
ప్రజల హృదయాల్లో వైఎస్సార్ స్థానం ఎప్పటికీ పదిలమే
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి
పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన నేతలు
రక్తదానం చేసిన అభిమానులు
దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, పేదలకు దుస్తుల పంపిణీ
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలతో.. చిరునవ్వుతో కూడిన పలకరింపుతో ప్రతి గుండెను కదిలించిన సామాజిక వైద్యుడు, మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజల గుండెల్లో వైఎస్సార్ స్థానం ఎప్పటికీ పదిలంగా ఉంటుందని నివాళులర్పించారు. మంగళవారం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి వైఎస్సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, పేదలకు దుస్తుల పంపిణీని ప్రారంభించారు. అనంతరం సజ్జల మాట్లాడుతూ.. పేదరికం, వెనుకబాటుతనాన్ని పారద్రోలడానికి సిద్ధాంతాలు, సమీక్షల పేరుతో కాలయాపన చేయడం సరైన విధానం కాదని, సహజ స్వభావాలతో ఆలోచించి చికిత్స చేయాలని నిరూపించిన సామాజిక వైద్యుడు రాజశేఖరరెడ్డి అని చెప్పారు. రైతులు, విద్యార్థులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాల వారిని ముందుకు నడిపించిన మహోన్నత నాయకుడు అన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల ద్వారా పెనుమార్పులు తీసుకొచ్చిన మహనీయుడు వైఎస్ అన్నారు. ఉచిత విద్యుత్ ద్వారా ఎంతోమంది రైతులకు, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేద కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా కోట్ల మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసిన ఆదర్శప్రాయుడు వైఎస్ అని గుర్తు చేశారు.
వైఎస్సార్ ఆశయాలకు ప్రతిరూపం వైఎస్ జగన్
వైఎస్సార్ మనకు దూరమైనా వైఎస్ జగన్ రూపంలో గొప్ప వారసత్వాన్ని అందించారని సజ్జల పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో వైఎస్ జగన్ విజయవంతమయ్యారని, వైఎస్సార్సీపీని ఏర్పాటు చేసి ఈ ప్రజా సంకల్పంలో మనల్ని అందర్నీ భాగస్వాముల్ని చేసినందుకు గర్వంగా భావిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలకు వైఎస్సార్ బీజం వేస్తే ఐదేళ్ల పాలనలో అంతకన్నా మెరుగ్గా మరిన్ని పథకాలను వైఎస్ జగన్ ముందుకు తీసుకెళ్లగలిగారని చెప్పారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పార్టీ కార్యాలయ ఇన్‌చార్జి లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ నాయకులు జూపూడి ప్రభాకర్‌రావు, పూనూరు గౌతమ్‌రెడ్డి, కాకుమాను రాజశేఖర్, పోతిన మహేష్, చల్లా మధు, కొమ్మూరి కనకరావు, పానుగంటి చైతన్య, ఎ.రవిచంద్ర, పార్టీ గ్రీవెన్స్, లీగల్, యువజన, మహిళా విభాగాల నాయకులు పాల్గొన్నారు.