రూ.92 కోట్లతో పార్కులు.. పచ్చదనం 

Municipal Department Activity For The Construction Of Parks In AP - Sakshi

32 మునిసిపాలిటీల్లో 125 పార్కుల నిర్మాణం

పురపాలకశాఖ కార్యాచరణ 

సాక్షి, అమరావతి: ‘ఆట విడుపు, వాహ్యాళికి పార్కులు లేవు.. ఆహ్లాదానికి పచ్చదనం లేదు..’ అని చింతపడుతున్న పట్టణ ప్రజలకు ఊరట కలిగించేందుకు పురపాలకశాఖ సమాయత్తమైంది. కాంక్రీట్‌ జంగిళ్లుగా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో.. అమృత్‌ పథకంలో భాగంగా పార్కుల నిర్మాణం, పచ్చదనం పెంపొందించేందుకు కార్యాచరణ చేపట్టింది. మొదటిదశలో లక్షలోపు జనాభా ఉన్న 32 మునిసిపాలిటీల్లో 125 పార్కుల నిర్మాణంతోపాటు  పచ్చదనం పెంపొందించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పార్కుల నిర్మాణం, ఖాళీ ప్రదేశాల నిర్వహణ చేపడుతోంది.

ప్రతి మునిసిపాలిటీలో కనీసం రెండు పార్కుల చొప్పున మొత్తం మీద 125 పార్కులు నిర్మిస్తారు. ఇందుకోసం అధికారులు అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించారు. విశాలమైన పార్కు, వాటిలో వ్యాయామ ఉపకరణాలు, ఫౌంటేన్‌ నిర్మాణంతోపాటు ల్యాండ్‌ స్కేపింగ్‌ చేపడతారు. పట్టణాల్లో ప్రధాన రోడ్ల వెంబడి మొక్కలు పెంచుతారు. ప్రధాన కూడళ్లు, శివారు ప్రాంతాలు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో అర్బన్‌ ఫారెస్ట్రీ కింద దట్టంగా మొక్కలు పెంచుతారు. మొత్తం మీద పార్కులు, పచ్చదనం పెంపొందించేందుకు రూ.92.10 కోట్లతో 95 పనులు చేయనుంది. ఇప్పటికే 87 పనులు మొదలయ్యాయి. 

కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. 
పట్టణాల్లో పార్కుల నిర్మాణం, నిబంధనల ప్రకారం ఉండాల్సిన ఖాళీ ప్రదేశాల కోసం కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ మార్గదర్శకాలను రాష్ట్ర పురపాలకశాఖ అనుసరిస్తోంది. పట్టణాల్లోని కాలనీల్లో పార్కులు 5 వేల చదరపు మీటర్లు, కమ్యూనిటీ పార్కులు 10 వేల నుంచి 15 వేల చ.మీ., జిల్లా కేంద్రంలోని ప్రధాన పార్కు 50 వేల నుంచి 2.50 లక్షల చదరపు మీటర్లలో నిర్మిస్తారు. ఇక మునిసిపాలిటీల్లో ప్రతి పౌరుడికి 10 నుంచి 12 చదరపు మీటర్ల వంతున ఖాళీ జాగా ఉండాలి. ఆ ప్రకారం పట్టణాలను ఏ, బీ, సీ గ్రేడ్‌లుగా విభజించారు. పెద్ద మునిసిపాలిటీలు ఏ గ్రేడ్‌లో, చిన్న మునిసిపాలిటీలు బీ గ్రేడ్‌లో ఉండాలని నిర్దేశించారు. సీ గ్రేడ్‌లో ఒక్కటి కూడా ఉండకుండా చూడాలని పురపాలకశాఖ మునిసిపల్‌ కమిషనర్లకు స్పష్టం చేసింది. పార్కులు నిర్మించి పట్టణాల్లో పచ్చదనం పెంపొందిస్తామని ఈఎన్‌సీ చంద్రయ్య చెప్పారు.
చదవండి:
చంద్రబాబు నుంచి ప్రాణ హాని..    
17 తర్వాత పార్టీ లేదు.. తొక్కా లేదు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top