
తంబళ్లపల్లె సాక్షిగా అంతర్జాతీయ మాఫియాను తలపించిన నకిలీ మద్యం తయారీ రాకెట్
ములకలచెరువులో కళ్లు చెదిరేలా ఉన్న ప్లాంట్ గుట్టురట్టు
ఊరూరా ఇప్పటికే బెల్ట్ షాపులు
ఇదీ చాలదన్నట్లు ప్రభుత్వ పెద్దల దన్నుతో ఏకంగా నకిలీ మద్యం తయారీ
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కూటమి నేతలు
పెద్ద పెద్ద డ్రమ్ములు, యంత్రాలు, మోటార్లు, నకిలీ లిక్కర్ పట్టుబడటమే ఇందుకు నిదర్శనం
48 క్యాన్లలో నకిలీ మద్యం, 15,024 బాటిళ్లు స్వాదీనం
30 క్యాన్లలో స్పిరిట్ గుర్తింపు.. మరో 10 వేలకు పైగా ఖాళీ బాటిళ్లు
మూతలు స్వాదీనం.. ఫ్లేవర్ రసాయనాలు, వివిధ రకాల కెమికల్స్ గుర్తింపు
ఏడు రకాల నకిలీ బ్రాండ్లు.. లేబుళ్లు పట్టివేత
ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాలకు నిత్యం సరఫరా
తంబళ్లపల్లె టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడు అరెస్ట్
టీడీపీ నేత ఇంట్లో 10 బాక్సుల కేరళ మాల్ట్ మద్యం స్వాధీనం
తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జ్ జయచంద్రారెడ్డి పీఏ రాజేష్ సహా 13 మందిపై కేసు.. ఏ–1గా మాత్రం మేనేజర్ జనార్దన్‌రావు
అడ్మిరల్ బ్రాందీ, బెంగళూరు బ్రాందీ, కేరళ మాల్ట్ విస్కీ, రాయల్ లాన్సర్, సుమో, మరికొన్ని బ్రాండ్లకుచెందిన లేబుళ్లను తయారు చేయించి నకిలీ మద్యం నింపిన బాటిళ్లకు అంటిస్తున్నారు. ఈ తతంగం పూర్తయ్యాక బాటిళ్లను బాక్సుల్లో పెట్టి పాల వ్యాన్లలో సరఫరా చేస్తున్నారు. ప్రతి రోజూ వేల సంఖ్యలో నకిలీ మద్యం బాటిళ్లు ములకలచెరువు ప్లాంట్ నుంచి తరలి పోతున్నాయి. ఏ బ్రాండ్‌తో నకిలీ మద్యం కావాలంటే ఆ బ్రాండ్ పేరుతోనే నకిలీ మద్యం తయారు చేసి పంపుతున్నారు.
రంగు, వాసనలో ఎలాంటి తేడా లేకుండా అసలు మద్యాన్ని పోలి ఉండేలా నకిలీ తయారు చేయడానికి నిపుణులను నియమించుకున్నారు. ఇంత భారీ ఎత్తున్న టీడీపీ నియోజకవర్గం నేతల కనుసన్నల్లో తయారవుతున్న ఈ నకిలీ మద్యాన్ని ఇప్పటిదాకా ఎంత మంది ఏ మోతాదులో తాగారో.. వారి ఆరోగ్యం పరిస్థితి ఏమిటో! ప్రజల ప్రాణాలతో కూటమి నేతలు చెలగాటమాడుతున్నారని చెప్పడానికి ఇంత కంటే నిదర్శనం మరొకటి అవసరమా?
మదనపల్లె : చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఏకంగా నకిలీ మద్యం తయారీ భారీ ప్లాంట్ బండారం బట్టబయలైంది. రాష్ట్రమంతటా ఉలిక్కి పడేలా చేసింది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మండల కేంద్రం ములకలచెరువుకు కూతవేటు దూరంలో కళ్లు చెదిరేలా నిర్వహిస్తున్న నకిలీ మద్యం తయారీ భారీ కర్మాగారం బాగోతం శుక్రవారం వెలుగు చూసింది. ఈ కేంద్రం నిర్వహణ, సరఫరాలో అధికార టీడీపీ నియోజకవర్గం నేతల ప్రమేయం స్పష్టంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేయడమే ఇందుకు నిదర్శనం.
ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ములకలచెరువు సమీపంలోని పాత హైవే రోడ్డు వద్ద గతంలో డాబాగా ఉన్న భవనాన్ని యజమాని లక్ష్మీనారాయణ..రామ్మోహన్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చారు. ఈ భవనంలో నకిలీ మద్యం తయారు చేస్తున్నరనే సమాచారంతో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి (కడప), అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్(ఈఎస్) మధుసూదనరావు, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ నీలకంఠేశ్వరరెడ్డి, ఎస్‌ఐలు యల్లయ్య, జహీర్, సిబ్బంది శుక్రవారం ఆ భవనంపై దాడులు నిర్వహించడంతో కళ్లు చెదిరే రీతిలో, ఎవరూ ఊహించని విధంగా భారీ స్థాయిలో నకిలీ మద్యం తయారీ ప్లాంట్ గుట్టు రట్టయ్యింది.
దాడులు జరిగిన సమయంలో తొమ్మిది మంది కూలీలు అక్కడ నకిలీ మద్యం తయారీ, బాటిళ్లలో భర్తీ, ప్యాకింగ్ పనులు చేస్తున్నారు. కొన్ని గంటల పాటు లోపలికి ఎవరినీ రానివ్వకుండా అధికారులు గేటు మూసేశారు. అక్కడ మద్యం తయారీ యూనిట్, సరఫరా విధానం అంతా పరిశీలించారు. నకిలీ మద్యం తయారీకి సంబంధించి మూడు యంత్రాలు, స్పిరిట్, కలర్ ఫ్లేవర్ వేసి కలిపే యంత్రాన్ని గుర్తించారు.
బాటిళ్లలో నకిలీ మద్యం నింపాక వాటిపై మూతను బిగించే యంత్రాలు, 70 ఖాళీ క్యాన్లు, 180 ఎంఎల్ ఖాళీ బాటిళ్లు 10 వేలు, వేల సంఖ్యలో బాటిళ్ల మూతలు, 35 లీటర్ల సామర్థ్యం కలిగిన 30 క్యాన్ల స్పిరిట్, బాటిలింగ్‌కు సిద్ధమైన 35 లీటర్ల సామర్థ్యం కలిగిన 48 క్యాన్ల నకిలీ మద్యం గుర్తించారు. సరఫరాకు సిద్ధం చేసిన 15,024 నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ స్థాయిలో నకిలీ మద్యం ప్లాంట్ ఉండటం చూసి అధికారులు నివ్వెరపోయారు.
టీడీపీ నేత కట్టా అరెస్ట్
నకిలీ మద్యం తయారీ ప్లాంట్ నిర్వహిస్తున్న తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడును అరెస్ట్ చేసినట్టు ఎక్సైజ్ ఈఎస్ మధుసూదనరావు వెల్లడించారు. నియోజకవర్గంలో కీలక నాయకుడైన ఈయన స్వగ్రామం కమ్మవారిపల్లెలో సైతం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కట్టా ఇంట్లో 10 బాక్సుల కేరళ మాల్ట్ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ బాటిళ్లలో నకిలీ మద్యం ఉన్నట్టు నిర్దారించారు. ఈయన పెద్దతిప్పసముద్రం మండలం ఆంధ్రా–కర్ణాటక సరిహద్దులో ఆంధ్రా వైన్స్ పేరుతో మద్యం దుకాణం నిర్వహిస్తున్నాడు.
కాగా, నకిలీ మద్యం తయారీ ప్లాంట్‌లో పని చేస్తున్న ఎనిమిది మంది కూలీలను అరెస్ట్ చేశారు. వారిలో విజయవాడకు చెందిన సయ్యద్ హాజీ, విశాఖపట్నంకు చెందిన చుక్కల బాలరాజు, తమిళనాడుకు చెందిన మణిమారన్, వి.సురేష్, వి.సూర్య, ఎస్.ఆనందం, ఒడిశాకు చెందిన డి.ఆనందదాస్, బి.మిథున్ ఉన్నారు.
తన బెల్ట్ షాపులో విక్రయాలకు నకిలీ మద్యం తీసుకెళ్లడానికి అదే సమయంలో వచ్చిన పెద్ద తిప్పసముద్రం మండలానికి చెందిన కే.నాగరాజును సైతం అరెస్ట్ చేశారు. పాల వ్యాన్ల ద్వారా నకిలీ మద్యం తరలించేందుకు సిద్దం చేసిన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా 40 బాక్సుల్లో నకిలీ మద్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాను ద్వారానే నిత్యం చుట్టుపక్కల ప్రాంతాల్లోని వివిధ వైన్ షాపులకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్టు స్పష్టమైంది.
ఏ–1గా జనార్దన్‌రావు
నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టురట్టయిన నేపథ్యంలో ఈ ప్లాంట్ మేనేజర్‌గా విజయవాడకు చెందిన జనార్దనరావు వ్యవహరిస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసులు ప్రకటించారు. ఈయనపై ఏ–1గా కేసు నమోదు చేశారు. ఇతని కనుసన్నల్లోనే నకిలీ మద్యం తయారీ వ్యవహారం కొనసాగుతోందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇతనికి తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేతలతో బలమైన సంబంధాలు ఉన్నాయి. నకిలీ మద్యం తయారీ ప్లాంట్‌లో పని చేస్తున్న నిపుణులైన కూలీలను ఇతనే ఇక్కడికి పంపినట్టు తేలింది.
జనార్దన్‌రావుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నట్టు సమాచారం. ఇతన్ని పోలీసులు ఇంకా విచారించ లేదు. ఇతన్ని విచారిస్తే తెర వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు.. పెద్ద తలకాయల వివరాలు వెలుగులోకి వస్తాయి. కాగా, ఇక్కడ తయారయ్యే నకిలీ మద్యాన్ని ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాలకు పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నట్టు తేలింది. ఆర్డర్లను బట్టి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా పంపుతున్నట్లు సమాచారం.
జయచంద్రారెడ్డి పీఏపై కేసు
తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి పీఏ రాజేష్ పై కేసు నమోదు చేసినట్టు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు తెలిపారు. రాజేష్ పేరుతో ములకలచెరువులో రాక్ స్టార్ మద్యం దుకాణం నడుస్తోంది. నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో పట్టుబడిన పాల వ్యాను రికార్డులు పరిశీలించగా, అది రాజేష్ పేరు మీద ఉన్నట్టు వెల్లడైందని చెప్పారు. ఈ పాల వ్యాను ద్వారా నకిలీ మద్యం తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. దీని ఆధారంగా రాజేష్‌పై కేసు నమోదు చేయడమే గాక, అతని పేరుతో ఉన్న మద్యం దుకాణం లైసెన్స్‌ను రద్దు చేస్తామని చెప్పారు.

ప్రస్తుతం రాజేష్ పరారీలో ఉన్నాడన్నారు. కాగా, నకిలీ మద్యం తయారీ కేంద్రం బిల్డింగ్ లీజుదారుడు పై కూడా కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ వ్యవహారంలో 13 మందిపై కేసు నమోదు చేశామని ఎక్సైజ్ అసిస్టెంట్ కమీషనర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా నకిలీ మద్యం వ్యవహారంతో తనకు సంబంధం లేదని తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి శుక్రవారం రాత్రి ఓ వీడియో విడుదల చేశారు. తాను రాష్ట్రంలో లేనని, ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. కాగా, టీడీపీ నేతలే నకిలీ మద్యం తయారు చేస్తూ పట్టుబడటం దారుణమని, ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలని టీడీపీ వర్గాల సోషల్ మీడియా గ్రూపుల్లో ట్రోల్ అవుతోంది.
నకిలీ మద్యం తయారీ ఇలా..
నకిలీ మద్యం తయారీ విధానాన్ని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు వివరించారు. ‘నకిలీ మద్యం తయారీ కోసం ఒక మోటార్ యంత్రాన్ని పెట్టారు. 200 లీటర్ల స్టీల్ క్యాన్‌లోని నీటిలో స్పిరిట్‌ను కలుపుతున్నారు. ఆ తర్వాత దాన్ని విస్కీనా, బ్రాందీనా.. ఏ విధంగా మార్చాలనే దాన్ని బట్టి కలర్, ఫ్లేవర్ కలుపుతున్నారు. ఇందు కోసం ఓ మోటార్‌ను ఏర్పాటు చేశారు.
అనంతరం దాన్ని మెషిన్ ద్వారా బాటిళ్లలో నింపుతున్నారు. ఇదే సమయంలో రెండు యంత్రాలతో గ్యాస్ మిక్స్ చేస్తున్నారు. దీనికి రెండు ఆటోమెటిక్ యంత్రాలు, ఒకటి మాన్యువల్ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. తర్వాత మూతలు బిగించి నకిలీ లేబుళ్లు అతికిస్తున్నాను. ఈ లేబుళ్లు ఏపీకి చెందినవేననని తేలింది’ అని వెల్లడించారు.