ముమ్మరంగా ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు పనులు

Nandamuri Balakrishna Call to MLA Pratap Kumar Reddy Nellore - Sakshi

ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డితో  ఫోన్‌లో మాట్లాడిన సినీ హీరో బాలకృష్ణ

నెల్లూరు ,కావలి: పట్టణంలోని ముసునూరులో మహాలక్ష్మమ్మ ఆలయ స్థలంలో ఆలయానికి ఎదుట రెండేళ్ల క్రితం టీడీపీ నాయకుడు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని అక్కడి నుంచి గ్రామస్తులు తొలగించి పక్కనే ఉన్న మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ప్రతిష్టించేందుకు నిర్వహిస్తున్న పనులు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా టీడీపీ నాయకులు పార్టీ అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు ముసునూరులో హడావుడి చేసినప్పటికీ గ్రామంలో వాస్తవ పరిస్థితులను గమనించి వివాదం చేయడం సరికాదనే అభిప్రాయానికి వచ్చారు. ఇదిలా ఉండగా నెల్లూరుకు చెందిన టీడీపీ నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ముసునూరులో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు అంశానికి సంబంధించి వివాదాన్ని పెంచేందుకు చేసిన ప్రయత్నాలు ఆ పార్టీలోనే అంతర్గతంగా విమర్శలకు దారితీశాయి.

కాగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి వాస్తవ పరిస్థితులను సినీ హీరో బాలకృష్ణకు వాట్సాప్‌ ద్వారా తెలియజేయడంతో బాలకృష్ణ నేరుగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి గురువారం ఫోన్‌ చేసి మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడిన అనంతరం బాలకృష్ణ ఎమ్మెల్యే తీసుకొన్న చొరవను అభినందించినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని బాలకృష్ణ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి తెలియజేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా రాజమండ్రి నుంచి కొత్తగా కొనుగోలు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహం ముసునూరుకు చేరుకోవడంతో విగ్రహాన్ని ప్రతిష్టించే పనులు జరుగుతున్నాయి. పక్కనే ఉన్న మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద కూడా శిథిలమైన దిమ్మెను మెరుగుపరుస్తున్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చెప్పినట్లుగానే విగ్రహాన్ని ముసునూరు కూడలిలోని బస్‌షెల్టర్‌ వద్దనే ఏర్పాటు చేస్తున్న తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top