
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా తాడిపత్రి టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా తమ బల ప్రదర్శనకు ఇరు వర్గాల నేతలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యం జేసీ వర్గం హెచ్చరికలతో తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. సీఎం చంద్రబాబు తాడిపత్రి పర్యటన నేపథ్యంలో టీడీపీలో వర్గపోరు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. సొంత పార్టీ నేతల వాహనాలపై విధ్వంసానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు సిద్దమయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ మధ్య వర్గాల మధ్య రాజకీయం ఘర్షణలకు దారి తీస్తోంది. తాడిపత్రి నుంచి జేసీ ఫోటో ఉన్న వాహనాలే చంద్రబాబు సభ వద్దకు వెళ్లాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోటో లేని వాహనాలు ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో జేసీ వర్గం.. నిర్దేశిత ఫార్మాట్, ఆడియోను విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మరోవైపు.. సుమారు వంద వాహనాల్లో చంద్రబాబు సభకు వెళ్లాలని టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ ఏర్పాట్లు చేశారు. జేసీ వర్గానికి కౌంటర్ ఇస్తూ వాహనాలపై స్టిక్కర్లు వేసినట్టు సమాచారం. ఇక, జేసీ వర్గం హెచ్చరికలతో తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉండగా.. ఇటీవల వినాయక నిమజ్జనం సందర్భంగా రాళ్లు జేసీ ప్రభాకర్-కాకర్ల రంగనాథ్ వర్గీయులు రాళ్లతో దాడులు చేసుకున్న విషయం తెలిసిందే.
