కాకినాడ మేయర్‌ పావని తొలగింపు 

Pavani Was Removed as Mayor of Kakinada - Sakshi

గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల  

త్వరలోనే కొత్త మేయర్‌ ఎన్నిక ప్రక్రియ  

యాక్టింగ్‌ మేయర్‌గా ‘చోడిపల్లి ప్రసాద్‌’

సాక్షి, కాకినాడ: నాలుగేళ్ల ‘మేయర్‌’ గిరికి బ్రేక్‌ పడింది. నియంతృత్వ విధానాలతో అసంతృప్తి మూటగట్టుకుని కార్పొరేటర్ల ‘విశ్వాసం’ కోల్పోయిన మేయర్‌ సుంకర పావని పదవిని కోల్పోయారు. ఈ మేరకు ఆమెను మేయర్‌ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.  జీవోఎంఎస్‌ నెంబర్‌ 129 ద్వారా పురపరిపాలనాశాఖ స్పెషల్‌ చీఫ్‌సెక్రటరీ వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్ట్‌ 1955లోని సెక్షన్‌ 91/ఎ(6) ద్వారా మెజార్టీ కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులిచ్చారు. ఆమెతోపాటు డిప్యూటీ మేయర్‌ కాలా సత్తిబాబును కూడా పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  

యాక్టింగ్‌ మేయర్‌గా చోడిపల్లి
డిప్యూటీ మేయర్‌ చోడిపల్లి ప్రసాద్‌ ‘యాక్టింగ్‌ మేయర్‌’ కానున్నారు. కార్పొరేషన్‌ యాక్ట్‌ ప్రకారం మేయర్‌ పదవిని కోల్పోతే ఆ స్థానంలో డిప్యూటీ మేయర్‌కు అన్ని అధికారాలు దాఖలు పడతాయి. మేయర్‌తోపాటు డిప్యూటీ మేయర్‌–1 కూడా పదవిని కోల్పోయిన నేపథ్యంలో ఇటీవలే డిప్యూటీ మేయర్‌–2గా ఎన్నికైన చోడిపల్లి ప్రసాద్‌ తదుపరి మేయర్‌ ఎన్నిక జరిగే వరకు ‘యాక్టింగ్‌ మేయర్‌’గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులకు ఎన్నికలు జరిపేందుకు వీలుగా ప్రభుత్వం ద్వారా ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదన పంపనున్నారు.  అక్కడి నుంచి తేదీ ఖరారైన వెంటనే కొత్త మేయర్‌ను ఎన్నుకోనున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top