రక్తమోడిన దేవరగట్టు: పగిలిన తలలు.. చిందిన రక్తం  | Sakshi
Sakshi News home page

రక్తమోడిన దేవరగట్టు: పగిలిన తలలు.. చిందిన రక్తం 

Published Sun, Oct 17 2021 8:44 AM

Kurnool District: 60 Injured as Banni Fight Turns Violent - Sakshi

ఓ వైపు డిర్ర్‌.. డిర్ర్‌ శబ్దాలు ఆకాశాన్నంటుతుండగా.. మరో వైపు దివిటీలు వెలుగులు విరజిమ్ముతుండగా.. రింగులు తొడిగిన కర్రలు గాలిలో కరాళ నృత్యం చేశాయి. దేవరగట్టు మళ్లీ రక్తమోడింది. ఉత్కంఠ భరితంగా సాగిన జైత్రయాత్రలో భక్తులే పట్టు సాధించి సంప్రదాయాన్ని గెలిపించారు. ఈ ఏడాది బన్ని ఉత్సవానికి ముందే జరిగిన అరికెర భక్తుల మధ్య ఘర్షణ భయాందోళనకు గురి చేసింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం మధ్య మాళమల్లేశ్వరుడి  కల్యాణం, శమీ పూజ, కార్ణికం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. 

సాక్షి, హొళగుంద (కర్నూలు): విజయ దశమి పర్వదినాన దేవరగట్టులో నిర్వహించిన బన్ని ఉత్సవంలో సంప్రదాయమే గెలిచింది. కోవిడ్‌ నిబంధనలు, అధికారుల ఆదేశాలను విస్మరించిన భక్తులు అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగించారు. మాళ మల్లేశ్వరుని జైత్రయాత్ర మొగలాయి యుద్ధాన్ని తలపించింది. రక్తపాతాన్ని తగ్గించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చేసిన చర్యలు ఫలించలేదు. శుక్రవారం రాత్రి గట్టులో జరిగిన కర్రల సమరంలో దాదాపు 60 మందికి పైగా గాయాలయ్యాయి. ఉత్సవాలు నిర్వహించే నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులతో పాటు దేవరగట్టు చుట్టు పక్కల గ్రామాలైన నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెర తండా, కురుకుంద, లింగంపల్లితో పాటు దాదాపు 15 గ్రామాలకు చెందిన భక్తులు ఉత్సవంలో పాల్గొని మొగలాయి ఆడారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చి ఉత్సవాన్ని తిలకించారు. కక్షలు, కార్పణ్యాలు లేకుండా ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహిస్తామని మూడు గ్రామాల పెద్దలు ఆదోని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, డీఎస్పీ వినోద్‌కుమార్‌ సమక్షంలో పాల బాస చేశారు. వారికి బండారం (పసుపు) ఇచ్చి స్వామి కల్యాణానికి అనుమతి తీసుకుని కొండపైకి చేరుకోవడంతో ఉత్సవం ప్రారంభమైంది.  



అరికెర భక్తుల ఘర్షణతో ఉద్రిక్తత 
ఈ ఏడాది మాళ మల్లేశ్వరుని కల్యాణోత్సవానికి ముందే ఆస్పరి మఠం పక్కనే అరికెరకు చెందిన కొంత మంది భక్తుల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. అక్కడ ఉన్న వేలాది మంది భక్తులు భయాందోళనకు గురయ్యారు. కర్రలతో పరస్పరం దాడి చేసుకోవడంతో నలుగురు వ్యక్తుల తలలు పగిలి, చేతులు విరిగి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. మానవత్వం మరిచి రింగు కర్రలతో తలలపై బాదుతున్నా వారిని నిలవరించేందుకు ఎవరూ సాహసించ లేదు. ఆ దృశ్యం భక్తులను గగుర్పాటుకు గురి చేసింది. కొద్ది దూరంలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను దగ్గరలోనే ఉన్న హెల్త్‌ క్యాంప్‌నకు తరలించారు. గాయపడిన పరమేష్‌ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.  

 

పగిలిన తలలు.. చిందిన రక్తం 
కర్రల సమరంలో అరికెర, కొత్తపేట, ఆలూరు, కురుకుంద, సుళువాయి, తదితర గ్రామాలకు చెందిన 60 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. కొందరికి కర్రలు తగిలి తలలకు గాయాలు కాగా మరి కొందరికి దివిటీలు తాకి కాలిన గాయాలయ్యాయి. ఆలూరుకు చెందిన జనార్దన్,  బిలేహాళ్‌కు చెందిన ఈరన్న, నెరణికి చెందిన మల్లన్నగౌడ్‌ చేతులు విరిగాయి. తొక్కిసలాటలో హాలహర్వి మండలానికి చెందిన ఓ యువకుడు గాయపడ్డాడు. దాదాపు 15 మంది వరకు  తీవ్ర గాయాలు కావడంతో ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఆదోని, ఆలూరు, కర్నూలుకు రెఫర్‌ చేశారు. ఆదోనికి చెందిన లక్ష్మీదేవి దివిటీ తగిలి గాయపడింది. ఆలూరుకు చెందిన వీరశేఖర్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో బళ్లారికి తరలించారు.


క్షతగాత్రులతో కిక్కిరిసిన వైద్య శిబిరం 

ఉత్సవంలో గాయపడిన భక్తుల్లో ఎక్కువ శాతం నాటుసారా, మద్యం సేవించిన వారే ఉన్నారు.  కర్రల సమరంలో రక్తపాతాన్ని తగ్గించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు చేపట్టారు. కోవిడ్‌ కారణంగా ఈ ఏడాది గట్టుకు భారీ వాహనాలకు అనుమతి లేదు. అయినా భక్తులు ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో  భారీ సంఖ్యలో దేవరగట్టుకు చేరుకున్నారు. దాదాపు 1,350 మందితో బందోబస్తు నిర్వహించారు. అల్లర్లకు పాల్పడే వారిని గుర్తించడానికి వందకు పైగా సీసీ కెమెరాలు, 4  డ్రోన్‌ కెమెరాలు, విడీయో కెమెరాలు వినియోగించారు. పోలీస్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు.   

శుక్రవారం ఉదయం 8.30 గంటలకు రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాళమల్లేశ్వరస్వామిని దర్శించుకున్నారు.   
11.30 గంటల నుంచి భక్తులు కాలినడకన, బైక్‌లపై గట్టుకు చేరుకోవడం ప్రారంభమైంది. 
సాయంత్రం 4 గంటలకు భక్తుల రద్దీ కనిపించింది. ఆలయంలో స్వామి వారిని దర్శించుకునేందుకు బారులుదీరారు.  
5.30కు బందోబస్తు నిమిత్తం కేటాయించిన ప్రాంతానికి పోలీసులు బయలుదేరారు.  
రాత్రి 7:35కు జైత్రయాత్రను తిలకించడానికి వీలుగా స్థల అన్వేషణలో భక్తులు నిమగ్నమయ్యారు.  
10.45కు ఆస్పరి మఠం పక్కనే అరికెరకు చెందిన భక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.  
11.45కు నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు డొళ్లిన బండ వద్దకు చేరుకుని పాలబాస తీసుకున్నారు.  
అర్ధరాత్రి 12:35కు మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలను మూడు గ్రామాల పెద్దలు కొండ పైకి చేర్చారు.  
శనివారం 1 గంటకు మాళ మల్లేశ్వరుని కల్యాణోత్సవాన్ని నెరణికి గ్రామానికి చెందిన పురోహితులు రవిశాస్త్రి, ఆలయ ప్రధాన పూజారులు ఘనంగా నిర్వహించారు.    
1:30కు స్వామివారి పల్లకీ, విగ్రహాలు అశ్వత్థ సత్య నారాయణ కట్ట వద్దకు చేరడంతో కర్రలు, అగ్గి కాగడాలు ఒక్క సారిగా గాలిలో లే చాయి. డోళ్లు, తప్పెట్లు కొట్టు్టకుంటూ బసవన్న గుడి వైపు బయలుదేరి 2.50 గంటలకు ముళ్లబండకు చేరుకోవడంతో అక్కడ పూజలు చేశారు.  
3.20 æగంటలకు విగ్రహాలు పాదాలగట్టుకు చేరుకోగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.   
తెల్లవారు జామున 4 గంటలకు రక్షపడికి చేరుకోగా అక్కడ మణి, మల్లాసుర అనే రాక్షస గుండులకు కంచాబీర వంశానికి చెందిన గొరువయ్య బసవరాజు తన కాలి పిక్కలకు దప్పణంతో గుచ్చుకుని రక్త తర్పణం చేశారు.  
4.30కు శమీవృక్షం వద్దకు విగ్రహాలు చేరుకోవడంతో అక్కడ పూజలు చేశారు. అనంతరం బసవన్న గుడి వైపు బయలుదేరాయి. 
శనివారం ఉదయం 6.10 గంటలకు పూజారి గిరిస్వామి గుడి పైకి ఎక్కి భవిష్యవాణి చెప్పారు. 2023 వరకు కరోనా, ఇతర ఆరోగ్య సమస్యలుంటాయని, ఈ ఏడాది ఉత్తర భాగంలో వర్షాలుంటాయనే అర్థంతో, నిత్యావసర ధరలు పెరిగి తగ్గుతాయని,పంటలకు గిట్టుబాటు ధరలు 3:6, 6:3 ప్రకారం పెరుగుతాయని కార్ణీకం (భవిష్యవాణి) వినిపించారు. 6.35 గంటలకు విగ్రహాలు సింహాసన కట్టకు చేరుకోగానే కర్రలు పట్టుకుని ఎగురుతున్న భక్తులు వెంటనే కిందకు దింపి మల్లేశ్వరస్వామికి జేజేలు పలికి ఇంటిదారి పట్టారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement