ఆడలేక మద్దెల ఓడు చందంగా ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు! | Kommineni Srinivasa Rao Comments On AP Police System Over Social Media Crackdown, More Details Inside | Sakshi
Sakshi News home page

ఆడలేక మద్దెల ఓడు చందంగా ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు!

May 21 2026 11:05 AM | Updated on May 21 2026 11:44 AM

Kommineni Srinivasa Rao Comments On AP Police System

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారుకు సోషల్‌ మీడియా భయం పట్టుకున్నట్టు కనిపిస్తోంది. సామజిక మాధ్యమాల్లో ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానాలివ్వలేక ప్రశ్నించే వారిని అణచివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. పోలీసు వ్యవస్థ కూడా రెడ్‌బుక్‌ అరాచకాలకు అలవాటు పడిపోయి అదే పనిలో ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు డిప్యూటీ పవన్‌, కీలక మంత్రి లోకేశ్‌ల ప్రకటనల్లోని డొల్లతనాన్ని, గతంలో చేసినదాని కంటే భిన్నంగా ఉన్న విషయాన్ని సోషల్‌ మీడియా ఎత్తి చూపుతోంది. దీంతో కూటమి సర్కారు గంగవెర్రులెత్తుతోంది. ఎల్లోమీడియా సాయంతో కొద్దోగొప్పో సానుకూల ప్రచారం చేసుకుంటున్నా.. సోషల్‌ మీడియా ధాటిని మాత్రం తట్టుకోలేకపోతోంది. 

మామూలుగానైతే సోషల్‌ మీడియాలో ఏదైనా అభ్యంతరకర పోస్టులు, అసభ్యకరమైన వ్యాఖ్యలు వస్తే చర్యలు తీసుకుంటూంటారు కానీ... ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలను తొలగించేందుకు ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ పోలీసులే రంగంలోకి దిగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలాంటి పోస్టుల తొలగింపు కోసం పోలీసులు స్వయంగా గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌, యూట్యూబ్‌ తదితర సామాజిక మాధ్యమాలకు లేఖలు రాస్తున్నట్లు తెలుస్తోంది. పోస్టుల వల్ల ఇబ్బంది పడ్డవారు లేదా సంస్థలు కోర్టు ఆదేశాల ద్వారా వాటిని తొలగించుకునే ప్రయత్నం చేస్తూంటాయి కానీ.. అంత ప్రాసెస్ ఎందుకు అనుకున్నారేమో తెలియదు కాని, పోలీసులు తమ అధికార బలం ప్రయోగిస్తున్నారట. 

పోలీసులు ఫిర్యాదు చేసిన వెంటనే ఫేస్బుక్‌ తదితర వేదికలు స్పందిస్తున్నాయట. ఒకవైపు కేసులతో సోషల్  మీడియా యాక్టివిస్టులను భయపెట్టాలని చూడడం, మరో వైపు పోలీసులు సాయంతో పోస్టులు తొలగించేయడంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏపీలో బలమైన  ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ సైతం పోలీసుల దుశ్చర్యలపై పోరాటాలు చేస్తోంది.  విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు రీసర్వే,  30 వేల మంది మహిళల మిస్సింగ్ వంటి అనేక అంశాలపై అసత్యాలు ప్రచారం చేశారు. టీడీపీ సోషల్ మీడియా, ఎల్లో మీడియా ఆకాశమే హద్దుగా అబద్ధాలు సృష్టించింది. వదంతులు ప్రచారం చేసింది. అయినా అప్పట్లో వారిపై ఈ తరహా కేసులు రాలేదు. కాని కూటమి అధికారంలోకి రాగానే సోషల్ మీడియాపై తమ పెత్తనం చెలాయించే పని మొదలుపెట్టారు. 

సోషల్ మీడియా విమర్శలకు కూటమి సర్కారు ఎందుకు జంకుతోందో తెలుసుకోవడం ఆసక్తికరం. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను హైదరాబాద్‌లోని వారి స్వగృహాల్లో కలిశారు. ఇది జరగడానికి కొద్ది రోజుల ముందే మంత్రి లోకేశ్‌ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో తరిమేశారని, అప్పుడు చంద్రబాబు ఏపీకి వచ్చి ఇక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడపడాన్ని ఆరంభించారని వ్యాఖ్యానించారు. దీంతో సోషల్‌ మీడియాలో ప్రశ్నల పరంపర మొదలైంది. ‘‘చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడి కదా విజయవాడ వెళ్లిపోయింది’’ అని వ్యాఖ్యానించారు. 

అంతేకాక ప్రధాని ఏపీ పాలకులను అమరావతిలో కదా.. కలవాల్సింది? హైదరాబాద్‌లో ఎందుకు కలిశారు? అని ప్రశ్నించారు. అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పలువురు మంత్రుల కుటుంబాలు అమరావతిలో కాకుండా హైదరాబాద్ లోనే ఉంటున్నాయని, వీరు చుట్టపుచూపుగా వారం వారం అమరావతి వచ్చిపోతున్నారని వెళుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ ఫ్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఇదే పాయింట్ ఎత్తిచూపి ఎద్దేవ చేశారు. అంతేకాక 2018లో బీజేపీతో విడిపోయాక చంద్రబాబు, మోడీలు పరస్పరం ఎంత తీవ్రమైన  విమర్శలు చేసుకుందీ.. చివరికి వ్యక్తిగతంగా కుటుంబ ప్రస్తావనలు తెచ్చింది కూడా సోషల్ మీడియా గుర్తు చేసింది. 

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఈవిఎమ్‌ల ట్యాంపరింగ్ జరిగిందని, దమ్ముంటే ఎవరైనా చర్చకు రావచ్చని గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మీడియా సలహాదారుగా పనిచేసిన పరకాల ప్రభాకర్ సవాల్ చేస్తున్నారు. ఎల్లో మీడియా ఈ వార్తలను పట్టించుకోవడం లేదు. చంద్రబాబు  ప్రభుత్వం పరకాల చేసిన వ్యాఖ్యలను ఖండించ లేకపోతోంది. దీనిని ప్రస్తావిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ఒక ప్రశ్న సంధించారు. పరకాల ఇన్ని ఆరోపణలు చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం కనీసం కేసు కూడా పెట్టలేకపోయిందని, దీనిని బట్టి ఆ ఆరోపణలలో వాస్తవం ఉందని అనుకోవల్సి వస్తుందని అన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు అప్పటి బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీని బెంగాల్ దుర్గ అని కోల్‌కతాలోనే అభివర్ణించారు. మోడీని ఢిల్లీ మహిషాసురుడిగా పోల్చుతూ ఆమె చేతిలో చిత్తు అవుతారని చంద్రబాబు ప్రసంగించారు. 

అదే  చంద్రబాబు ఈసారి బీజేపీ గెలిచిన సందర్భంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. అక్కడ ప్రధాని మోడీకి నమస్కరిస్తున్న  తీరుపై వచ్చిన వీడియోలు వైరల్ అయ్యాయి.మంత్రి లోకేశ్‌కు మద్దతుగా 99 పైసలకే పరిశ్రమలకు భూములు కేటాయించడం గేమ్ ఛేంజర్ అని చంద్రబాబు అనగానే ఇతర రాష్ట్రాలలో అవే పరిశ్రమలు వందల కోట్లు ఖర్చు చేసి భూములు ఎలా కొనుగోలు చేస్తున్నది వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. ఇంగ్లీష్ మీడియంను  ప్రభుత్వ స్కూళ్లలో అమలు  చేయడానికి చంద్రబాబు సర్కార్ కూడా నిర్ణయం చేసింది. అయితే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ తదితరులు ఆంగ్ల మీడియంపై ఎలాంటి విమర్శలు చేసింది వివరించే పేపర్ క్లిపింగ్గులు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తారంగా కనిపించాయి. ఇవే కాదు..చంద్రబాబు ఆయా సందర్భాలలో చేసిన చిత్ర, విచిత్రమైన వ్యాఖ్యలు కూడా సోషల్  మీడియాలో కనిపిస్తుంటాయి. సహజంగానే ఇలాంటివి చంద్రబాబు టీమ్‌కు  ఇబ్బంది కలిగిస్తూంటాయి. 

తమ పరువుకు భంగం కలుగుతోందని, ప్రభుత్వ పరపతి దెబ్బతింటోందని భావిస్తాయి. ఇదీ నేపథ్యం.. ఎలాగైనా సోషల్ మీడియాను అణచివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తోందని, ఇది భావ ప్రకటన స్వేచ్చకు విరుద్ధమని మాజీ సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన ఒక ప్రకటన చేస్తూ టీడీపీ మద్దతుదారులు ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేయడం.. ఆ వెంటనే పోలీసులు శరవేగంగా స్పందించడం పరిపాటై పోయిందన్నారు. తప్పుడు కేసులు, తప్పుడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన అంశాలను (కంటెంట్ ) తొలగించాలని, వారి అక్కౌంట్లను బ్లాక్, లేదా సస్పెండ్ చేయాలని పోలీసులే సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లకు నోటీసులు పంపుతున్నారని జగన్ అన్నారు. 

ఇది సోషల్ మీడియాపై వ్యవస్థీకృతంగా సెన్సార్ షిప్ విధించడమేనని విమర్శించారు. జగన్ ఆరోపణలపై ప్రభుత్వం, పోలీసుల నుంచి కాని ఎలాంటి సమాధానం రాలేదు. కొద్ది రోజుల క్రితం మాజీ ఆడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి, మాజీ మంత్రి కన్నబాబులు కూడా పలు ఉదాహరణలు ఇస్తూ పోలీసులు అక్రమంగా సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధిస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు ప్రెస్ కాన్ఫరెన్స్  లలో మాట్లాడిన విషయాలకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలను తొలగించాలని పోలీసులు లేఖలు  రాశారట.ఇ దంతా కొత్త ట్రెండ్. గతంలో రాజకీయ విమర్శలపై ఇలా ప్రభుత్వాలు వ్యవహరించలేదు.మహా అయితే వారి వాదన చెబుతారు. 

ఖండనలు ఇస్తారు. అవేమీ ఇవ్వకుండా వీడియోలు తొలగించే పనిలో పోలీసులను ప్రయోగిస్తున్నారంటూ ప్రభుత్వం ఎంత భయపడుతోందో అర్థం అవుతోంది. ఇవన్ని చూస్తే  పరిస్థితి ఎలా ఉందంటే మీరేమన్నా చేసుకోండి..మా మొండి వైఖరి మాదే..మా రెడ్‌బుక్ రాజ్యాంగం మాదే.. ఏమైనా మా తప్పులను ప్రశ్నిస్తే ఊరుకోం..అన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుండడం అత్యంత దుర్మార్గంగా కనిపిస్తుంది.  ఈ పరిస్థితి ఎప్పటికి మారేనో!


కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement