అవ్వాతాతలకు కంటి చూపు

More than 93000 cataract surgeries Andhra Pradesh With YSR Kanti Velugu - Sakshi

93వేల మందికి పైగా కేటరాక్ట్‌ సర్జరీలు

ఇప్పటివరకు 11.80 లక్షల మంది అవ్వాతాతలకు స్క్రీనింగ్‌ పూర్తి

స్క్రీనింగ్‌ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 413 బృందాలు

రాష్ట్ర వైద్యులకు ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో ప్రత్యేక శిక్షణ

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకూడదు.. చికిత్సలేని కారణంగా కంటిచూపునకు ఎవరూ దూరం కాకూడదు.. అన్న సత్సంకల్పంతో ప్రారంభమైన వైఎస్సార్‌ కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్తోంది. ఈ యజ్ఞంలో ఇప్పటివరకు 93వేల మందికి పైగా అవ్వాతాలకు కేటరాక్ట్‌ (కంటి శుక్లాలు) సర్జరీలు పూర్తయ్యాయి. 

రాష్ట్రవ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన వారు 56.88 లక్షల మంది ఉన్నట్లు అంచనా. వీరిలో ఇప్పటివరకు 11.80 లక్షల మందికి కంటిపరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షలు చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 413 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తున్నాయి. కరోనా కేసులు తగ్గిన తర్వాత పీహెచ్‌సీ స్థాయి నుంచి బోధనాసుపత్రి వరకూ స్క్రీనింగ్‌ క్యాంపులు నిర్వహించి పరీక్షలు చేస్తున్నారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు ఇస్తున్నారు.

వైద్యవిధాన పరిషత్‌ ఆస్పత్రుల దూకుడు
సెకండరీ కేర్‌ (వైద్యవిధాన పరిషత్‌) పరిధిలో ఉండే జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లోని కంటి వైద్యులు శస్త్రచికిత్సల్లో దూకుడుగా వెళ్తుండగా, బోధనాసుపత్రుల్లో ఉన్న కంటి డాక్టర్లు మాత్రం తగిన స్థాయిలో సర్జరీలు చేయలేకపోతున్నారు. విచిత్రమేమంటే 11 బోధనాసుపత్రుల్లో 107 మంది కంటివైద్య నిపుణులు ఉండగా, వారంతా కలిసి 4,495 శస్త్రచికిత్సలు మాత్రమే చేశారు. అదే వైద్యవిధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో కేవలం 40 మంది మాత్రమే ఉండగా వీరు 5,143 ఆపరేషన్లు చేశారు. వాస్తవానికి నిపుణుడైన డాక్టర్‌ కంటిశుక్లాల ఆపరేషన్లు రోజుకు 8 నుంచి 10 వరకూ చేయచ్చు. కానీ, డీఎంఈ ఆస్పత్రుల్లో ఉన్న పెద్ద డాక్టర్లు గడిచిన మూడు మాసాల్లో ఒక్కొక్కరు సగటున 42 మాత్రమే చేశారు. ఇప్పటికీ చాలాచోట్ల కరోనా పేరుతో చికిత్స చేయడంలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో తక్కువ కంటి ఆపరేషన్లు చేస్తున్న ఆస్పత్రులు, డాక్టర్ల వివరాలను ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా పేద రోగులకు మెరుగైన చికిత్స చేయాలని అధికారులు ఇప్పటికే వైద్యులకు పిలుపునిచ్చారు.

ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో వైద్యులకు శిక్షణ
ప్రస్తుతం ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్యాన్నే అవ్వాతాతలకు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో ఇక్కడి వైద్యులకు బృందాల వారీగా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తోంది. ఇందుకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. దీంతో కేటరాక్ట్‌ సర్జరీలు మరింత నైపుణ్యంతో చేయడానికి వైద్యులకు వీలు కలుగుతోంది. 

కంటి వెలుగు చికిత్స వివరాలు..
► ఇప్పటివరకూ స్క్రీనింగ్‌ చేసింది : 11,80,170 మందికి
► మందులు అవసరమైన వారు : 4,64,850
► కేటరాక్ట్‌ ఆపరేషన్లు జరిగినవి : 93,566
► కళ్లద్దాలు అవసరమైన వారు : 6,05,680
► ప్రభుత్వాస్పత్రుల్లో జరిగిన కేటరాక్ట్‌ ఆపరేషన్లు :9,638
► ఎన్జీవో/ఆరోగ్యశ్రీ కింద చేసినవి : 48,129
► ప్రైవేటు ఆస్పత్రుల్లో.. : 35,799  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top