పైగా, పంటలే సాగుచేయని సింగపూర్‌ దేశానికి వెళ్లి శిక్షణపొంది వచ్చారని ఎద్దేవా చేశారు. పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే.. 

మామిడికి రాజకీయ ‘మంగు’.. 
ప్రసిద్ధి చెందిన నూజివీడు మామిడికి గడ్డుకాలం రావడం ప్రభుత్వ వైఫల్యమే. ఇక్కడి మామిడికి రాజకీయ మంగు పట్టింది. ఇంకా మూడేళ్లు దీనిని భరించక తప్పదు. గతేడాది చిత్తూరులో మామిడి రైతులకు కిలోకు రూ.4లు ఇచ్చినప్పుడు నూజివీడు రైతులకు ఎందుకివ్వలేదు? మామిడి, మొక్కజొన్న రైతులకు జరుగుతున్న అన్యాయంపై టీడీపీ నాయకులు మంత్రిని ఎందుకు నిలదీయడంలేదు? ఇక్కడి మంత్రి ఒళ్లంతా ఆముదం పూసుకుంటున్నాడు. వైఎస్‌ జగన్‌ను తిట్టడానికి ఉన్న ఆసక్తి నియోజకవర్గ రైతులకు మేలు చేద్దామనిలేదు.

మన దేశం నుంచి యూరప్‌ దేశాలకు వెళ్లే పల్ప్‌పై ఆ దేశాలు షుగర్‌ సెస్‌ వేస్తుండగా.. దానిని తొలగించేలా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చిత్తూరు జిల్లాలోని ఫ్యాక్టరీల యజమానులు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదు. దీనివల్ల మామిడిని కొనుగోలు చేయడానికి ఫ్యాక్టరీలు ముందుకు రావడంలేదు. రైతులను పట్టించుకోని వ్యవసాయ మంత్రి ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేయడం ఎందుకు? అలాగే, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు? ఈ నియోజకవర్గానికి చెందిన మంత్రికి ఏమాత్రం సత్తా ఉన్నా రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి. రాబోయేది జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే. రైతులకు మంచి రోజులు వస్తాయి. మామిడి చెట్లను ఎవరూ నరకొద్దు.

దోచుకోవడం, దాచుకోవడమే సర్కారు పని: జోగి రమేష్‌
మాజీమంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడమే అజెండాగా ప్రభుత్వం పనిచేస్తోందని, రైతుల బాధలు పట్టించుకునే స్థితిలో ప్రభుత్వంలేదని మండిపడ్డారు. మామిడి, మొక్కజొన్న, ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. రైతులను, మహిళలను, విద్యార్థులను ఆదుకోలేని అసమర్థ ప్రభుత్వం ఉండటం ప్రజల దురదృష్టకరమని విమర్శించారు.

మేకా ప్రతాప్‌ అప్పారావు మాట్లాడుతూ.. నూజివీడు మామిడి కనుమరుగయ్యేలా ఉందని, ప్రభుత్వాలు పట్టించుకుని మామిడి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మొక్కజొన్న రైతులకూ చేయూతనివ్వాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్‌ ఇన్‌చార్జి కారుమూరి సునీల్‌కుమార్, చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ గుడిమళ్ల కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement