
సాక్షి, విజయవాడ: నగరంలో దారుణం జరిగింది. ఆర్‌అండ్‌బి రిటైర్డ్ ఇంజనీర్ రామారావు అనుమానాస్పదంగా మృతి చెందారు. రామారావు ఇంట్లో కేర్ టేకర్‌గా పని చేస్తున్న మహిళే ఆయనను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. కేర్ టేకర్ అనూషాతో పాటు మరో యువకుడు కలిసి ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ల్లో అనుషతో పాటు మరో యువకుడు కదలికలను పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత అనూష నులకపేటలోని నివాసానికి వెళ్లినట్లు గుర్తించారు. అనూషతో పాటు మరో యువకుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నగరంలోని మాచవరం పీఎస్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో బొద్దులూరి వెంకట రామారావు(70) తన తల్లి సరస్వతితో కలిసి నివాసం ఉంటున్నారు. రామారావు.. వృద్ధురాలైన తన తల్లిని చూసుకునేందుకు మూడు రోజుల క్రితం అనూష అనే యువతిని కేర్ టేకర్‌గా పెట్టుకున్నారు. ఆమె వారితో పాటే.. అదే ఇంట్లో నివాసం ఉంటోంది.
శుక్రవారం అర్ధరాత్రి సమయంలో రామారావు గదిలో లైట్లు వెలగడంతో తల్లి సరస్వతి.. వెంటనే వచ్చి చూడగా మంచంపై కుమారుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆయన పడి ఉన్న మంచంపై కారం కూడా చల్లి ఉంది. కళ్లల్లో కారం కొట్టిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరో వైపు, బీరువా కూడా పగులగొట్టి ఉంది. ఇంటి పని మనిషి కూడా కనిపించకపోవడంతో అనుమానించిన తల్లి.. పక్క ఫ్లాట్ వాళ్లను పిలిచింది.
వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. రామారావు నిద్రలో ఉండగా దిండుతో ఊపిరాడకుండా చేసి, కారం చల్లినట్లు పోలీసులు గుర్తించారు. మొదట ఆహారంలో మత్తు మందు కలిపి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. కేర్ టేకర్ అనూష హత్య చేసినట్లు నిర్థారించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.