‘మాన్సాస్‌’ నుంచి నన్ను తప్పించండి

Mansas Trust EO Venkateswara Rao letter to Andhra Pradesh government - Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి ట్రస్ట్‌ ఈవో వెంకటేశ్వరరావు లేఖ

విజయనగరం: మాన్సాస్‌ ట్రస్ట్‌పై సర్వాధికారాల కోసం కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు ఆరాటపడుతున్నారా? ఈ విషయంలో అధికారులపై తీవ్రస్థాయిలో వేధింపులకు గురిచేస్తున్నారా?.. ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తే వీటన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ నిబద్ధతతో పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్‌ హోదా కలిగిన మాన్సాస్‌ ట్రస్ట్‌ ఈవో డి. వెంకటేశ్వరరావుకు కనీస సహకారం అందించకపోగా.. తాము చెప్పినట్లే నడుచుకోవాలంటూ ట్రస్ట్‌ చైర్మన్‌ వర్గాల నుంచి ఒత్తిడి తీవ్రమవుతోంది. ఇది తట్టుకోలేని ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకు గత నెల 31న రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీకి లేఖ రాశారు. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాన్సాస్‌ ట్రస్ట్‌ ఈవోగా విధులు నిర్వహిస్తున్న తనను వ్యక్తిగత సమస్యల కారణంగా తిరిగి రెవెన్యూ విభాగానికి పంపించాలంటూ లేఖలో కోరారు. 

అప్పటి నుంచి ఈవో టార్గెట్‌?
గత తొమ్మిది నెలలుగా ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయనను ట్రస్ట్‌ చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు తిరిగి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు.. ట్రస్ట్‌ సిబ్బంది జీతాల చెల్లింపులో జాప్యానికి ఈవోయే కారణమంటూ అశోక్‌గజపతిరాజు వర్గీయులు ఉద్యోగులందరినీ రెచ్చగొట్టారు. ఆయనపై భౌతికదాడి చేయించేందుకు సైతం సిద్ధమైనట్లు కూడా ఆరోపణలున్నాయి.
 
కొనసాగుతున్న విజిలెన్స్‌ విచారణ
అధికారులు అడిగిన రికార్డులు అందిస్తాం ∙సింహాచలం దేవస్థానం ఈవో సూర్యకళ సింహాచలం (పెందుర్తి): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన ఆస్తుల జాబితా నుంచి టీడీపీ ప్రభుత్వ హయాంలో 862.22 ఎకరాలు తప్పించడంపై విజిలెన్స్‌– ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ కొనసాగుతోందని ఆలయ ఈవో సూర్యకళ తెలిపారు. వారు అడిగిన రికార్డులను దేవస్థానం తరఫున అందజేస్తామని చెప్పారు. సింహాచలం దేవస్థానం కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రికార్డుల నుంచి భూములు ఎలా తొలగింపునకు గురయ్యాయని అధికారులు అడిగారన్నారు. అలాగే ఆ భూములు ఏ పట్టా ప్రకారం దేవస్థానానికి దఖలు పడ్డాయన్న విషయంపై లిఖితపూర్వకంగా వివరాలు ఇవ్వాలని అధికారులు కోరారని తెలిపారు. అప్పటి ఈవో హయాంలో జరిగిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, కోర్టు కేసులు, తదితర వివరాలను కూడా విజిలెన్స్‌ అధికారులు అడిగారని చెప్పారు. ఇప్పటికే భూములకు సంబంధించిన రిపోర్టు సిద్ధంగా ఉందన్నారు. ఎఫ్‌డీలు, కోర్టు కేసుల నివేదికను తయారు చేస్తున్నామని తెలిపారు. రెండు రోజుల్లో మొత్తం రిపోర్టు అందజేస్తామన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top