
మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు
కర్నూలు జిల్లా గుడేకల్‌లో ఘటన
ఎమ్మిగనూరు రూరల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడేకల్‌లో జరిగింది. వివరాలు.. నందవరానికి చెందిన బలుదూరు లక్ష్మీదేవి మూడేళ్లుగా తన ఇద్దరు కుమారులు నాగరాజు(45), రాజు(39), మనవడు లక్ష్మీనరసింహ(14)తో కలసి గుడేకల్‌లోని నీలకంఠశ్వేరస్వామి దేవాలయం స్థలంలో ఉన్న గోడకు రేకుల షెడ్డు వేసుకొని జీవిస్తోంది.
సోమవారం రాత్రి వారంతా భోజనం చేసి నిద్రపోయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తడిసిన రాతి గోడ.. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వారిపై పడింది. కేకలు విన్న స్థానికులు వచ్చి వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ తండ్రి నాగరాజు, కుమారుడు లక్ష్మీనరసింహ అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న రాజు మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. లక్ష్మీదేవి ప్రస్తుతం చికిత్స పొందుతోంది.