
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ ఆసుప్రతులు లేకుంటే ప్రైవేటు దోపిడీని ఆపేది ఎవరు? అని చంద్రబాబు సర్కార్‌ను ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్. చంద్రబాబు మూడుసార్లు సీఎం అయ్యారు. కనీసం ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి అయినా తీసుకొచ్చారా?. మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన ఏకైక ముఖ్యమంత్రి, దుర్మార్గుడు అయిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. 26 జిల్లాల్లో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉండాలని ప్రయత్నించిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిది అని చెప్పుకొచ్చారు.
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ప్రభుత్వ ఆసుపత్రులను నడపడం ప్రభుత్వం బాధ్యత. ప్రైవేటు దోపిడీకి చెక్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వ్యవస్థలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రైవేట్ దోపిడీ విచ్చలవిడిగా జరుగుతుంది. ఆ దోపిడీని సామాన్యుడు భరించలేడు. అందుకే ప్రభుత్వం కొన్ని వ్యవస్థలను బాధ్యతగా తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రులు, కళాశాలలు లేకపోతే పేదలు దోపిడీకి బలవుతారు. ఆర్టీసీ బస్సులను ప్రైవేట్ సంస్థలు నడిపిస్తే.. సామాన్యుడు బస్సు ఎక్కగలడా?.
ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు లేకపోతే పేదలు దోపిడీకి బలవుతారు. 2019కి ముందు చంద్రబాబు మూడుసార్లు సీఎం అయ్యారు. కనీసం ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి అయినా తీసుకొచ్చారా?. 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో మొత్తం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. మేం వచ్చాక ప్రతీ జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ తేవాలని ప్రయత్నించాం. 26 జిల్లాల్లో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉండాలని ప్రయత్నించాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో.. ఉచితంగా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది. ప్రైవేట్ దోపిడీకి చెక్ పడుతుంది అని అన్నారు.
చంద్రబాబు ఎంత దుర్మార్గుడు అంటే..
పులివెందుల మెడికల్ కాలేజీ 50 ఎంబీబీఎస్ సీట్లతో భర్తీకి అనుమతులు మంజూరయ్యాయి. చంద్రబాబు మాకు ఆ సీట్లు వద్దని లేఖ రాశారు. కేవలం పులివెందుల మెడికల్ కాలేజ్ అనే ఉద్దేశంతోనే అలా చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడైనా ఉంటాడా?. పేదవాళ్లకు, మధ్యతరగతి మంచి జరుగుతుందటే అడ్డుకుంటారా?. మానవత్వం ఉన్నోడెవడైనా ఇలా చేస్తాడా?. చంద్రబాబు సక్రమంగా పని చేసి ఉంటే.. ఈ ఏడాదిన్నర పాలనలో మరో నాలుగు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయ్యేవి. రాబోయే విద్యా సంవత్సరానికి మరో నాలుగు కాలేజీలకు చెందిన పనులు దగ్గర పడి ఉండేవి
వైఎస్సార్‌సీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు..
వైఎస్సార్‌సీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. పేదలకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు అందించాలనుకున్నాం. ఇవి ప్రారంభమైతే.. పేద ప్రజలకు ఉచితంగా అత్యాధునిక వైద్యం అందుతుంది. మా హయాంలో ఒక్కొక్కటిగా తరగతులు ప్రారంభించాయి. ఎన్నికల నాటికే పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు ప్రారంభం అయ్యాయి. మా హయాంలో 17లో ఏడు మెడికల్ కాలేజీలను క్లాస్‌లతో సహా అందుబాటులోకి తెచ్చాం. ఏడు కాలేజీల్లో క్లాసులు ప్రారంభమయ్యాయి. 800 సీట్లు అప్పటికే భర్తీ కూడా అయ్యాయి అని చెప్పుకొచ్చారు.

చంద్రబాబుకి సిగ్గుండాలి..
ఆలోచన మాది.. ఆచరణ మాది.. భూముల, నిధుల సమీకరణ మాది.. అన్నీ రెడీ అయ్యాయి. మరి చంద్రబాబు ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు?. మిగిలిన రూ.5 వేల కోట్ల పనులకు ఆర్థిక సాయం కూడా వచ్చింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో కొన్ని లక్షల మందికి మేలు జరిగేది కదా. వైద్య విద్య కోసం జార్జియా, ఉక్రెయిన్ లాంటి దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది. సిగ్గుండాలి.. ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడానికి!. మేం అధికారంలోకి వచ్చేనాటికి 2,360 సీట్లు ఉండేవి. కొత్త మెడికల్ సీట్ల ద్వారా 2550కు మెడికల్ సీట్లు పెంచే ప్రయత్నం చేశాం. మా హయాంలో 800 సీట్లు కొత్తగా తీసుకొచ్చాం. ఎక్కడ జగన్‌కు క్రెడిట్ దక్కుతుందో అని.. మెడికల్ కాలేజీల నిర్మాణాలను చంద్రబాబు ఇలా దెబ్బ తీస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు.