
కర్నూలు జిల్లా: మండల కేంద్రం వెల్దురిలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధమే దీనికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... వెల్దుర్తిలోని 14 వ వార్డులో నివసించే ఉజ్మా (34)కు, మస్తాన్ అనే గౌండతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. వెల్దురిలోని వడ్డెగేరిలో నివసించే వ్యక్తితో ఉజ్మా వివాహేతర సంబంధం కొనసాగించింది. ఇటీవల ఆమె బీజేపీ మండల నాయకురాలితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంది.
ఈ క్రమంలో కృష్ణగిరి మండలం తొగర్చేడుకు చెందిన మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో అనుమానం పెంచుకున్న మొదటి ప్రియుడు తాను ఖర్చు చేసిన పైకం ఇవ్వాలని ఇటీవల ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఈ విషయంపై మృతురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేసినట్లు తెలిసింది. అయితే, బుధవారం మధ్యాహ్నం ఉజ్మా ఇంటికి మాజీ ప్రియుడు వెళ్లాడు. ఇంట్లో ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. కుమార్తెలు ఇంటికి వచ్చి చూస్తే తలుపు వేసి ఉంది.
పొరుగువారి సాయంతో తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా తల్లి విగతజీవిగా కనిపించింది. కాగా మృతురాలు ఇంటా, బయట ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల హార్డ్‌డిస్‌్క, ఆమె సెల్‌ఫోన్ సైతం హంతకుడు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట ప్రజ్ఞాపూర్‌లో గౌండ పని చేసేందుకు వెళ్లిన మస్తాన్.. భార్య హత్య విషయం తెలుసుకుని తిరుగుప్రయాణమయ్యాడు. సమాచారం అందుకున్న సీఐ మధుసూధన్ రావు, ఎస్‌ఐ అశోక్‌లు సంఘటనాస్థలికెళ్లి విచారించారు. మృతురాలి తల్లి నూర్జహాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.