ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన సురేష్‌, జకియా

Penumatsa Suresh And Jakiya Khanam Taking Oath As YSRCP MLCs - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలుగా పెనుమత్స సురేష్, జకీయా ఖానుమ్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్‌ షరీఫ్‌ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎంలు పుష్ప శ్రీవాణి, అంజాద్‌ భాషా, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి,  చీఫ్‌ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పల నాయుడు, జోగి రమేష్, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ‘సీఎం జగన్ ఎమ్మెల్సీల ఎంపికలో ప్రత్యేక శైలి పాటించారు. చరిత్రలో తొలిసారి మైనారిటీ మహిళ జకీయా ఖానుమ్‌ను శాసన మండలికి పంపారు. జగన్‌తో తొలి రోజు నుంచి వెన్నంటే ఉన్న సాంబశివరాజు కుమారుడు సురేష్‌కి అవకాశం ఇచ్చారు. ఇద్దరి ఎంపిక పార్టీని నమ్ముకున్న వారికి జగన్‌మోహన్ రెడ్డి ప్రాధాన్యం ఇచ్చారని రుజువు చేసింద’ని అన్నారు.

డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. 'మైనారిటీ మహిళను ఎమ్మెల్సీ చేయడం మైనారిటీలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న ప్రేమకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ముస్లిం మహిళకు గౌరవం ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది. ముస్లిం సమాజం మొత్తం సీఎం జగన్‌ను అభినందిస్తున్నారు. వైఎస్ కుటుంబం అంటేనే ముస్లిం పక్షపాత కుటుంబం. సామాన్య మైనారిటీ మహిళను మండలికి పంపడం విశేషమ'ని పేర్కొన్నారు.  (ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ)


ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ..
'విజయనగరం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపింది పెనుమత్స సాంబశివరాజు. పార్టీని నమ్ముకున్న వారికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గుర్తింపు ఇస్తారని మరోసారి నిరూపించారు. రాష్ట్రంలోని కార్యకర్తలు అందరిలోనూ గౌరవాన్ని పెంచారు. మైనారిటీ మహిళకూ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి జగన్‌మోహన్‌రెడ్డి మహిళా పక్షపాతి అని నిరూపించార'ని ప్రశంసించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top