భార్యాభర్తల మృతికి కారణమైన ఒకే స్కూటీ! | Palnadu Tragedy, Mother Killed In Bypass Road Crash, Leaving Two Children Orphaned, Locals Demand Safety Measures | Sakshi
Sakshi News home page

భార్యాభర్తల మృతికి కారణమైన ఒకే స్కూటీ!

Mar 25 2026 12:28 PM | Updated on Mar 25 2026 12:38 PM

Married Woman Ends Life Road Accident In Palnadu District

పల్నాడు జిల్లా: మండల కేంద్రమైన రెంటచింతల గ్రామ సమీపంలో నున్న మిట్టగుడిపాడు క్రాస్‌ బైపాస్‌ రోడ్డు వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని జెట్టిపాలెం గ్రామానికి చెందిన పల్లెర్ల జ్యోతి(35) గుంటూరులో చదువుతున్న తన కుమారుడు శ్రీనివాసరెడ్డిని రెంటచింతలలో గుంటూరు బస్సు ఎక్కించి అనంతరం స్థానిక బ్యాంక్‌లో తన ఖాతాకు సంబంధించిన పనిని ముగించుకుని జెట్టిపాలెంకు స్కూటీపై బయలు దేరింది. మిట్టగుడిపాడు క్రాస్‌ వద్ద బైపాస్‌ రోడ్డు దాటుతుండగా గురజాల నుంచి మాచర్ల వైపు అతివేగంగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టడంతో స్కూటీ సుమారు 60 మీటర్లు దూరం ఎగిరి పడింది. 

ఈ ప్రమాదంతో తలకు, చేతులకు, కాళ్లకు తీవ్రగాయాలు కాగా పల్లెర్ల జ్యోతి అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఎయిర్‌ బెలూన్‌ ఓపెన్‌ కావడంతో డ్రైవర్‌ ఎం.మల్లిఖార్జునరావు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలానికి గురజాల ఇన్‌చార్జి డీఎస్పీ వెంకట రమణ, ఎస్‌ఐ సీహెచ్‌ నాగార్జున వెంటనే చేరుకుని ప్రమాదం ఎలా జరిగిందో విచారించారు. మృతురాలి తల్లి చేర్రెడ్డి నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పంచనామ నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

భార్యాభర్తల మృతికి కారణమైన ఒకే స్కూటీ! 
మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పల్లెర్ల జ్యోతి నడిపిన స్కూటీ 5 సం. కిందట ఆమె భర్త పల్లెర్ల రామచంద్రారెడ్డి దివ్యాంగుడు కావడంతో మూడు చక్రాల స్కూటీ మీద పొలం వెళ్లి ఇంటికి వస్తున్న సమయంలో బోల్తాపడి తీవ్రంగా గాయపడ్డాడు. రామ చంద్రారెడ్డి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ స్కూటీకి ఉన్న మూడవ చక్రం తీసివేసి జ్యోతి ద్విచక్ర వాహనంగా వినియోగిస్తుంది. 

ఈ నేపథ్యంలో జరిగిన ప్రమాదంలో ఆమె మృతిచెందింది. వేర్వేరు ప్రమాదాలలో తల్లిదండ్రులిద్దరిని కోల్పోయిన రామచంద్రారెడ్డి, జ్యోతిల 14, 17 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు అనాధలుగా మారారు. 2025 మార్చి 1 వ తేదిన జాతీయ అధికారులు, ట్రాన్స్‌పోర్టు అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ కూడలిని బ్లాక్‌స్పాట్‌గా గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏడాది కాలంలో ఇక్కడే పలు రోడ్డు ప్రమాదాలు జరిగి  కుటుంబాలు వీధులపాలైనట్లు స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని స్థానిక కోరుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement