స్వచ్ఛత ఎంతో మీరే చెప్పండి 

Online poll till 18 on maintenance of public toilets - Sakshi

ప్రజా మరుగుదొడ్ల నిర్వహణపై 18 వరకు ఆన్‌లైన్‌లో అభిప్రాయ సేకరణ 

నిర్వాహకులకు భారీగా రివార్డు ప్రకటించిన కేంద్రం 

ఈ వివరాలతో ఓడీఎఫ్‌++ పట్టణాల ఎంపికలో ప్రాధాన్యం 

24 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలని విజ్ఞప్తి 

సాక్షి, అమరావతి: స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా పట్టణాల్లో నిర్మించిన ప్రజా మరుగుదొడ్లు, కమ్యూనిటీ టాయిలెట్ల నాణ్యత, నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 వరకు ఆన్‌లైన్‌ సర్వే ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. ‘టాయిలెట్‌–2.0’ పేరుతో ఈ సర్వే చేస్తోంది. మరుగుదొడ్లను వినియోగించిన తర్వాత అక్కడే ఉన్న ‘క్యూఆర్‌ కోడ్‌’ను సెల్‌ఫోన్‌లో స్కాన్‌ చేసి ఆన్‌లైన్‌ సర్వేలో పాల్గొనాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ప్రకటించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకొని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్‌) నగరాలను ఎంపిక చేస్తుంది.

స్వచ్ఛత పాటించే నగరాలు, పట్టణాలకు గుర్తింపునిచ్చి, ప్రోత్సాహకాలను అందిస్తుంది. స్వచ్ఛ పట్టణాలు, నగరాలుగా ప్రకటిస్తుంది. మరుగుదొడ్లను పరిశుభ్రంగా నిర్వహించే వారికి కెప్టెన్‌ అవార్డు కింద నగదు బహుమతులు సైతం ప్రకటించింది. అంతేకాకుండా సర్వే ముగిసిన మరుసటి రోజు నుంచే చెడిపోయిన మరుగుదొడ్లను బాగుచేసేందుకు చర్యలు తీసుకుంటారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలు వాటర్‌+ అవార్డును, ఏడు పట్టణాలు ఓడీఎఫ్‌++ గుర్తింపు, 94 పట్టణాలు ఓడీఎఫ్‌+ గుర్తింపు పొందాయి. 

పరిశుభ్రమైన పట్టణాలే లక్ష్యంగా 
బహిరంగ మల విసర్జనను నూరు శాతం నిర్మూలించేందుకు కేంద్రం ప్రజలను భాగస్వాములను చేస్తోంది. అందుకోసం నవంబర్‌ 19 ప్రపంచ టాయిలెట్‌ డే సందర్భంగా స్వచ్ఛ సర్వే ప్రారంభించింది. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 25 శాతం నగరాలు ఓడీఎఫ్‌++ గుర్తింపు సాధించగా, ఈ సంఖ్యను నూరు శాతానికి పెంచాలన్నది కేంద్రం లక్ష్యం. అందుకనుగుణంగా రాష్ట్రంలో లక్ష కంటే తక్కువ జనాభా గల పట్టణాలను బహిరంగ మల విసర్జన రహితంగా మార్చాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ నిర్ణయించింది.

అందులో భాగంగా పట్టణాల్లో ప్రజా మరుగుదొడ్ల నిర్వహణపై అవగాహన పెంచేందుకు, సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చేందుకు వాటివద్ద ‘క్యూఆర్‌’ కోడ్‌ను ఉంచింది. దీనిని స్కాన్‌ చేసి, ఆన్‌లైన్‌లో 24 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలి. దీంతోపాటు ఇచ్చే ఓటింగ్‌ ఆధారంగా నిర్వాహకులను ఈ నెల 20వ తేదీన కెప్టెన్‌ అవార్డుతో సత్కరిస్తారు. మొదటి బహుమతిగా రూ.75 వేలు, రెండో బహుమతిగా రూ.50 వేలు, మూడో బహుమతిగా రూ.25 వేలు అందిస్తారు. ప్రజలు తమ అభిప్రాయాలను  https://docs.google.com/forms/d/1AYucwLyLAJ037h1h_x2JpqoBoqLGDaGSU9FlYAr...లో  చెప్పాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ అధికారులు కోరారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top