
రాజమండ్రిలో వైఎస్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదితరులు
ఊరూరా ఘనంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి
దేశ, విదేశాల్లో ఘనంగా నివాళులు
వెల్లువెత్తిన సేవా కార్యక్రమాలు.. అన్న, వస్త్ర, రక్తదానాలు
పండ్లు, దుప్పట్లు, దివ్యాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ
వైఎస్సార్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నేతలు, అభిమానులు
తెలుగు రాష్ట్రాలు భారత రత్నకు ప్రతిపాదించాలని పలువురి ఆకాంక్ష
సాక్షి, అమరావతి/నెట్‌వర్క్: మహానేత, దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా, దేశ విదేశాల్లో నాయకులు, అభిమానులు, ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. మరుపురాని మహోన్నత నేత అని కొనియాడారు. వాడవాలా ఆయన విగ్రహాలు, చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించారు. జోహార్ వైఎస్సార్.. వైఎస్సార్ అమర్‌రహే అన్న నినాదాలు ఊరూరా ప్రతిధ్వనించాయి. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ సహా వివిధ ప్రాంతాల్లోను, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోని వివిధ రాష్ట్రాల్లోను వైఎస్సార్ వర్ధంతిని నిర్వహించారు.
మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల నేతలు, ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమాల్లో పలుచోట్ల అన్నదానం, వస్త్రదానం, రక్తదానం చేశారు. వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ చేశారు. పేదలకు దుప్పట్లు అందజేశారు. దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు.
పలుచోట్ల వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమానంగా ముందుకు తీసుకెళ్లి, పరిపాలనలో సమానత్వాన్ని చాటుకుంటూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని పాలకుడంటే ఎలా ఉండాలో చాటిచెప్పారని ప్రజలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రవాసాంధ్రులు స్మరించుకున్నారు.
» వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద పలువురు నివాళులర్పించారు. పలు ప్రాంతాల నుంచి బస్సులు, ఇతర వాహనాల్లో సోమవారం రాత్రికే ఇడుపులపాయ చేరుకున్నారు. సమాధిపై పూలమాలలుంచి మహానేతను స్మరించుకున్నారు.
» కువైట్‌లోని మాలియా ప్రాంతంలోని పవన్ ఆంధ్ర రెస్టారెంట్‌లో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
» ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. రూరల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు బి. మదన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో అభిమానులు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ’వైఎస్సార్ అమర్ రహే’ నినాదాలు చేశారు. వైఎస్సార్‌కు భారతరత్న ఇవ్వాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి ప్రతిపాదించాలని కోరారు. ఇంద్రప్రస్థ తెలుగు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి. కోటిరెడ్డి, తెలుగు క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
» అలాగే, దక్షిణాఫ్రికా లోని జొహనెస్‌బర్గ్‌లోని కమ్యూనిటీ సెంటర్ బేకరీలో రూ.5 లక్షల విలువైన వస్త్రాలు, ఆహార ధాన్యాలను ప్రవాసాంధ్రులు పంపిణీ చేశారు.