ఖాజీపేట ప్రేమోన్మాది వెంకటేష్‌పై కాల్పులు | Kazipet Incident: Police Open Fire On Accused | Sakshi
Sakshi News home page

ఖాజీపేట ప్రేమోన్మాది వెంకటేష్‌పై కాల్పులు

Apr 11 2026 6:48 AM | Updated on Apr 11 2026 8:47 AM

Kazipet Incident: Police Open Fire On Accused

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ఖాజీపేట విద్యార్థినిని చంపిన ప్రేమోన్మాదిపై పోలీసులు కాల్పులు జరిపారు. బాసాపురం చెక్‌పోస్ట్‌ దగ్గర పారిపోయేందుకు నిందితుడు యత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడి కాలికి గాయమైంది. కడప రిమ్స్‌కు తరలించారు. ఘటనలో పోలీసులకూ గాయాలయ్యాయి.

ఖాజీపేట మండలం అగ్రహారం గ్రామంలో ప్రేమోన్మాది చేతిలో బాలిక దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. అగ్రహారంలో ఇళ్లూరు శ్రీనివాసులు, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె రామకీర్తన (16) ఉన్నారు. కీర్తన ఖాజీపేటలోని మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదివి ఇటీవలే పరీక్షలు రాసింది. ప్రస్తుతం ఇంటివద్దనే ఉంటుంది.

నిన్న(శుక్రవారం, ఏప్రిల్‌ 10) ఉదయం కీర్తన తండ్రి శ్రీనివాసులు తన పెద్ద కుమారునితో కలిసి మైదుకూరుకు జీవాల కొనుగోలుకు వెళ్లాడు. తల్లి నాగమణి కూలి పనులకు వెళ్లారు. కీర్తన తమ్ముడు బడికి వెళ్లాడు. దీంతో కీర్తన ఒంటరిగా ఇంటి వద్ద ఉండడంతో ఆంజనేయ కొట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్‌ వచ్చి కొడవలితో గొంతుకోసి పరార­య్యాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తండ్రి, అతడి పెద్దకుమారుడు రక్తపుమడుగులో పడి ఉన్న రామకీర్తనను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు.

అప్పటికి రామకీర్తన మాట్లాడు తుండడంతో విషయం తెలుసుకుని పోలీసు లకు సమాచారం ఇచ్చారు. కీర్తన గొంతు నుంచి రక్తస్రావం జరగకుండా టవల్‌ను చుట్టి ఆమెను చేతులతో ఎత్తుకుని ఆటో వరకు తీసుకెళ్లారు. అనంతరం కడపకు తీసుకెళ్తుండగా హైవేపైకి రాగానే 108 ఎదురవడంతో అందులో కడప రిమ్స్‌కు తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందింది.

ఆవుల వెంకటేష్‌ రెండేళ్ల నుంచి ప్రేమ పేరుతో రామకీర్తన వెంటపడుతున్నాడు. ప్రేమించాలని వేధిస్తున్నాడు. పలుమార్లు బాలిక తండ్రితో మీ కూతురు ఇతరులతో ఫోన్‌ మాట్లాడుతోందంటూ ఫిర్యాదు చేశాడు. దీనికి ఆమె సంగతి మేం చూసుకుంటాం.. నీవు కలగజేసుకోవద్దని శ్రీనివాసులు వార్నింగ్‌ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో రామకీర్తనపై కక్ష పెంచుకున్న వెంకటేష్‌ శుక్రవారం ఉదయం ఆమెతో ఫోన్‌లో మాట్లాడే యత్నం చేశాడు. బాలిక స్పందించక పోవడంతో ఆవేశంతో ఇంటికి వెళ్లి కొడవలితో గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement