
సాక్షి,కర్నూలు: దేవనకొండలో మానవత్వాన్ని మంటగలిపే దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ తండ్రి తన ఎనిమిది నెలల పసికందును నీటి డ్రమ్ములో ముంచి హత్య చేశాడు. తండ్రి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయిన ఆ చిన్నారి చివరి శ్వాస... ఊహించుకుంటేనే గుండె ద్రవించిపోతుంది. ‘నాన్నా... నాకు ఊపిరి ఆడటం లేదు’ అనే మాటలు చెప్పలేని వయసులో ఉన్నా, ఆ అమాయక బిడ్డ బాధ ప్రతి ఒక్కరి మనసును చివుక్కుమనిపిస్తోంది.
పోలీసుల వివరాల మేరకు.. దేవనకొండకు చెందిన నరేష్ గురువారం పొలంలో తన ఎనిమిది నెలల కుమారుడిని నీటిడ్రమ్ములో ముంచి ప్రాణాలు తీశాడు. అనంతరం పోలంలో ఉన్న భార్య శ్రావణిని తీవ్రంగా గాయపరిచాడు. అప్రమత్తమైన బాధితురాలి అత్తమామలు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రావణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నరేష్‌కు నేరచరిత్ర ఉంది. ఇప్పటికే మొదటి భార్య హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు. అయితే, నరేష్ తల్లిదండ్రులు అతడికి రెండో వివాహం జరిపించారు. కానీ వివాహం జరిగిన కొద్దికాలానికే నరేష్ తన రెండో భార్య శ్రావణిపై అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంపై భార్య,భర్తల మధ్య గొడవలు జరిగేవి.
ఈ క్రమంలో భార్య శ్రావణిని హతమార్చేందుకు నరేష్ కుట్ర చేశాడు. ఇందులో భాగంగా ఇవాళ కుటుంబసభ్యులతో కలిసి పొలం వెళ్లిన నరేష్ ఘాతుకానికి ఒడిగట్టాడు. నెలల పసికందును నీటి డ్రమ్ములో ముంచి ప్రాణాలు తీశాడు. ఆపై భార్యపై మారణాయుధాలతో తెగబడ్డారు. నిందితుది దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.