అధినాయకత్వాన్ని నిలదీస్తున్న జనసేన కార్యకర్తలు
40 శాతం అడిగి.. ఎందుకు పట్టు వదిలేస్తున్నారు?
ఎన్ని సీట్లు ఇస్తారో తేలకుండా సర్దుబాటు కుదిరిందని ఎలా చెబుతారు?
మన స్టాండ్‌పై మనం ఎందుకు నిలబడటం లేదు?
2,091 పదవులు కోరుతూ జనసేన పోస్టర్..
మరుసటి రోజే మారిన నేతల ప్రకటనలు
కూటమిగానే పోటీ, ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉండదన్న జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి
రెండు రోజులుగా అర్ధరాత్రి దాకా చర్చలు.. తేలని సర్దుబాటు లెక్క
మరోవైపు టీడీపీలోనూ రగులుతున్న అసంతృప్తి
మనతో సమానంగా సీట్లా...? మా సంగతేంటని టీడీపీ నేతల ఆక్రోశం
సాక్షి, అమరావతి: ‘నలభై శాతం కావాలని చంద్రబాబు ముందు ప్రతిపాదన పెట్టాం. పోస్టర్లు వేసి ప్రకటించాం. మరి ఆ పట్టు ఎందుకు వదిలేశారు? ఎన్ని మేయర్ సీట్లు ఇస్తారో, ఎన్ని మున్సిపాలిటీలు, ఎన్ని వార్డులు ఇస్తారో ఇంకా తేలనే లేదు. అలాంటప్పుడు సర్దుబాటు కుదిరిపోయిందని బయటకు వచ్చి ఎలా చెబుతారు? మన స్టాండ్‌పై మనం ఎందుకు గట్టిగా నిలబడటం లేదు?’ ఇదీ ఇప్పుడు జనసేన కార్యకర్తలు తమ నాయకత్వాన్ని నిలదీస్తున్న తీరు. సీట్ల పంపకంపై చంద్రబాబుతో బుధవారం జరిగిన చర్చల తర్వాత జనసేన నేతలు చేసిన ప్రకటన చూసి ఆ పార్టీ కేడర్ అసంతృప్తితో రగిలిపోతోంది.
ఒక్కరోజు క్రితమే 2,091 పదవులు కావాలని పోస్టర్ విడుదల చేసిన పార్టీ, మరుసటి రోజే లెక్కలేమీ వేసుకోలేదనడం వారికి మింగుడుపడటం లేదు. ఇది దేనికి సంకేతం అని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెనక్కి తగ్గాం కదా.. స్థానిక ఎన్నికల్లో మన బలానికి తగినట్టు సీట్లు కేటాయిస్తామన్నారు కదా.. ఇపుడు ఇలా జరుగుతున్నదేంటి? ఇంకెంత కాలం తగ్గి ఉండాలి? అన్ని స్థానాల్లో పోటీ చేస్తే పోతుంది కదా.. ఇదే తగిన సమయం’’ అని జనసేన శ్రేణులు చర్చించుకుంటున్నాయి.
నిన్న పోస్టర్ విడుదల చేసిన మంత్రి.. నేడు సర్దుబాటు ప్రకటన
మంగళవారం జనసేన మంత్రి కందుల దుర్గేష్ పార్టీ లోగోతో కూడిన పోస్టర్ ఒకటి ఎక్స్‌లో విడుదల చేశారు. పట్టణ స్థానిక సంస్థల్లోని 5,220 పదవుల్లో 40.1 శాతం వాటాతో 2,091 పదవులు కేటాయించాలని జనసేన ప్రతిపాదించిందని ఎక్స్‌లో ప్రకటించారు. 6 మేయర్లు, 6 డిప్యూటీ మేయర్లు, 38 మున్సిపల్ చైర్మన్లు, 1,937 వార్డులు సహా ప్రతి పదవిలో వాటా అడిగినట్లు తెలిపారు. ఈ పోస్టర్‌ను జనసైనికులు సోషల్ మీడియాలో హోరెత్తించారు. ఈసారి తమ పార్టీ తగ్గదని సంబరపడ్డారు.
కానీ బుధవారం సాయంత్రం చంద్రబాబుతో భేటీ ముగిశాక జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడిన మాటలు వారిని నిర్ఘాంతపరిచాయి. చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరిందని, స్థానిక పరిస్థితుల మేరకు ఎవరు పోటీ చేయాలో నిర్ణయం తీసుకుంటామని, ఇన్ని సీట్లలో పోటీ చేయాలని లెక్కలేమీ వేసుకోలేదని ఆయన ప్రకటించారు. ఫ్రెండ్లీ పోటీలు ఉండవని, ప్రతి స్థానంలో కూటమి తరఫున ఒక్క అభ్యర్థే ఉంటారని తేల్చిచెప్పారు. పోటీ చేసే స్థానాలపై రెండు రోజుల్లో కూటమిగా ప్రకటన చేస్తామని చెప్పారు.

లెక్క తేలకుండా ఏకాభిప్రాయమా?
ఎవరికి ఎన్ని సీట్లు అనేదే తేలకపోతే ఏకాభిప్రాయం దేనిపై కుదిరిందని జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. 40 శాతం అడిగి, ఇప్పుడు లెక్కలేమీ లేవంటే ఆ ప్రతిపాదనను వదిలేసినట్టేనా అని నిలదీస్తున్నారు. టీడీపీ మూడు మేయర్ సీట్లే ఇస్తామని తెగేసి చెబుతుంటే ఫ్రెండ్లీ పోటీ లేదని ముందే ప్రకటించేయడం వల్ల బేరమాడే బలం కూడా పోయిందని వారు వాపోతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లతో సర్దుకున్నాం, అప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం వెనక్కి తగ్గామన్నారు. ఇప్పుడు కార్యకర్తల ఎన్నికల్లో కూడా అదే జరిగితే పార్టీ ఎప్పటికి ఎదుగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు రోడ్డెక్కింది తామేనని, కూటమి కోసం ఎక్కువ త్యాగం చేసింది జనసేనేనని స్వయంగా పవన్ కళ్యాణ్ ఇటీవల చెప్పారని, ఆ త్యాగాలకు ఇదేనా ప్రతిఫలం అని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జనసేన నేత ఒకరు వ్యాఖ్యానించారు.
రెండు రోజులు.. సుదీర్ఘ చర్చలు.. అయినా తేలని పొత్తు
సీట్ల సర్దుబాటుపై మంగళవారం అర్ధరాత్రి దాటే వరకు చర్చలు సాగినా ఫలితం రాలేదు. బుధవారం ఉదయం జనసేన నేతలు మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఒక విడత సమావేశమయ్యారు. మధ్యాహ్నం నుంచి సీఎం చంద్రబాబుతో మరోసారి భేటీ అయ్యారు. జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రోజంతా సాగిన చర్చల్లోనూ ఏ పార్టీకి ఎన్ని మేయర్ సీట్లు, ఎన్ని మున్సిపాలిటీలు అనేది తేలలేదు. మరో భేటీలో ఖాయం చేసుకుంటామని ప్రకటించి సరిపెట్టారు.
కార్యకర్తలను మభ్యపెట్టేందుకేనా...?
‘40 శాతం సీట్లలో పోటీ చేస్తామంటూ ట్వీట్ చేశారు కదా’ అని జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ని విలేకరులు అడిగితే, తాను అలాంటి ట్వీట్ చేయలేదని, ఎవరు చేశారో తనకు తెలియదన్నారు.. కాసేపటికే మరలా అదే ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ.. చర్చలు ఫలించాయని, ఎవరికి ఎక్కడ బలం ఎక్కడుంటే అక్కడ ఆ పార్టీ పోటీ చేస్తుందని మరో ట్వీట్ చేశారు.. దీనినిబట్టి చూస్తే జనసేన, టీడీపీ పొత్తుల మధ్య సీట్ల పంపకాలపై జరుగుతున్న ప్రచారం అంతా కేవలం కార్యకర్తలను మభ్య పెట్టేందుకేనని అర్థం అవుతోంది. జనసేన సీట్లు కోరడం, దానికి టీడీపీ అంగీకరించడం వంటివి కేవలం సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలకే పరిమితమని, చంద్రబాబు ఇచ్చింది పవన్ కళ్యాణ్ తీసుకోవడం తప్ప, అంతకు మించి సీట్లు డిమాండ్ చేసే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.
మాతో సమానంగా అడగడమేంటి?: టీడీపీలో అసంతృప్తి
జనసేన కేడర్ ఇలా రగిలిపోతుంటే, టీడీపీలోనూ అసంతృప్తి చెలరేగుతోంది. రాష్ట్రంలో మెజారిటీ ఓటు బ్యాంకు ఉన్న తమతో సమానంగా జనసేన పదవులు అడగడం ఏమిటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. బలం లేని చోట కూడా వాటా కోసం పేచీ పెట్టడం సరికాదని అంటున్నారు. జనసేన, బీజేపీ కలిసి సగం పదవులు ఎగరేసుకుపోతే ఏళ్లుగా జెండా మోసిన తమ పరిస్థితి ఏంటని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే వాపోయారు.
జనసేనకు వెళ్తాయని ప్రచారం జరుగుతున్న విజయవాడ, మచిలీపట్నం, ఒంగోలు, అనంతపురం వంటి చోట్ల టికెట్ ఆశించిన టీడీపీ నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. జనసేనకు చాలాచోట్ల మేయర్, ఛైర్మన్ పదవులకు తగిన అభ్యర్థులే లేరని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. విజయవాడ మేయర్ సీటు కోసం జనసేన టీడీపీ నేత వంగవీటి రాధానే అరువు తెచ్చుకుంటోందని విమర్శిస్తున్నారు. ఒంటరి పోటీ బెదిరింపులకు తలొగ్గాల్సిన అవసరం లేదని టీడీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
కూటమి ధర్మాన్ని విస్మరిస్తే ఒంటరిగా పోటీ
కూటమి ధర్మాన్ని పాటించకుంటే కచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగుతామని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జి తుమ్మల రామస్వామి బాబు స్పష్టం చేశారు. బుధవారం కాకినాడ జిల్లాలోని పెద్దాపురం పార్టీ కార్యాలయంలో ముఖ్యమైన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కాకినాడ జిల్లాలో పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీల్లో రాజకీయ పక్షాలన్నీ కూటమి ధర్మాన్ని కచ్చితంగా పాటించాలన్నారు. లేనిపక్షంలో రెండు మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల్లో జనసేన ఒంటరిగా పోటీకి దిగుతుందని చెప్పారు. పొత్తు ధర్మాన్ని పాటించి సగం సీట్లకు పైగా ఇస్తామని గతంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప హామీ ఇచ్చారన్నారు. కచ్చితంగా పెద్దాపురం మున్సిపాలిటీని జనసేనకు కేటాయించాలని అన్నారు.
సోషల్ మీడియాలో యుద్ధం
ఇరు పార్టీల కార్యకర్తల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం నడుస్తోంది. చర్చలు జరుగుతుండగానే 40 శాతం పోస్టర్ బహిర్గతం చేయడం ఏం పద్ధతంటూ టీడీపీ యాక్టివిస్టులు విరుచుకుపడుతుంటే, పొత్తు వల్లే గెలిచారంటే ఊరుకోబోమని జనసైనికులు ఎదురుదాడికి దిగుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఏ ఊర్లో జనసైనికులు రోడ్డెక్కారో చెప్పాలంటూ టీడీపీ కార్యకర్తలు సవాల్ విసురుతున్నారు.
ఇప్పుడు బొలిశెట్టి ప్రకటనతో జనసైనికుల ఆగ్రహం సొంత నాయకత్వం వైపు కూడా మళ్లింది. 40 శాతం అడిగిన ఆ పార్టీకి చివరకు ఎంత దక్కుతుంది, సీట్లు ఆశించినా రాని వారు ఊరుకుంటారా, టీడీపీలో టికెట్ దక్కని ఆశావహులు ఏం చేస్తారనే ఆయా పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు బీజేపీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ చంద్రబాబుతో పొత్తు చర్చలు జరిపారు.


