
పీపీపీ పేరిట 10 కళాశాలలు ప్రైవేట్‌కు ధారాదత్తం చేయనున్న బాబు సర్కార్
బలహీనవర్గాలకు వైద్యవిద్య, ఉచిత చికిత్సలు దూరం చేసేలా అడుగులు
సంపదసృష్టి అంటూ ప్రభుత్వ కళాశాలల్ని పప్పుబెల్లాల్లా అమ్మేసే కుట్ర
సాక్షి, అమరావతి : ఒంటిపై తెల్లటి ఆప్రాన్.. మెడలో స్టెతస్కోప్.. డాక్టర్ అనే పిలుపు.. ఈ గౌరవం తమ పిల్లలకు దక్కాలని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులు కలలుగంటారు. ఇలాంటి ఎందరో తల్లిదండ్రులు, విద్యార్థుల తెల్లకోటు కలలకు చంద్రబాబు ఉరితాడు బిగించారు. తాను సీఎంగా ఉండగా ఎన్నడూ ప్రభుత్వరంగంలో వైద్యకళాశాలల ఏర్పాటుకు కృషిచేయని చంద్రబాబు గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేపట్టిన వైద్యకళాశాలలపై ఏకంగా పెద్ద కుట్రకు తెరతీశారు.
పీపీపీ పేరిట ఈ కళాశాలలను అస్మదీయులకు పప్పుబెల్లాల్లా కట్టబెట్టటానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం బడుగు, బలహీనవర్గాల ప్రజల ఆరోగ్యానికి భరోసా లేకుండా చేయడంతో పాటు, విద్యార్థుల బంగారు భవిష్యత్‌ను చిదిమేస్తున్నారని సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పది ప్రభుత్వ వైద్యకళాశాలలను పీపీపీలో నిర్వహించేందుకు గురువారం కేబినేట్ ఆమోదం తెలిపిన క్రమంలో విమర్శలు హోరెత్తుతున్నాయి.
ప్రజల సంపద దోపిడీ
సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఉత్తర కుమారుడి ప్రగల్బాలు పలికారు. గద్దెనెక్కాక సంక్షేమానికి కత్తెరవేసి పేదలను నిలువునా దగాచేయడమే కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ముసుగులో ఏకంగా ప్రజల సంపదనే దోపిడీచేసే కార్యక్రమాలకు తెరతీశారు. ప్రభుత్వం రూ.వేలకోట్లు ఖర్చు చేసి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న మార్కాపురం, మదనపల్లె, ఆదోని, పులివెందుల కళాశాలలు, బోధనాస్పత్రులను ఏకంగా 60 ఏళ్లకు పైగా లీజుకు ఇవ్వడానికి బరితెగించారు.
కళాశాలలను దక్కించుకున్న పెట్టుబడిదారులు వైద్యసేవలకు పేదల నుంచి ముక్కుపిండి డబ్బు వసూలు చేసుకునే హక్కు కల్పిస్తున్నారు. గత ప్రభుత్వం ఒక్కో కళాశాలను 50 ఎకరాలకుపైగా భూమిలో నిరి్మంచేందుకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు నిర్వహణ బాధ్యతలు దక్కించుకునేవారికి ఎకరం భూమిని కేవలం రూ.100కే ప్రభుత్వం లీజుకు ఇవ్వబోతోంది. ఈ లెక్కన పరిశీలిస్తే రూ.వందల కోట్ల విలువ చేసే భూములను పెట్టుబడిదారులకు ఎంత చవకగా అప్పగిస్తోందో అర్థమవుతుంది.
డబ్బుంటేనే వైద్యం
ప్రైవేట్ వ్యక్తుల అజమాయిషీలో నడిచే వైద్యకళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల్లో పేదలకు పూర్తిస్థాయిలో ఉచిత వైద్యసేవలు అందవు. ఈ కళాశాలలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిస్తే ఓపీ, ఐపీ, రోగనిర్ధారణ, అవయవాల మార్పిడి వంటి పెద్ద శస్త్ర చికిత్సలు సైతం పేదలకు పూర్తి ఉచితంగా అందేవి. పీపీపీలో ప్రైవేట్‌కు ఇచ్చేస్తున్న నేపథ్యంలో ఇన్‌పేషంట్, రోగనిర్ధారణ, మందు బిళ్లలకు ప్రజల నుంచి యాజమాన్యం డబ్బు వసూలు చేసుకునే వీలు కల్పిoచారు.
సగం మెడిసిన్ సీట్లను కూడా ప్రైవేట్ వైద్యకళాశాలల్లో మాదిరిగానే అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చారు. వాస్తవానికి ప్రతిపక్షంలో ఉండగా కొత్త వైద్యకళాశాలల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ మెడిసిన్ సీట్ల విధానాన్నే రద్దుచేస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ హామీలిచ్చింది. అధికారం చేపట్టిన వందరోజుల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ సీట్ల జీవోలను రద్దుచేస్తామని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేశ్ అప్పట్లో ప్రకటించారు. గద్దెనెక్కాక విద్యార్థులను వంచించారు. సెల్ఫ్‌ఫైనాన్స్ కోటా ఎత్తేయకపోగా.. ఏకంగా ప్రభుత్వ కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారు.
బాబు ప్రైవేటీకరణ మోడల్‌తో రాష్ట్రం గతేడాది 700 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయింది. మరోవైపు ముందస్తు ప్రణాళిక ప్రకారం వచ్చే 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం కళాశాలలు ప్రారంభమై వీటి ద్వారా 1,050 సీట్లు సమకూరాల్సి ఉంది. ఇప్పుడు ఈ కళాశాలల్ని ప్రైవేట్‌కు ఇచ్చేస్తున్నారు. దీంతో 2024–25లో 700 సీట్లు, 2025–26లో 1,750 సీట్లు.. మొత్తం రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోతున్నారు.
చంద్రబాబు విధానమే ప్రభుత్వ వైద్యకళాశాలలకు వ్యతిరేకం
చంద్రబాబు విధానమే ప్రభుత్వ వైద్యకళాశాలలకు వ్యతిరేకం. ఆయన పాలనలో ప్రభుత్వ వైద్యకళాశాలలు ఏర్పాటు చేసిన దాఖలాలే లేవు. కార్పొరేట్ వైద్యకళాశాలలకే ఎప్పుడూ మొగ్గు చూపారు. ఎంబీబీఎస్, పీజీ ఫీజులు అమాంతం పెంచి ప్రైవేట్ కాలేజీలకు మేలుచేశారు. వైద్యవిద్య వ్యాపారాన్ని ప్రోత్సహించారు. ఆయన పాలనలో ప్రభుత్వ వైద్యకళాశాలలు ఏర్పాటవుతాయని ఆశించడం ప్రజల తప్పే అవుతుంది. – డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
వెనుకబడిన వర్గాలకు అన్యాయం
చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న వైద్యకళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం వెనుకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీవ్రనష్టం చేకూరుస్తుంది. ఈ వర్గాల పిల్లలకు వైద్యవిద్యను దూరం చేయడంతోపాటు, ఉచిత వైద్య చికిత్సలను దూరం చేస్తుంది. కరోనా అనంతరం ప్రతి జిల్లాలో ఉచితంగా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఈ క్రమంలో ప్రభుత్వరంగంలో కొత్త వైద్యకళాశాలల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇస్తోంది. అయితే రాష్ట్రంలో మాత్రం సీఎం చంద్రబాబు ప్రభుత్వరంగంలోని కళాశాలలను ప్రైవేట్‌కు అప్పగిస్తుండటం విడ్డూరంగా ఉంది. – శిఖరం నరహరి, ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ అధ్యక్షుడు