తుని కేసులో చెరువు దగ్గర ఏం జరిగింది? | Mystery Surrounds Death Of TDP Leader Narayanarao In Tuni Incident, Family Suspects Foul Play And Police Deny Rumours | Sakshi
Sakshi News home page

Tuni Incident: తుని కేసులో చెరువు దగ్గర ఏం జరిగింది?

Oct 23 2025 10:18 AM | Updated on Oct 23 2025 11:47 AM

Tuni Incident: Narayanarao Family Suspects Foul Play, Police Deny Rumours

సాక్షి, కాకినాడ: తుని ఘటన(tuni Incident)లో పోలీసుల అదుపులో టీడీపీ నేత నారాయణరావు మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారిపోయే ప్రయత్నం చేశాడా? నిజంగానే ఆత్మహత్యకు ప్రయత్నించాడా? అనేది చెరువు దగ్గర ఏం జరిగిందో తెలిస్తేనే నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. ఈలోపే నారాయణ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. 

‘‘నలుగురు పోలీసులు రాత్రి మా ఇంటికి వచ్చి రిమాండ్‌ పేరిట బలవంతంగా సంతకాలు సేకరించారు. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో చెరువులోకి దూకాడని అంటున్నారు. చనిపోయాడని మాత్రం ఈ ఉదయం 7గం. సమాచారం ఇచ్చారు. ఘటన జరిగిన వెంటనే మాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు?. అందుకే అనుమానాలు కలుగుతున్నాయి. మా అనుమానాలు నివృత్తి చేయాలంటే.. పోలీస్ స్టేషన్ నుండి రిమాండ్‌ కోసం తరలిస్తుండగా మార్గ మద్యలో ఉన్న సీసీ కెమెరాలు బయటపెట్టాలి’’ అని నారాయణరావు కొడుకు సురేష్‌, కోడలు డిమాండ్‌ చేస్తున్నారు. 

ఈ క్రమంలో కోమటి చెరువు వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నారాయణరావుది సూసైడ్‌ కాదంటూ బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వాళ్లను పక్కకు లాగేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.  

అయితే.. పోలీసులు మాత్రం ఆ అనుమానాలను తోసిపుచ్చుతున్నారు. చేసిన పనికి సిగ్గుపడి నారాయణరావు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చెబుతున్నారు(Narayanarao Suicide). ‘‘అర్ధరాత్రి మెజిస్ట్రేట్‌ వద్దకు తీసుకెళ్తున్న సమయంలో వాష్‌రూమ్‌ వస్తుందని నారాయణరావు అడిగాడు. వెంటనే ఎస్కార్ట్‌ వాహనం ఆపాం. వర్షం పడుతుండడంతో పోలీసులు పక్కనే ఉన్న చెట్ల కిందకు వెళ్లారు. చీకటి కావడంతో నిందితుడు పోలీసులకు కనిపించలేదు. ఈలోపు నీళ్లలో దూకినట్లు శబ్దం వచ్చిందని సిబ్బంది చెప్పారు. రాత్రంతా వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ ఉదయం వెతికితే మృతదేహం దొరికింది’’ అని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు.

సంచలన విషయాలు.. 
తుని మైనర్‌ బాలిక(13) లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాలికకు మాయమాటలు చెప్పి.. వరుసకు తాతను అవుతానంటూ హాస్టల్‌ సిబ్బందిని నమ్మించి నారాయణరావు ఆమెను ఐదుసార్లు బయటకు తీసుకెళ్లాడు. బాలికకు తండ్రి లేకపోవడంతో నారాయణరావు చెప్పింది నిజమేనని హాస్టల్‌ సిబ్బంది నమ్మారు. అలా.. మూడు సార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు.  

మరోసారి తన వెంట తీసుకెళ్లి ఓ తోటలో అఘాయిత్యానికి పాల్పడబోయాడు. అది గమనించి తోట కాపలాదారు అడ్డుకున్నాడు. ఆ సమయంలో తాను టీడీపీ నేతనని, తన జోలికి వస్తే ఖబడ్దార్‌ అంటూ బెదిరించాడు.  ఈలోపు కొందరు వీడియో తీసి అతగాడి బాగోతాన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నారాయణరావును గుడ్డలూడదీసి చితకబాది పోలీసులకు అప్పగించారు. 

బుధవారం సాయంత్రం నారాయణరావును అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసిన రాత్రి మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచేందుకు తీసుకెళ్తున్న క్రమంలో చెరువులో దూకేశాడని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement