సాక్షి, అమరావతి : 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ మెడికల్ కన్వీనర్ కోటా ప్రవేశాలకు బుధవారం ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ ఇచ్చింది. నీట్ పీజీ–2026లో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణను బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభించింది. ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించారు. ఆలస్యరుసుంతో దరఖాస్తుకు 22వ తేదీ వరకు అవకాశం కల్పిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ కటాఫ్ తేదీని ఈ ఏడాది సెప్టెంబర్ 30గా ఖరారు చేశారు.
దరఖాస్తు సమయంలో ఏపీ పరిధిలో ఎంబీబీఎస్ చదివిన ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.7 వేలు, ఎస్సీ, ఎస్టీలైతే రూ.6 వేలు చొప్పున, ఏపీ వెలుపల ఎంబీబీఎస్ చదివిన బీసీ, ఓసీ అభ్యర్థులు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీలైతే రూ.9 వేలు చొప్పున రుసుం చెల్లించాలి. దేశం వెలుపల ఎంబీబీఎస్ చదివిన బీసీ, ఓసీలు రూ.14 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.13 వేలు రుసుం చెల్లించాలి. గడువు ముగిశాక దరఖాస్తు చేసుకునేవారు నిర్దేశించిన రుసుంకు అదనంగా రూ. 20 వేలు సమర్పించాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్యలు తలెత్తినట్లైతే 90007 80707, 80082 50842 నెంబర్లను సంప్రదించాలి.
ఎంబీబీఎస్ వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశం
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు మూడో విడత కౌన్సెలింగ్కు వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాలని విద్యార్థులకు బుధవారం ఆరోగ్య విశ్వవిద్యాలయం సూచించింది. ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ గడువు విధించింది.


