కాకినాడలో కోటి సంతకాల ప్రతులను విజయవాడ పంపిస్తూ చేపట్టిన ర్యాలీకి హాజరైన అశేష జనవాహిని (ఫైల్)
18 నెలలుగా హామీల అమలులో మోసం.. పాలనలో వైఫల్యాలు.. అంతులేని అవినీతి
కోటి సంతకాల ఉద్యమం వీటన్నింటినీ ఎత్తిచూపిందంటున్న రాజకీయ విశ్లేషకులు
ఓ అంశంపై 1,04,11,136 మంది స్వచ్ఛందంగా సంతకాలు చేయడం చరిత్రాత్మకం
ఈ స్థాయిలో నిరసన దేశ చరిత్రలో ఇదే ప్రథమం అంటున్న ప్రజా సంఘాలు
నానాటికీ పడిపోతున్న చంద్రబాబు, టీడీపీ సర్కార్ గ్రాఫ్..
వైఎస్సార్‌సీపీకి ప్రజా మద్దతు పెరుగుతోందనడానికి ఇదే తార్కాణం
తాజా పరిణామాలతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో కదనోత్సాహం
సాక్షి, అమరావతి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమానికి ఇచ్చిన పిలుపు ప్రభంజనమైంది. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరిస్తూ పేదలకు నాణ్యమైన వైద్యాన్ని.. వైద్య విద్యను దూరం చేయడంపై ప్రజలు తిరగబడ్డారు. తనకు కావాల్సిన వారికి సంపద సృష్టించి.. తద్వారా ‘నీకింత–నాకింత’ అంటూ పంచుకుతినే కుట్రతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కోటి మందికి పైగా ప్రజలు సంతకాలు చేసి బాబును కడిగి పారేశారు.
క్రెడిట్ మరొకరికి దక్కుతుందనే కక్షతో మెడికల్ కాలేజీలను ప్రైవేటు ముసుగులో బినామీలకు కట్టబెట్టే కుట్రను బట్టబయలు చేశారు. సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని వర్గాలకు చెందిన 1,04,11,136 మంది ప్రజలు సంతకాలు చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశ చరిత్రలో ఎన్నడూ ఒక ప్రజా ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా ఈ స్థాయిలో సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ సంతకాలు చేసిన దాఖలాలు లేవని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసనాగ్రహమే కాదు.. చంద్రబాబు సర్కార్‌పై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు కోటి సంతకాల ప్రజా ఉద్యమం దర్పణం పట్టిందని విశ్లేషిస్తున్నారు. చారిత్రక ఘట్టంగా నిలుస్తూ కోటి సంతకాల ఉద్యమం గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు నూతనోత్సాహంతో కదం తొక్కుతున్నాయి.
కోటి మందిని కదిలించిన ఒక్క పిలుపు
» రాష్ట్రంలో 1923 నుంచి 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు.. పద్మావతి అటానమస్ మెడికల్ కాలేజీతో కలిపితే 12 ఉన్నాయి. 2019 నాటికి చంద్రబాబు మూడు సార్లు అంటే 1995–99, 1999–04, 2014–19 మధ్య 14 ఏళ్లు సీఎంగా పాలించినప్పటికీ ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు.
» వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 13 జిల్లాలను పునర్విభజించి, 26 జిల్లాలుగా ఏర్పాటు చేసింది. ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతోపాటు నాణ్యమైన వైద్యం అందించడం.. పేదలకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఒక్కో కాలేజీకి కనీసం 50 ఎకరాల స్థలం ఉండేలా భూమిని కేటాయించారు. ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లకుపైగా ఖర్చు చేసి, అన్ని రకాల సదుపాయాలు ఉండేలా క్యాంపస్‌ల అభివృద్ధి పనులు ప్రారంభించారు. వాటిని పూర్తి చేయడానికి అవసరమైన నిధులను నాబార్డు.. కేంద్ర పథకాల నుంచి సమకూర్చారు.
» కోవిడ్ మహమ్మారి వంటి సమస్యలు రెండేళ్లపాటు రాష్ట్రాన్ని పీడించినా, ఎన్ని ఇబ్బందులున్నా విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను 2023–24లో ప్రారంభించి, తరగతులు మొదలు పెట్టారు. ఎన్నికలు వచ్చే నాటికి పాడేరు, పులివెందుల కాలేజీలు కూడా తరగతులు ప్రారంభించడానికి సిద్ధమయ్యాయి.
» ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్లు ముగిసి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. వైఎస్ జగన్ సర్కార్ సమకూర్చిన నిధులను సద్వినియోగం చేసుకుని.. ఆ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం
చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టి ఉంటే.. 2024–25 విద్యా సంవత్సరంలో ఆదోని, మదనపల్లి, మార్కాపురం మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చేవి.
» ఈ విద్యా సంవత్సరం అంటే 2025–26లో అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుకొండలో కూడా వైద్య కళాశాలలు ప్రారంభం అయ్యేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు 2,360 మాత్రమే ఉండేవి. కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అదనంగా మరో 2,550 సీట్లు పెరిగితే.. మొత్తమ్మీద 4,910 సీట్లు అందుబాటులోకి వచ్చేవి.
» వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తరగతులు ప్రారంభమైన కొత్త మెడికల్ కాలేజీల్లో అప్పట్లోనే 800 సీట్లు భర్తీ చేశారు. పులివెందుల మెడికల్ కాలేజీలో తరగతులు ప్రారంభించేందుకు చంద్రబాబు సర్కార్ అంగీకరించి ఉంటే మరో 50 సీట్లు వచ్చేవి. కానీ చంద్రబాబు కాలదన్నారు. ఎక్కడ వైఎస్ జగన్‌కు క్రెడిట్ వస్తుందోనని ఏకంగా ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు ప్రైవేటీకరించడానికి పూనుకున్నారు.
దీనిపై ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలన్నీ అందుబాటులోకి వచ్చేవన్న జగన్ వాదనను సమర్థిస్తున్నారు.
» ఈ క్రమంలో చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబర్ 7న వైఎస్ జగన్ ప్రజా ఉద్యమానికి పిలుపునిస్తూ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఆ పిలుపు ప్రభంజనంగా మారింది. అక్టోబర్ 9న వైఎస్ జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించి సమరభేరి మోగించారు.
ప్రజా తిరుగుబాటు
» వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు గ్రామాలు, పట్టణాలు, వార్డుల్లోనూ వైఎస్సార్‌సీపీ నేతలు అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు భారీ ఎత్తున రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు.
చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజుకు సగటున రూ.520.94 కోట్లు అప్పు చేస్తూ.. దాన్ని దుబారా చేస్తూ దుర్వినియోగం చేస్తోందని.. ఒక్క రోజు చేసిన అప్పుతో ఒక మెడికల్ కాలేజీని పూర్తి చేయొచ్చని.. పేదలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్య అందకుండా చేయడం, బినామీలకు కట్టబెట్టడం కోసమే మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేటీకరిస్తున్నారని రచ్చబండ కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు వివరించారు.
» దీనికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పత్రాలపై తమ చిరునామా, ఫోన్ నంబర్లు రాసి సంతకాలు చేశారు. నవంబర్ 12న నియోజకవర్గాల కేంద్రాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ర్యాలీల్లో అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కడంతో ర్యాలీలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి.
» ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా చేసిన సంతకాల పత్రాలను ప్రదర్శిస్తూ వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ర్యాలీల్లో ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. పోలీసుల ద్వారా ర్యాలీలను అడగడుగునా అడ్డుకోవడానికి చంద్రబాబు చేసిన కుట్రలను జనం పటాపంచలు చేశారు.
ఈ నెల 15న జిల్లా కేంద్రాలలో కోటి సంతకాల పత్రాలను ప్రదర్శిస్తూ నిర్వహించిన ర్యాలీల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి చంద్రబాబు సర్కార్‌పై రణభేరి మోగించారు. ఆ పత్రాలను వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి వైఎస్ జగన్ గవర్నర్‌కు అందజేసిన సందర్భంలోనూ జనం నీరాజనాలు పలికారు.
» ఈ ఉద్యమాన్ని ఆసాంతం పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపైనే కాదు చంద్రబాబు సర్కార్‌పై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు ఇది దర్పణం పట్టిందని చెబుతున్నారు. వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలను కొనసాగించడంతోపాటు సూపర్ సిక్స్, సూపర్ సెవన్ పథకాలు అమలు చేస్తానంటూ ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు.
» అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలను చంద్రబాబు సర్కార్ రద్దు చేసింది. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ పథకాలను మోసాలుగా మిగిల్చింది. రెడ్ బుక్‌తో పరిపాలనతో అడుగడుగునా అదుపు తప్పుతోంది. సర్కార్‌లో అవినీతి తార స్థాయికి చేరింది. దాంతో ప్రజల్లో చంద్రబాబు సర్కార్‌పై వ్యతిరేకత పెల్లుబుకుతోంది.
ఇది కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో ప్రస్ఫుటితమైందని సీనియర్ రాజకీయ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రజల్లో చంద్రబాబు, టీడీపీ కూటమి సర్కార్ గ్రాఫ్ నానాటికీ పడిపోతుంటే.. వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీ గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోందని.. వైఎస్ జగన్ ఒక్క పిలుపుతో 1,04,11,136 మంది ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేయడమే ఇందుకు తార్కాణమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.


