మదనపల్లెలో కశ్మీరీ కుంకుమపువ్వు

Kashmiri saffron in Madanapalle Andhra Pradesh - Sakshi

కృత్రిమ వాతావరణ పరిస్థితుల్లో ప్రయోగాత్మక సాగు

తొలి ప్రయత్నంలోనే అధిక దిగుబడి సాధించిన శ్రీనిధి

నాణ్యమైన కుంకుమపువ్వుకు ఆన్‌లైన్‌లో అనూహ్య స్పందన

సాక్షి రాయచోటి: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కశ్మీరీ కుంకుమపువ్వు. వినడానికి ఇది ఒకింత ఆ­శ్చర్యంగా అనిపించినా... అక్షరాల ఇది వాస్త­వం. కుంకుమ పువ్వు సాగు చేయాలంటే కశ్మీర్‌కు వెళ్లాల్సినవసరం లేదు. పండించాలన్న ఆసక్తి ఉంటే.. అక్కడి వాతావరణ పరిస్థితులను కృత్రిమంగా ఇక్కడ సృష్టించి సాగు చేయవచ్చు. అధిక దిగుబడులు సాధించవచ్చు. అలా ఎవరూ ఊహిం­చని కశ్మీరీ కుంకుమపువ్వు సాగు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది వ్యవసాయ పట్టభద్రురాలు శ్రీనిధి. 

కశ్మీర్‌ నుంచి విత్తనాలు తెచ్చి..
కుంకుమపువ్వు సాగు కోసం శ్రీనిధి కశ్మీర్‌కు వెళ్లి 300 కిలోల నాణ్యమైన విత్తనాన్ని కొనుగోలు చేశారు. అందులో 225 కిలోలను సాగుకు వినియోగించారు. ఏరోఫోనిక్‌ పద్ధతిలో సుమారు 30,000 ట్రేలలో విత్తనాలను ఉంచి ఇంట్లో ముందుగానే ఏర్పాటు చేసుకున్న కశ్మీర్‌ తరహా వాతావరణం కలిగిన గదిలో వాటిని ఉంచారు. 2022, ఆగస్టు 20వ తేదీన ప్రారంభించిన కుంకుమపువ్వు సాగు... నవంబర్‌ 20కి సరిగ్గా మూడు నెలలకు తుదిదశకు చేరుకుంది.

30,000 మొక్కల్లో దాదాపుగా 20,000 మొక్కలు అంటే ఏడు గ్రాములకు పైన ఉన్న విత్తనాలు మాత్రమే పువ్వు దశకు చేరుకున్నాయి. సాధారణంగా 150 పువ్వుల నుంచి ఒక గ్రాము కుంకుమపువ్వు దిగుబడి ఉంటుంది. మదనపల్లెలో శ్రీనిధి ప్రయోగాత్మకంగా చేసిన సాగులో కశ్మీర్‌లో సంప్రదాయక సాగు పద్ధతిలో వచ్చే దిగుబడితో సమానంగా తొలి ప్రయత్నంలోనే 200 గ్రాముల కల్తీలేని, నాణ్యమైన ఏ గ్రేడ్‌ కుంకుమపువ్వును పండించింది. 

పునరుత్పత్తి ప్రక్రియ
నవంబర్‌ 20 తొలి పంట తుది దశకు చేరుకునే క్రమంలోనే మలి పంటకు సన్నాహాలను ప్రారంభించారు. కుంకుమపువ్వు తీసేసిన తర్వాత మొక్కలను అలాగే పునరుత్పత్తి ప్రక్రియకు వినియోగించి వాటి నుంచే విత్తనాన్ని తయారు చేసుకున్నారు. ఒక విత్తనం నుంచి 3–5 పిలకలు ఉత్పత్తి అయ్యాయి. ఈ సారి వర్టికల్‌ ఫాంలో ప్రత్యేకగదిలో సాయిల్‌ బెడ్స్‌(మురిగిన నల్లమట్టి, నున్నటి ఇసుక, కోకోపిట్, వర్మీకంపోస్టు, వరిపొట్టు) రూపంలో తయారు చేసుకుని మొక్కలను నాటారు.

వీటితో పాటుగా ట్రయల్‌ రన్‌లో భాగంగా ఓపెన్‌ ఎయిర్‌లో కొన్ని మొక్కలు నాటి చూశారు. ప్రత్యేకగదిలో ఏర్పాటు చేసిన మొక్కలు ఆశించిన స్థాయిలో పెరుగుతుండగా, బయట వేసిన మొక్కలు తొందరగా వాడిపోయాయి. ప్రస్తుతం వేసిన రెండో పంట ఏప్రిల్‌కు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది నవంబర్‌కు ఒక టన్ను విత్తనం నుంచి రెండు కిలోల కుంకుమపువ్వు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా 5,000 చదరపు అడుగుల స్థలంలో గదిని ఏర్పాటు చేస్తున్నారు.

మదనపల్లెకి ఉన్నతాధికారులు క్యూ
హార్టికల్చర్, టూరిజం, ఆచార్య ఎన్‌.జి.రంగా వర్సిటీ, కృషి విజ్ఞాన కేంద్రం, టీటీడీ తదితర విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు మదనపల్లెకు వచ్చి ప్రయోగాత్మక సాగును పరిశీలించారు. భవిష్యత్‌ పరిశోధనలకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. ఆచార్య ఎన్‌.జి.­రంగా వర్సిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల బాపట్లలో జనవరి 6, 7 తేదీల్లో జరిగిన 52వ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశాల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుని కుంకుమపువ్వు సాగుపై వ్యవసాయ పరిశోధక విద్యార్థులకు శ్రీనిధి విశదీకరించింది. 

ఆన్‌లైన్‌లో అమ్మకాలు..
కుంకుమపువ్వును అమ్మేందుకు వినూత్న పద్ధతిని అనుసరించింది. పర్పుల్‌ స్ప్రింగ్స్‌ పేరుతో బ్రాండ్‌ పేరును రిజిస్టర్‌ చేయించి ఆన్‌లైన్‌ వేదికగా అమ్మకాలను ప్రారంభించింది. గ్రాము రూ.600 చొప్పున విక్రయించి రూ.1,20,000 వరకు మొదటి ఆదాయాన్ని ఆర్జించింది. సామాజిక మాధ్యమాల వేదికగా యూట్యూబ్‌లో ఆమె ప్రారంభించిన పర్పుల్‌ స్ప్రింగ్స్‌ వెబ్‌సైట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top