మేం రాగానే..ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ మెడికల్‌ కాలేజీలు | YS Jagan Mohan Reddy fires on privatization of new government medical colleges | Sakshi
Sakshi News home page

మేం రాగానే..ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ మెడికల్‌ కాలేజీలు

Sep 11 2025 5:20 AM | Updated on Sep 11 2025 5:20 AM

YS Jagan Mohan Reddy fires on privatization of new government medical colleges

రూ.లక్ష కోట్ల విలువైన సంపద కలిగిన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను మీ మనుషులకు శనక్కాయలు, బెల్లాలకు అమ్మేస్తారా?: సీఎం చంద్రబాబుపై మండిపడ్డ వైఎస్‌ జగన్‌ 

ప్రైవేట్‌ వ్యక్తులకు అమ్మేసే ఆ టెండర్లలో ఎవరూ పాల్గొనవద్దు..  

ఒకవేళ ఎవరైనా చేజిక్కించుకున్నా మేం అధికారంలోకి రాగానే కచ్చితంగా రద్దు చేస్తాం 

1923 నుంచి 2019లో మేం వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న మెడికల్‌ కాలేజీలు 12 మాత్రమే  

చంద్రబాబు తన హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ అయినా కట్టాడా?  

మా హయాంలో 17 కొత్త మెడికల్‌ కాలేజీలకు శ్రీకారం.. ఐదు చోట్ల తరగతులూ ప్రారంభం 

భవిష్యత్‌లో వాటి విలువ రూ.లక్ష కోట్లు పైనే.. కోట్ల మంది ప్రాణాలను కాపాడగలుగుతాయి 

ఎన్నికల నాటికే మరో రెండు కొత్త కాలేజీలు క్లాసులకు సిద్ధం.. ఆ వెంటనే పాడేరులో అడ్మిషన్లు 

పులివెందుల కాలేజీకి ఎన్‌ఎంసీ అనుమతులిస్తే.. మాకు వద్దంటూ చంద్రబాబు లేఖ 

మా ప్రణాళికతో ముందుకెళ్లి ఉంటే 2024–25లో 4.. 2025–26లో 7 కాలేజీలు మొదలయ్యేవి 

‘‘మా హయాంలో కొత్త మెడికల్‌ కాలేజీలే కాకుండా దాదాపు రూ.100 కోట్లతో పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు శాశ్వత పరిష్కారం చూపాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టాం. నాడు ృ నేడు కింద జిల్లా ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, మెడికల్‌ కాలేజీలు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల అభివృద్ధి, ఆధునికీకరణ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేశాం’’ 

‘‘ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా బస్సులు.. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే.. ఇవన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో లేకుంటే పేద, మధ్య తరగతివారు ప్రైవేట్‌ దోపిడీకి బలైపోతారు. ఆ దోపిడీకి చెక్‌ పెట్టడంతో పాటు ప్రజలకు సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’’

‘‘చంద్రబాబు ఎలాంటి దుర్మార్గుడంటే.. పులివెందుల నూతన మెడికల్‌ కాలేజీలో 50 ఎంబీబీఎస్‌ సీట్లతో తరగతులు ప్రారంభించడానికి ఎన్‌ఎంసీ గతేడాది అనుమతులిస్తే, ఆ సీట్లు మాకు వద్దంటూ ఆయన లేఖ రాశాడు. ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడైనా ఉన్నాడా? అంతుచిక్కని వ్యాధితో 43 మంది చనిపోతే గుర్తించలేని పరిస్థితుల్లోకి చంద్రబాబు ఇవాళ ఆరోగ్య రంగాన్ని దిగజార్చారు’’ -వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు అవినీతికి ప్రభుత్వ నూతన వైద్య కళాశాలల ప్రైవేటీకరణ పరాకాష్ట అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సూపర్‌ స్పెషాలిటీ వసతులతో ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందించే లక్ష్యంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో తాము చేపట్టిన కొత్త మెడికల్‌ కాలేజీలను కమీషన్లకు ఆశపడి తన మనుషులకు చంద్రబాబు దోచిపెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసే టెండర్లలో ఎవరూ పాల్గొనవద్దంటూ హెచ్చరించారు. 

ఒకవేళ టెండర్లలో ఎవరైనా పాల్గొని ఆ మెడికల్‌ కాలేజీలను చేజిక్కించుకున్నా.. తాము అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. మళ్లీ ఆ మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వం స్వాదీనం చేసుకుని నిర్వహిస్తుందని పునరుద్ఘాటించారు. సంపద సృష్టిస్తాననే హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రజల ఆస్తులను పప్పు బెల్లాల్లా అమ్మేసే కుంభకోణానికి పాల్పడుతూ సొంత ఆస్తులు పెంచుకుంటున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు.

 2019 నాటికే మూడు సార్లు సీఎంగా పనిచేసి ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేయని చంద్రబాబు ఇప్పుడు తమ ప్రభుత్వంలో చేపట్టిన కొత్త కళాశాలలను ఏకంగా అమ్మేస్తున్నారని, వైద్య ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. కూటమి సర్కారు ఆరోగ్యశ్రీకి రూ.నాలుగు వేల కోట్లు బిల్లులు బకాయిలు పెట్టడంతో నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో రోగులకు సేవలు అందడం లేదని.. ఈ పథకం కోసం ఏటా రూ.3,600 కోట్లు ఇవ్వటానికి మనసురాని చంద్రబాబు రూ.25 లక్షల ఇన్సూరెన్స్‌కు ప్రీమియం కింద రూ.ఐదారు వేల కోట్లు కడతారా? ఇదంతా డ్రామా కాదా? అని నిలదీశారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..   

ఒక్క మెడికల్‌ కాలేజీ ఆలోచనైనా చేశావా బాబూ..?
ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను చంద్రబాబు ప్రైవేటుపరం చేయడమంటే... ప్రజల బాగోగుల పట్ల లెక్కలేనితనం ఒక కారణమైతే, రెండోది తారస్థాయికి చేరిన ఆయన అవినీతి. 1923 నుంచి 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలే ఉన్నాయి. పద్మావతి అటానమస్‌ మెడికల్‌ కాలేజీతో కలిపితే 12 మాత్రమే ఉన్నాయి. 2019 నాటికి చంద్రబాబు మూడు సార్లు సీఎంగా 14 ఏళ్లు పాలించారు. ఆ సమయంలో ఆయన ఒక్క ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ అయినా కట్టాడా? కనీసం ఆ ఆలోచన అయినా చేశాడా? 

2019లో మా ప్రభుత్వం వచ్చాక జిల్లాల సంఖ్యను 26కి పెంచి, ఐదేళ్ల అతి కొద్ది సమయంలోనే ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, బోధనాస్పత్రి తెచ్చేందుకు కృషి చేశాం. డాక్టర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, నర్సింగ్‌ విద్యార్థులు, పీజీ స్టూడెంట్లు.. ఇలా అందరూ అక్కడ పనిచేస్తారు. దీంతో వారి ద్వారా జిల్లా ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు ఉచితంగా అందుతాయి. కళాశాల, బోధనాస్పత్రి మెడికల్‌ హబ్‌గా పనిచేస్తూ జిల్లాలో ఉన్న పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు మార్గనిర్దేశం చేస్తుంది. 

పేదలకు అత్యాధునిక వైద్యం పూర్తి ఉచితంగా అందుతుంది. ప్రైవేట్‌ ఆస్పత్రులు అనైతిక విధానాలతో ప్రజలను దోపిడీ చేయకుండా ఈ వ్యవస్థ కాపాడుతుంది. తద్వారా ప్రైవేట్‌లో అధిక ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. మన తెలివైన, పేద  విద్యార్థులకు అదనంగా మరిన్ని మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఒకవైపు మెడికల్‌ సీట్లు పెరిగి నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడంతోపాటు ఇంకోపక్క ఉచిత వైద్యం అందుతుంది. తద్వారా ప్రైవేట్‌ ఆస్పత్రుల దోపిడీకి శాశ్వతంగా అడ్డుకట్ట పడుతుంది. 

ఐదేళ్లలో రూ.ఐదు వేల కోట్లు ఖర్చు చేయలేరా..?
కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటు ఆలోచన, ఆచరణ, భూముల సేకరణ, నిధుల సమీకరణ.. అన్నీ మేమే చేసిపెట్టాం. చంద్రబాబు దీన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు? మేం దిగిపోయే నాటికి దాదాపుగా రూ.3 వేల కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మిగిలిన రూ.5 వేల కోట్లకు నాబార్డు, సెంట్రల్లీ స్పాన్సర్డ్‌ స్కీమ్, వివిధ రూపాల్లో నిధులు టైఅప్‌ అయ్యాయి. 

ఈ క్రమంలో ఐదేళ్లలో రూ.ఐదు వేల కోట్ల నిధులు ఖర్చు చేయలేరా? స్కామ్‌లు చేస్తూ, గవర్నమెంట్‌ ఆస్తులు ప్రైవేట్‌పరం చేయడానికి సిగ్గుండాలి. మంగళగిరి ఎయిమ్స్‌ కట్టడానికి 9 ఏళ్లు పట్టాయని నెట్‌లో చూశా. కళ్లముందే ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు ఎందుకు స్కామ్‌లు చేస్తూ ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నారు? భవిష్యత్‌లో ఆ 17 మెడికల్‌ కాలేజీల విలువ రూ.లక్ష కోట్లు దాటుతుంది. కొన్ని కోట్ల మంది ప్రాణాలను కాపాడగలుగుతాయి. 

ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలకు అనుమతుల వ్యవహారంలో నాడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆయన్ను పదవి నుంచి బలవంతంగా తప్పించే వరకూ తీసుకువెళ్లింది. ప్రస్తుతం చంద్రబాబు సిగ్గూ ఎగ్గూ, భయం లేకుండా 10 కొత్త మెడికల్‌ కాలేజీలను ఆయనకు కావాల్సిన వాళ్లకు పప్పు, బెల్లానికి ఇచ్చేస్తున్నాడు.  

రూ.25 లక్షల ఇన్సూరెన్స్‌ ఓ డ్రామా..
చంద్రబాబు పాలనలో వైద్య, ఆరోగ్య రంగం ఏ స్థాయికి దిగజారిపోయిందో చెప్పేందుకు ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితే నిదర్శనం. ఈ పథకానికి గత 15 నెలలుగా రూ.4,500 కోట్ల మేర చంద్రబాబు బకాయి పెట్టారు. ఆయన ఇచ్చింది రూ.600 కోట్లు. మిగిలిన దాదాపు రూ.4 వేల కోట్లు ఎగ్గొట్టాడు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు రాకపోవడంతో బోర్డు తిప్పేశారు. రోగులకు వైద్యం అందడం లేదు. ఇక ఆరోగ్య ఆసరాను మా ప్రభుత్వంలోనే ప్రవేశపెట్టాం. ఆపరేషన్‌ తర్వాత విశ్రాంతి సమయంలో జీవన భృతికి ఇబ్బంది లేకుండా నెలకు రూ.5 వేలు చొప్పున ఇచ్చాం. 

ఈ కార్యక్రమం కోసం సంవత్సరానికి రూ.450 కోట్లు ఖర్చవుతుంది. 15 నెలలంటే.. దాదాపు రూ.600 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు. మా హయాంలో క్యూఆర్‌ కోడ్‌తో ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ కార్డులను లబ్ధిదారులకు ఇచ్చాం. వైద్యం ఖర్చు రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపజేశాం. ఇప్పుడు కొత్తగా ఇన్సూరెన్స్‌ పథకమని అంటున్నారు. అది రూ.2.50 లక్షల వరకే ఇస్తారట. 3,257 ప్రొసీజర్లను 2,500కు తగ్గించేశారు. అంటే ఖరీదైన ప్రొసీజర్‌లకు కోత పెడుతున్నారు.  

నెలకు రూ.300 కోట్లు చొప్పున సంవత్సరానికి రూ.3,600 కోట్లు ఆరోగ్యశ్రీకి ఇవ్వడానికి మనసురాని చంద్రబాబు రూ.25 లక్షలు, రూ.2.5 లక్షలు అంటూ డ్రామాలు ఆడుతున్నారు. నిజంగానే రూ.25 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ చేస్తే ప్రీమియం రూ.ఐదారు వేల కోట్లు అవుతుంది. మరి ఇదంతా మోసం కాదా?

మేం చేసింది ఎక్కువ.. చెప్పుకుంది మాత్రం తక్కువ..
గత 15 నెలల పాలనలో వైద్య ఆరోగ్య రంగంలో చంద్రబాబు ఎన్నో దారుణాలకు పాల్పడ్డారు. ప్రివెంటివ్‌ కేర్‌ కింద దేశంలో ఎక్కడా లేని విధంగా మేం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్, విలేజ్‌ క్లినిక్స్‌ నిర్వీర్యం అయిపోయాయి. ప్రభుత్వాస్పత్రుల్లో మందులు, టెస్టులు లేవు. చివరికి దూదికి కూడా దిక్కులేని దుస్థితి. మిగిలిపోయిన నాడు – నేడు పనులు పూర్తిగా ఆగిపోయాయి. 

మా హయాంలో మేం చేసింది ఎక్కువ.. కానీ చెప్పుకున్నది మాత్రం తక్కువ. చెప్పుకోవడం మాకు చేతకాలేదు! మావాళ్లది కూడా తప్పు ఉంది... మెడికల్‌ కాలేజీలు కాకుండా దాదాపు రూ.100 కోట్లతో పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు శాశ్వత పరిష్కారం చూపాం. 

నాడు–నేడులో వైద్య కళాశాలలు, ప్రభుత్వాస్పత్రులు, ఇతర వనరులను బలోపేతం చేస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టాం. నాడు – నేడు కింద జిల్లా ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, మెడికల్‌ కాలేజీలు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల అభివృద్ధి, ఆధునికీకరణ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేసినా వాటిని చెప్పుకోవడం మాకు చేత కాలేదు. ఇప్పటికి కూడా మావాళ్లు ఇంకా గేర్‌లోకి రాలేకపోతున్నారు.  

17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం..
వైఎస్సార్‌సీపీ హయాంలో జిల్లాల సంఖ్యను పెంచి ఒకేసారి 17 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చాం. ఒక్కో కాలేజీకి కనీసం 50 ఎకరాల స్థలం ఉండేలా ఒక్కో కళాశాల నిర్మాణానికి రూ.500 కోట్లకుపైగా ఖర్చు చేసి అన్ని రకాల సదుపాయాలు ఉండేలా క్యాంపస్‌లు డెవలప్‌ చేశాం. 

విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్‌ కాలేజీలను 2023–24లోనే ప్రారంభించి తరగతులు కూడా మొదలు పెట్టాం. ఇవి కాకుండా ఎన్నికలు వచ్చేనాటికి పాడేరు, పులివెందుల కాలేజీలు కూడా క్లాసులకు సిద్ధమయ్యాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్లు ముగిసి తరగతులు కూడా ప్రారంభం అయ్యాయి. 

మానవత్వం ఉన్నోళ్లు చేసే పనేనా..?
చంద్రబాబు ఎలాంటి దుర్మార్గుడంటే.. పులివెందుల నూత­న మెడికల్‌ కాలేజీలో 50 ఎంబీబీఎస్‌ సీట్లతో తరగతులు ప్రారంభించడానికి నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) గతేడాది అనుమతులిస్తే, ఆ సీట్లు మాకు వద్దంటూ ఎన్‌ఎంసీకి లేఖ రాశాడు. ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్క­డైనా ఉన్నాడా? (ఎన్‌ఎంసీ లేఖను ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించారు). మెడికల్‌ కాలేజీ వస్తే పేదలకు మంచి జరుగుతుంది.  మేం నిర్దేశించిన ప్రకారం చంద్రబాబు ముందుకు వెళ్లి ఉంటే 2024–25 విద్యా సంవత్సరంలో పులివెందుల, ఆదోని, మదనపల్లి, మార్కాపురం కొత్త మెడికల్‌ కాలేజీలు కూడా అందుబాటులోకి వచ్చేవి. 

2025–26లో మరో ఏడు కాలేజీలు అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపు­రం, పాలకొల్లు, పెనుకొండ, పిడుగురాళ్లలో కూడా ప్రారంభం అయ్యేవి. మా ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్లు 2,360 ఉండగా కొత్త మెడికల్‌ కాలేజీల ద్వారా అదనంగా మరో 2,550 సీట్లు పెరిగితే మొత్తం 4,910 సీట్లు అందుబాటు­లోకి వచ్చేవి. మేం ప్రారంభించిన మెడికల్‌ కాలేజీల్లో అప్పటికే వాటి ద్వారా 800 సీట్లు భర్తీ చేశాం. పులివెందులలో కూడా చంద్రబాబు అంగీకరించి ఉంటే మరో 50 మెడికల్‌ సీట్లు వచ్చేవి. కానీ ఎక్కడ జగన్‌కు క్రెడిట్‌ వస్తుందోనని దెబ్బతీయడం ఎంతవరకు సమంజసం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement