
ఆర్డీటీ సంస్థ పరిరక్షణకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టిన మాజీ ఎంపీ తలారి రంగయ్య.. పాల్గొన్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి (ఫైల్)
ఆర్డీటీపై కొనసాగుతున్న నిర్బంధాలు
ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ రెన్యువల్ చేయకుండా వేధింపులు
జిల్లా ప్రజాప్రతినిధులు కేంద్ర హోం మంత్రిని కలిసి విన్నవించినా ఫలితం శూన్యం
సంస్థకు రూ.వెయ్యికోట్లున్నా.. ఖర్చుచేయలేని పరిస్థితి
ఐదు దశాబ్దాలుగా పేదలకు పలుసేవలు అందిస్తున్న ఆర్డీటీ
ఆర్డీటీ పరిరక్షణ కోసం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉద్యమం
అనంతపురం జిల్లా రూపులేఖలు మార్చి.. కరువుసీమలో కల్పతరువుగా భాసిల్లుతున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు (ఆర్డీటీ) సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడటంతో పేదలు ఆందోళన చెందుతున్నారు. కరువు, పేదరికంతో కునారిల్లుతున్న ప్రజలను ఆపన్నహస్తంతో ఆదుకున్న ఆర్డీటీ సంస్థను కేంద్ర, రాష్ట్ర పాలకులు పీకల్లోతు కష్టాల్లోకి నెట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే ఆర్డీటీ, సత్యసాయి సంస్థలు గుర్తుకొస్తాయి. ఈ రెండు సంస్థలు కరువు రక్కసి నుంచి ప్రజలను కాపాడడంలో, గూడు లేనివారికి ఇళ్లు, పేదరికంతో మగ్గుతున్న వారికి ఉన్నతవిద్యను అందించి.. వారి జీవితాల్లో మార్పునకు విశేషకృషి చేశాయి.
ఇలాంటి ఆర్డీటీ సంస్థ సేవలు కొనసాగకుండా, పేదలకు సంక్షేమ ఫలాలు అందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోకాలడ్డుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్‌ఏ) లైసెన్స్‌ను ఆర్డీటీకి రెన్యువల్ చేయకపోవడంతో ఆ సంస్థ సేవలు నిలిచిపోయే పరిస్థితి ఉత్పన్నమైంది. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాల పేదలు ఆందోళన చెందుతున్నారు. – అనంతపురం
ఉవ్వెత్తున ఉద్యమం
ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ను 2025లో రెన్యూవల్ చేయలేదు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు పట్టించుకోలేదు. దీంతో ఆర్డీటీ నిధులు ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ఆందోళనలు, ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు వైఎస్సార్‌సీపీ కూడా ఆర్డీటీ పరిరక్షణకు కృషి చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆధ్వర్యంలో ఇటీవల కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంతవెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలోనూ ఆందోళనలు జరిగాయి. కలెక్టర్ కార్యాలయం వద్ద ఆర్డీటీ పరిరక్షణ కమిటీ నిరాహార దీక్షలు చేపట్టింది. సామాన్య ప్రజల నుంచి పెద్దఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో నష్టనివారణ చర్యలు చేపట్టిన కూటమి పార్టీలు ఆర్డీటీకి మద్దతు ఇస్తామంటూ కంటితుడుపుగా ప్రకటించాయి. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు గత నెల 11న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ పునరుద్ధరించాలని విన్నవించారు.
వారం రోజుల్లో పునరుద్ధరిస్తామని అమిత్‌షా హామీ ఇచ్చినట్లు అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మీడియాముఖంగా ఆర్భాటంగా ప్రకటించారు. కేంద్ర హోంమంత్రిని కలిసి దాదాపు నెలరోజులవుతున్నా.. ఇప్పటికీ అతీగతీ లేదు. కూటమి ప్రభుత్వానికి ఆర్డీటీ కార్యకలాపాలు కొనసాగాలనే చిత్తశుద్ధి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని సామాన్య ప్రజలు ప్రశి్నస్తున్నారు. మొక్కుబడిగా వెళ్లడం.. వినతి పత్రం ఇవ్వడం తప్ప ఆర్డీటీ పరిరక్షణకు ప్రజాప్రతినిధుల గళం పెద్దగా వినిపించడంలేదనే అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
నిరుపమాన సేవలు
సేవకు ప్రతిరూపంగా నిలిచిన ఆర్డీటీ అనంతపురంలో 1969లో ఏర్పాటైంది. నాటినుంచి నేటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలతో పేదలను ఆదుకుంది. ఆదుకుంటోంది. స్పెయిన్ దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఆర్డీటీపై అవగాహన ఉంది. దీంతో శక్తిమేర ఆరి్థకసాయం అందిస్తున్నారు. ఆర్టీటీ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, సొంతింటి కల సాకారం, వ్యవసాయం, క్రీడా, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ సంస్థ ఏటా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోనే రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల దాకా ఖర్చు చేస్తోంది. ఇప్పటికే దాదాపు మూడేళ్లు ఖర్చుచేసేంత మొత్తం (సుమారు రూ.వెయ్యికోట్లు) ఆర్డీటీ సంస్థ ఖాతాల్లో ఉంది. లైసెన్సు పునరుద్ధరణ అయ్యేవరకు ఈ నిదుల్ని ఖర్చుచేయరాదని ప్రభుత్వం షరతు విధించింది. దీంతో డబ్బున్నా.. ఖర్చుచేయలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ పునరుద్ధరించకపోతే ఏటా ఉమ్మడి అనంతపురం జిల్లా రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల విలువైన సేవలను కోల్పోవాల్సి వస్తుంది.
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మరో పోరాటానికి సిద్ధం
ఆర్డీటీ సంస్థ పరిరక్షణకు వైఎస్సార్‌సీపీ మరో పోరాటానికి సిద్ధమైంది. ఇప్పటికే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టి .. ఆర్డీటీ పరిరక్షణ ఆవశ్యకతను ప్రజలకు తెలిపింది. తాజాగా భారీస్థాయిలో బైక్ ర్యాలీ చేపట్టే దిశగా సమాయత్తం అవుతోంది. ఇందుకు జిల్లా ఎస్పీ నుంచి అనుమతి కూడా తీసుకున్నారు.