
అనంతపురం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రైవేట్ వాళ్లయితే జవాబుదారీతనంతో ఉంటారు
దసరాకు వాహనమిత్ర కింద ఆటోడ్రైవర్లకు రూ.15 వేలు
రైతులు యూరియా అనవసరంగా వాడొద్దు..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరిధిలో నిర్వహించడం కష్టమని, అందుకే పీపీపీ పద్ధతిలో ప్రైవేట్‌కు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆస్తి ప్రభుత్వానిదే అయినా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులు జవాబుదారీతనంతో నిర్వహిస్తారన్నారు. దీనివల్ల విద్యార్థులకు కన్వినర్ కోటాలో 50 శాతం సీట్లు వస్తాయన్నారు. బుధవారం అనంతపురంలో నిర్వహించిన సూపర్‌సిక్స్ – సూపర్‌హిట్ సభలో సీఎం మాట్లాడారు.
మెడికల్ కాలేజీలు అంటే ఏమిటో తెలియని వాళ్లు కూడా వాటి గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిందే తెలుగుదేశం పార్టీ అని చెప్పుకొచ్చారు. త్వరలో ఐదు మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో అమల్లోకి వస్తాయని, 2028 నాటికి మరో ఎనిమిది కాలేజీలు అందుబాటులోకి వస్తాయన్నారు. వాహనమిత్ర కింద ఆటో డ్రైవర్లకు దసరాకు ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తానన్నారు.
పాలనను గాడిలో పెడుతున్నాం
పరిపాలనను గాడిలో పెడుతున్నామని, సంక్షేమమంటే ఓట్ల రాజకీయం కాదని సీఎం పేర్కొన్నారు. సూపర్‌సిక్స్ హామీలను అమలు చేశామన్నారు. తల్లికి వందనం కింద రూ.10 వేల కోట్లు ఇచ్చామన్నారు. ఉచిత బస్సు ఇచ్చామని, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చామన్నారు. అన్నదాతా సుఖీభవ కింద తొలి విడతలో పీఎం కిసాన్‌తో కలిపి రూ.7 వేలు చెల్లించామన్నారు.
యూరియా అనవసరంగా వాడొద్దు..
యూరియా కొరత రానివ్వబోమని హామీ ఇస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఎంత అవసరం ఉందో అంతే యూరియా వాడాలని, అనవసరంగా వాడొద్దని రైతులను కోరుతున్నట్లు చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పానని, అన్నట్లే ఉద్యోగాలిచ్చామని సీఎం పేర్కొన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల పైచిలుకు ఉద్యోగాలు మెరిట్ ప్రకారం పారదర్శకంగా ఇచ్చామన్నారు. నైపుణ్య శిక్షణ ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు.
లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా మారుస్తున్నట్లు తెలిపారు. తాను తెచ్చిన సెల్‌ఫోన్‌లతోనే ఈరోజు యువత వాట్సాప్ సేవలు పొందుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. హంద్రీనీవా, గాలేరునగరి, తెలుగుగంగ ప్రాజెక్టులను తామే తెచ్చామన్నారు. రాయలసీమలో వర్షాలు పడకపోయినా 90 శాతం చెరువుల్లో నీళ్లు నింపామని, కృష్ణమ్మను కుప్పం వరకూ తీసుకెళ్లామని చెప్పారు. అనంతపురం జిల్లాలో జీడిపల్లి, భైరవానితిప్ప ప్రాజెక్టులపై ఫోకస్ పెడతానన్నారు.
హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలి..
ఓనమాలు తెలియని వారు కొంతమంది రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలన్నారు. ‘రప్పా రప్పా అని రంకెలేస్తున్నారు.. రప్పా రప్పా అంటే ఇక్కడున్నది సీబీఎన్, పవన్‌కళ్యాణ్. చూస్తూ ఊరుకోం..’ అని వ్యాఖ్యానించారు.
పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో ప్రజలు ఏం చేశారో చూశారన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా సూపర్‌సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ చెప్పారు. ‘చంద్రబాబు సూపర్ సిక్స్‌లే కాదు.. ఎన్నో సిక్స్‌లు కొట్టారు..’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వ్యాఖ్యానించారు. రెండేళ్లలో పోలవరం పూర్తవుతుందన్నారు.
ఆడబిడ్డ నిధి ఊసెత్తని బాబు
రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద ఏటా రూ.18 వేలు చొప్పున అందిస్తామన్న సూపర్‌సిక్స్ హామీపై సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు విప్పలేదు. ఈ పథకాన్ని అమలు చేస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తుందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నిరుద్యోగులకు నెలకు రూ.3,000 భృతిపై కూడా నోరు మెదపలేదు.