చిత్తూరు జిల్లాలో మెడికల్ మాఫియా
మదనపల్లి తరహాలో రెచ్చిపోతున్న వైనం
పలు ఆస్పత్రులు..దళారులు సిండికేట్
అనుమతి లేని ఆస్పత్రులు కోకొల్లలు
కొరవడుతున్న నిఘా వ్యవస్థ
మదనపల్లె కిడ్నీ రాకెట్‌లో తిరుపతిలోని ఓ ఆస్పత్రి పాత్ర
మత్తులో వైద్య ఆరోగ్యశాఖ
చిత్తూరు నగరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రసూతి వార్డులో 2022 మార్చి 19వ తేదీన మగ శిశువు అదృశ్యమైంది. మంగసముద్రం గ్రామానికి చెందిన ఓ గర్భిణికి ప్రసవించిన మూడు రోజుల పసికందును బ్యాగులో పెట్టుకుని ఎత్తికెళ్లిపోయారు. శిశువు అదృశ్యంపై పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా బిడ్డను గుంటూరులో గుర్తించారు. ఈ ముఠాను అరెస్ట్ చేసి కటకటపాలు చేశారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రెండు రోజులకు కిందట కిడ్నీ మార్పిడి రాకెట్ వ్యవహారం బట్టబయలైంది. ప్రభుత్వ వైద్యుడు, ప్రైవేటు ఆస్పత్రి కేంద్రంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తూ పట్టుబడ్డాడు. ఆ చికిత్స వికటించడంతో బండారం మొత్తం బయటపడింది. దళారుల ద్వారా జరుగుతున్న ఈ దందా గుట్టు రట్టు అయింది. విశాఖ జిల్లా ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీ బొడ్డపాలెం గ్రామానికి చెందిన యమున అనే మహిళ
ఈ మాఫియాకు బలైంది.
చిత్తూరు జిల్లాలో మెడికల్ మాఫియా బుసలు కొడుతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. కొంత మంది వైద్యుల ముసుగులో దందాలకు పాల్పడుతున్నారు. దళారులతో చేతులు కలిపి పీక్కుతుంటున్నారు. మనుషుల అవయవాలతో వ్యాపారం చేస్తున్నారు. మదనపల్లి తరహాలో కిడ్నీ మార్పిడిలు, శిశు విక్రయం, అబార్షన్లు, లింగ నిర్ధారణను అవకాశంగా చేసుకుని నిబంధనలకు తూట్లు పొడిచి రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఉన్నతాధికారుల సరైన పర్యవేక్షణ లేక దర్జాగా మెడికల్ మాఫియా దందా సాగిపోతోంది. ఇంత జరుగుతున్నా వెద్య ఆరోగ్య శాఖ మామూళ్ల మత్తులో జోగుతోంది. ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల ఆగడాలు శ్రుతి మించుతున్నాయి.
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 2,500 పైగా ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. రిజిస్ట్రేషన్ లేని ఆస్పత్రులు 500 పైగా నడుస్తున్నాయి. ఆర్‌ఎంపీ క్లినిక్‌లు 4 వేలు, స్కానింగ్ సెంటర్లు 600 పైగా ఉండవచ్చునని అధికారుల అంచనా. వీటిలో చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వైద్య వ్యవస్థకే మాయని మచ్చను తెచ్చిపెడుతున్నాయి.
అమాయక ప్రజలను ఆసరా చేసుకుని కాసుల కక్కుర్తికి పాల్పడుతోంది. మదనపల్లిలో జరిగిన కిడ్నీ రాకెట్‌తో ప్రైవేటు ఆస్పత్రుల, వైద్యుల అక్రమ వ్యాపారం బహిర్గతమైంది. మెడికల్‌లో దళారులను వెలుగులోకి తీసుకొచ్చింది. ఈరకమైన ఘటనలు (అక్రమ స్కానింగ్, పసికందుల మాయం) జిల్లాలో జరిగిన వైద్య ఆరోగ్యశాఖ నిద్రాణంగా ఉండడం విస్మయానికి గురిచేస్తోంది.
అబార్షన్లకు అడ్డా
చిత్తూరు జిల్లా కేంద్రం అక్రమ స్కానింగ్‌లు, అబార్షన్లకు అడ్డగా పేరొందింది. ఇందు కోసం జిల్లా నలుమూలల నుంచి రావడంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం నుంచి పదుల సంఖ్యలో గర్భిణులు వస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని పరిచయాలు దళారులను పోషిస్తున్నాయి.
ప్రస్తుతం పెళ్లి కాకుండానే గర్భిణులు అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి కేసులు జిల్లాతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి అధికంగా వస్తున్నారు. జిల్లాకు మధ్యవర్తుల ద్వారా అబార్షన్లకు వస్తున్నారు. వీరిలో కొంత మంది ఐదు నెలలు దాటితే అబార్షన్ కాదని చెప్పడం. తర్వాత బిడ్డ ప్రసవం..ఆపై మాయమవుతోంది.
డెమో విభాగం డమ్మీనేనా..
ప్రైవేటు ఆస్పత్రుల పుట్టు పూర్వోత్రాలు మొత్తం డెమో విభాగం చేతిలో ఉంటుంది. చిత్తూరు డెమో చేతిలో అధికారిక, అనధికారిక ఆస్పత్రుల వివరాలు పక్కాగా ఉన్నాయి. కానీ అనధికారిక ఆస్పత్రులను టచ్ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. చూసీ చూడ నట్లు వెళ్లిపోతున్నారు. ఆస్పత్రుల పనితీరుపై నిఘా పెట్టలేకపోతున్నారు. ఓ అధికారి మమల్ని తనిఖీలకు వెళ్లకుండా డమ్మీగా కూర్చోబెట్టారని డెమో సెక్షన్‌లోని పలువురు వాపోతున్నారు.
బొమ్మసముద్రం పీహెచ్‌సీ పరిధిలో జరిగిన ఘటనతో పీసీపీఎన్‌డీటీ ప్రోగ్రాం ఆఫీసర్ తోటపాళ్యంలోని ఓ స్కానింగ్ సెంటర్‌ను తనిఖీ చేస్తే...తన అనుమతి లేకుండా ఎలా వెళ్లావంటూ ఓ అధికారి సంజాయిషీ అడిగారు. దీంతో ఆ అధికారి కూడా మిన్నుకుండిపోయారు. కాగా వైద్య వ్యవస్థల్లో జరుగుతున్న అక్రమాలను కట్టడి చేయడంలో వైద్యశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ప్రజలు మండిపడుతున్నారు.
అనుమతుల్లేని ఆస్పత్రులు
చిత్తూరు జిల్లాలో అనుమతిలేని ఆస్పత్రులు కోకొల్లుగా ఉన్నాయి. చిత్తూరు నగరంలో ప్రధానంగా సుందరయ్యవీధిలో అనుమతిలేని ఆస్పత్రులు అధికంగా ఉన్నాయి. అలాగే గిరింపేట, దర్గా సర్కిల్, కొంగారెడ్డిపల్లి, గాం«దీరోడ్డు, సంతపేట, మురకంబట్టు తదితర ప్రాంతాల్లో అనధికారిక ఆస్పత్రులు ఏళ్ల తరబడి నాటుకుపోయాయి.
తిరుపతి జిల్లాలో రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, ఎయిర్ బైపాస్ రోడ్డు, కరకంబడి రోడ్డు, లీలామహాల్ సెంటర్ తదితర ప్రాంతాల్లో బహిరంగంగానే అనుమతి లేని ఆస్పత్రులు పాతుకుపోయాయి. ఈ విషయం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం వెనుక ఆంత్యరం ఏమిటోననే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


