Nellore Lorry Incident: ఇంటికొస్తున్నా.. నీకేం కావాలి.. | Nellore Container Incident | Sakshi
Sakshi News home page

Nellore Lorry Incident: ఇంటికొస్తున్నా.. నీకేం కావాలి..

Nov 12 2025 11:31 AM | Updated on Nov 12 2025 11:49 AM

Nellore Container Incident

మాటేసిన మృత్యువు.. కంటైనర్‌ రూపంలో కాటేసింది. ఎన్నెన్నో కలలను కబళించింది. మూడు కుటుంబాలకు కన్నీరు మిగిలి్చంది. ఆస్పత్రికి వెళ్లొస్తున్న తండ్రి, తోడబుట్టిన సోదరుడు ఇక లేడని తెలుసుకొని ఓ అన్నా చెల్లెలు.. బయటకెళ్లిన భర్త కొబ్బరి నీరు తెస్తాడని ఎదురు చూసిన నిండు గర్భిణైన భార్య గుండెలు పగిలిలా తల్లడిల్లారు. జీవనోపాధి నిమిత్తం కంకులు విక్రయిస్తూ బతుకు పోరాటం చేస్తున్న మీజూరి మల్లిక.. కొబ్బరి బోండాలు అమ్మే మాలకొండయ్య గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. నెల్లూరు జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల జీవితాలను శాశ్వతంగా మార్చేసింది.

నెల్లూరు (క్రైమ్‌): కంటైనర్‌ మితిమీరిన వేగం వారి పాలిట మృత్యువైంది. తండ్రి, తోడబుట్టిన సోదరుడు ఇక రారని అన్నా, చెల్లెలు.. జీవితాంతం బాసటగా నిలుస్తానని బాస చేసిన భర్త కానరాని తీరాలకు వెళ్లిపోయారని తెలుసుకొని ఎనిమిది నెలల గర్భిణి గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. నెల్లూరులోని జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాలను చిదిమిసేంది. నెల్లూరు ఎస్వీజీఎస్‌ కళాశాల మైదాన సమీపంలో జాతీయ రహదారి పక్కన ఎనీ్టఆర్‌నగర్‌ రాయపుపాళేనికి చెందిన మీజూరు మల్లిక తోపుడు బండిపై మొక్కజొన్న కంకులు.. ఎనీ్టఆర్‌నగర్‌కు చెందిన చుండూరి మాలకొండయ్య టాటా ఏస్‌ వాహనంలో కొబ్బరి బోండాలను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు.

సూళ్లూరుపేటలో చేపలను అన్‌లోడ్‌ చేసిన మినీ కంటైనర్‌ నెల్లూరుకు మంగళవారం మధ్యాహ్నం బయల్దేరింది. గ్రీన్‌ సిటీ మార్గం వద్దకొచ్చేసరికి చెన్నై వైపు రహదారి నుంచి కావలి వైపు ఒక బైక్‌పై యూటర్న్‌ తీసుకుంది. మితిమీరిన వేగంతో వస్తున్న కంటైనర్‌ డ్రైవర్‌ బైక్‌ను తప్పించే క్రమంలో వేగాన్ని నియంత్రించలేకపోయారు. బైక్‌తో పాటు ముందు వెళ్తున్న మరో బైక్, కంకులను కొనుగోలు చేస్తున్న వ్యక్తి, తోపుడు బండిని ఢీకొని దూసుకెళ్లి ముందున్న పెద్ద చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదంలో నెల్లూరు రూరల్‌ మండలం అల్లీపురం సిరి గార్డెన్స్‌కు చెందిన ఒట్టూరు సురేష్‌ (36), తండ్రీకొడుకులు ఖాజా నజీమ్‌ మొహిద్దీన్‌ (70), ముజాహిద్‌ అలీ (35) అక్కడికక్కడే మృతి చెందారు. మల్లిక, మాలకొండయ్యతో పాటు కంకుల కొనుగోలుకు వచ్చిన లైన్‌మెన్‌ ఈదూరు అనిల్, యూటర్న్‌ తీసుకున్న ద్విచక్రవాహనదారుడు కోటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు.

వైద్యచికిత్స చేయించి ఇంటికెళ్తూ..
నెల్లూరు రూరల్‌ మండలం సిరి గార్డెన్స్‌కు చెందిన ఖాజా నజీమ్‌ మొహిద్దీన్‌ (70) విశ్రాంత పీఈటీ. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. పెద్ద కుమారుడు తౌహీద్, కుమార్తె సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. చిన్న కుమారుడు ముజాహిద్‌ అలీ నెల్లూరు రూరల్‌ మండలం నారాయణరెడ్డిపేటలోని సచివాలయంలో శానిటరీ అండ్‌ ఎని్వరాన్‌మెంట్‌ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ తరుణంలో హెల్త్‌ చెకప్‌ నిమిత్తం నారాయణ ఆస్పత్రికి తండ్రిని తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి జాతీయ రహదారి మీదుగా బయల్దేరారు. ఈ క్రమంలో కంటైనర్‌ ఢీకొని వారు మృతి చెందారు. తండ్రి, సోదరుడు మృతి చెందారనే విషయం తెలుసుకున్న తౌహీద్, సోదరి ఘటన స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు.

హాస్పిటల్లో మిన్నంటిన రోదనలు
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లిక, మాలకొండయ్య, అనిల్‌.. మెడికవర్‌ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు, బంధువులు హుటాహుటిన హాస్పిటల్‌కు చేరుకొని విషాదంలో మునిగిపోయారు. ఇందుకూరుపేట మండలం కొత్తూరుకు చెందిన అనిల్‌కు భార్య మెర్సీ, ఇద్దరు పిల్లలున్నారు. ఆయన నెల్లూరులో లైన్‌మెన్‌గా పని చేస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది.

ఎనీ్టఆర్‌నగర్‌కు చెందిన మల్లిక, రవిచంద్ర దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. జాతీయ రహదారి పక్కన తోపుడు బండిపై మొక్కజొన్న కంకులను విక్రయిస్తూ మల్లిక జీవనం సాగిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకొని రోదించారు.

ఎనీ్టఆర్‌నగర్‌కు చెందిన మాలకొండయ్య, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికీ వివాహాలయ్యాయి. టాటా ఏస్‌ వాహనంలో కొబ్బరి బోండాలను విక్రయిస్తూ కొంతకాలంగా మాలకొండయ్య జీవనం సాగిస్తున్నారు.

తిరుపతి జిల్లా కోట మండలం ఉచ్చువారిపాళేనికి చెందిన కోటేశ్వరరావు నెల్లూరు గ్రీన్‌ సిటీలోని సచివాలయ బిల్డింగ్‌కు వాచ్‌మెన్‌గా రెండు నెలలుగా పనిచేస్తున్నాడు. మొక్కజొన్న కంకులు కొనుగోలు చేసేందుకెళ్తూ ప్రమాదంలో గాయపడ్డారు.

ఇంటికొస్తున్నా.. నీకేం కావాలి..
మూలాపేటకు చెందిన సురేష్‌ ప్రస్తుతం సిరి గార్డెన్స్‌లో ఉంటున్నా రు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం భార్య నిండు గర్భిణి. సురేష్‌ ఇంటికొస్తూ.. భార్యకు ఫోన్‌ చేసి నీకేం కావాలి తన అడిగారు. కొబ్బరి నీళ్లు తీసుకురావాలనడంతో అక్కడ ఆగడమే ఆయనకు ఆఖరి క్షణమని తెలియదు. సురేష్‌ మృతి విషయాన్ని భార్యకు చాలా సేపటి వరకు బంధువులు చెప్పలేదు. గర్భిణి కావడంతో కొంచెంగా చెప్పారు. దీంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తూ కూప్పకూలిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement