లోకేశ్‌ తీరు... ఏపీకి చేటే! | Kommineni Srinivasa Rao Shocking Comments On Nara Lokesh | Sakshi
Sakshi News home page

లోకేశ్‌ తీరు... ఏపీకి చేటే!

May 1 2026 11:26 AM | Updated on May 1 2026 11:27 AM

Kommineni Srinivasa Rao Shocking Comments On Nara Lokesh

అసందర్భమైన మాటలు ఎప్పుడైనా పరువు తక్కువే. రాజకీయ నేతలైతే మరీ ఎక్కువ. నోరు జారారో అంతే సంగతులు. ప్రజలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తారు. ఏపీ కీలక మంత్రి లోకేశ్‌ ఇప్పుడు ఈ పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజుల క్రితం విశాఖలో అదానీ గూగుల్‌ డేటా సెంటర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లోకేశ్‌ చేసిన ప్రసంగం ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురవుతోంది. పారిశ్రామిక దిగ్గజాలు వేదికపై ఉండగానే లోకేశ్‌ అసత్యాలు, అతిశయోక్తులతోపాటు రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసి నగుబాటుకు గురయ్యారు. 

కొద్దోగొప్పో విషయ పరిజ్ఞానమున్న వీరు సభ నుంచి వెళ్లిపోయాకైనా మంత్రి హోదాలో లోకేశ్‌ వైఖరిపై చర్చించకుండా ఉంటారా? ‘‘జి అంటే తమకు గూగుల్‌ అని.. వారికి గొడ్డలి’’ అన్న లోకేశ్‌ వ్యాఖ్య ఎంత అనుచితమైందో చిన్న పిల్లాడికి కూడా తెలిసిపోతుంది. పైగా ఒక ఐటీ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీపై ఇలాంటి విమర్శలు చేశారంటే లోకేశ్‌ ఆ పార్టీకి ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

క్రెడిట్ చోరీ డిజార్డర్ ఉన్న వ్యక్తి వచ్చి గూగుల్ తమదేనని చెప్పుకుంటారని లోకేశ్‌ అన్నారు. ఎవరేం చేసిందీ ప్రజలకు తెలియదనుకోవాలా? ఈయన చెప్పే ప్రతిమాటనూ అతిథులు నమ్మేస్తారని అనుకోవాలా? గతంలో అదాని డేటా సెంటర్‌కు జగన్ శంకుస్థాపన చేసినప్పుడు ఈ పారిశ్రామికవేత్తలు రాలేదా? ఆ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ కూడా ఏపీకి అన్ని వనరులు ఉన్నాయని, సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో నెంబర్ ఒన్‌గా ఉన్నామని, పారిశ్రామికవేత్తలకు ఏ  సమస్య వచ్చిన  ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉండి, పరిష్కరించడానికి చొరవ చూపుతామని చెప్పారు. అది రాష్ట్రంపై ఉండాల్సిన కమిట్మెంట్. లోకేశ్‌ మాత్రం అసందర్భ వ్యాఖ్యలు చేసి రాష్ట్రానికి నష్టం చేశారనిపిస్తుంది. 

 అందువల్లే లోకేశ్‌కు సోషల్ మీడియాలో వైఎస్సార్‌సీపీ అభిమానులు  పలు  ప్రశ్నలు సంధించారు. వాటికి జవాబు చెప్పే  పరిస్థితి ఆయనకు ఎంతవరకు ఉందన్నది సందేహమే. గతంలో ఆయన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ సభలో ఏది మాట్లాడినా, ఎన్ని అబద్దాలు చెప్పినా చెల్లిపోయింది. ఎందుకంటే ఆ రోజుల్లో సోషల్ మీడియా ఇంత యాక్టివ్ గా లేదు కనుక. సామాజిక మాధ్యమాలు  బాగా వచ్చాక ఆయన చెబుతున్న విషయాలలోని పొంతన లేని సంగతులు, గతంలో ఏమి మాట్లాడింది, ఇప్పుడు ఏమి చెబుతున్నది వెల్లడించే వీడియోలను ప్రదర్శిస్తున్నారు.చంద్రబాబును లోకేశ్‌ ఫాలో అవ్వదలిస్తే ఆయన ఇష్టం.  హుందాతనం లేని రాజకీయాలు చేయాలనుకుంటే ఆయనే ప్రజలలో పరపతి కోల్పోతారు. 

వైఎస్సార్‌సీపీని గొడ్డలి పార్టీ అని లోకేశ్‌ అనగానే  టీడీపీ  కేడర్‌ చేసిన పలు అరాచకాలను ఎత్తి చూపుతూ... అసలు గొడ్డలి పార్టీ మీది కదా అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభిమానులు  ప్రశ్నలు వేశారు. గతంలో వైఎస్ రాజారెడ్డిని బాంబులు వేసి హత్య చేసిన  వారు టీడీపీలోనే ఉన్నందున ఈ పార్టీ బాంబుల పార్టీ అవుతుందా అని అడిగారు. ఈ కూటమి  ప్రభుత్వంలో లోకేశ్‌ రెడ్ బుక్ అరాచకాలపై  నిలదీస్తున్నారు.ఈ రెండేళ్లలో హత్యలకు గురైన వారి వివరాలు వెల్లడిస్తున్నారు.ఉదాహరణకు  వినుకొండలో రషీద్ అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తను ఒక టీడీపీ నేత నడిరరోడ్డుపై నరికి హత్య చేశారు.పల్నాడులోని పిన్నెల్లిలో సాల్మన్ అనే వైఎస్సార్‌సీపీ దళిత కార్యకర్తపై టీడీపీ గూండాలు దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో మరో వైఎస్సార్‌సీపీ కార్యకర్త హత్యకు గురయ్యారు.వైఎస్ ఆర్ కడప జిల్లా వేంపల్లె వద్ద కొందరు టిడిపి వర్గీయులు గొడ్డళ్లతో వైఎస్సార్‌సీపీ నేత నాగభూషణరెడ్డిని నరికి చంపారు. ఇలా ఒకటి కాదు.

ఈ రెండేళ్లలో జరిగిన ఘటనలలో పలుచోట్ల  అరాచకశక్తులుగా మారిన  టీడీపీ కార్యకర్తలు గొడ్డళ్లు, కత్తులతో దాడులు చేశారు. వీటికి సంబంధించిన  వార్తలన్నిటిని ఒకచోటకు తెచ్చి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై  పెట్రోల్ బాంబులు విసిరింది టీడీపీ కార్యకర్తలే  కదా!ఈ అరాచకాలన్నిటికి తెలుగుదేశం పార్టీ జవాబుదారి అవుతుందా? లోకేశ్‌ వీటిని విస్మరించి తన తండ్రి మాదిరే దబాయించి  మాట్లాడితే  జనం నమ్ముతారా?చంద్రబాబుకు కుదిరింది కనుక తాను కూడా అలానే మాట్లాడతానని  నిర్ణయించుకుంటే ఆయనకే నష్టం. 

 అందులోను అదాని,గూగుల్,తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఇలా ప్రసంగిస్తే, ఈ గొడ్డలి గొడవ ఏమిటని వారు అడిగితే  ఏమి చెబుతారు? ఏపీలో శాంతి భద్రతలు లేవని లోకేశ్‌ జవాబు  ఇస్తారా?ఎంత ఇతర రాష్ట్రాలలో ఉన్నా,రెడ్ బుక్ గురించి వారికి  మాత్రం తెలియకుండా ఉంటుందా?గతంలో జిందాల్  అనే ఊరిశ్రామికవేత్తను ఒక మోసకారి నటి కేసులో ఇరికించడానికి యత్నించిన  ఘటన ఇతర పారిశ్రామికవేత్తలకు తెలియదా?అదే  జిందాల్ కు  ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడే  అవార్డు అందించారే.ప్రభుత్వ వైఫల్యాలపై వస్తున్న వార్తలకు, జనం చేస్తున్న  విమర్శలకు జవాబు  ఇవ్వలేక  చంద్రబాబు  కూడా పలు సభలలో గొడ్డలి పార్టీ అని వైఎస్సార్‌సీపీపై మీద అర్థం లేని  విమర్శలు  చేస్తూ  కాలక్షేపం చేస్తున్నారు.

ఇప్పుడు అదే  గాత్రాన్ని లోకేశ్‌ అందుకున్నట్లుగా ఉంది.విశాఖపట్నంలో అన్న  ఆంగ్ల పదం అక్షరాలలో  జి ఉందని, జి  అంటే  గూగుల్ అని ఆయన అనగానే  అంతా ఆశ్చర్యపోయారు.  వైజాగ్  లో జి అన్న  అక్షరం ఉంటుంది కాని విశాఖలో ఎక్కడ ఉంది అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. వైజాగ్ లో జి అన్న అక్షరం ఉన్నట్లే ఎ అనే లెటర్ కూడా ఉందని,అంటే అదాని గా తీసుకోవచ్చని,అదాని డేటా సెంటర్ ను జగన్ తీసుకువచ్చారని వైఎస్సార్‌సీపీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. లోకేశ్‌ చేస్తున్న వ్యాఖ్యల వల్ల టీడీపీకి ఎంత లాభం చేకూరుతుందోకాని, ఏపీ మాత్రం తీరని అప్రతిష్టే.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement