లోకేశ్‌ తక్షణమే రాజీనామా చేయాలి | Kakani Govardhan Reddy Strong Warning to Nara Lokesh Over Mega DSC Scam | Sakshi
Sakshi News home page

లోకేశ్‌ తక్షణమే రాజీనామా చేయాలి

May 31 2026 5:11 AM | Updated on May 31 2026 5:11 AM

Kakani Govardhan Reddy Strong Warning to Nara Lokesh Over Mega DSC Scam

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి 

జూన్‌ 1న కలెక్టరేట్‌ ముట్టడి

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరురూరల్‌: డీఎస్సీ–2025 నియామకాల్లో భారీ అక్రమాలు జరిగా­యని, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ వెంటనే బాధ్యత వహించి రాజీనామా చేయాలని శ్రీపొట్టిశ్రీరాములు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. నెల్లూరు నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. డీఎస్సీ అక్రమాలను ఆధారాలతో సహా బయట పెట్టామని, ఆ ఆరోపణలకు తూతూమంత్రంగా అధికారులు ఖండన ఇచ్చారని, మేం లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇవ్వలేదన్నారు.

డీఎస్సీ అక్రమాలపై జూన్‌ 1న కలెక్టరేట్‌ల ముట్టడిని నిర్వహిస్తున్నామని, ఈ స్కాంపై ప్రభుత్వం సీబీఐతో దర్యాప్తు జరిపించే వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా పోస్టులు అమ్ముకుందన్నారు. అర్హులైన అభ్యర్థులకు కాల్‌ లెటర్లు పంపి, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యాక కూడా తుది జాబితాలో వారి పేర్లు గల్లంతయ్యాయని, మెరిట్‌ లిస్ట్, సెలక్షన్‌ లిస్టు రెండూ ప్రకటించకుండా ఎంపిక చేసిన అభ్యర్థులకు నేరుగా మెసేజ్‌ల ద్వారా సమాచారం ఇచ్చారన్నారు. ఒక పోస్టుకు ఒక్కరినే ఎంపిక చేసి సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రభుత్వం పిలిచిందని, కానీ వారికి ఉద్యోగాలు ఇవ్వలేదని, అటు వారిని రిజెక్టెడ్‌ జాబితాలోనూ చూపలేదని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అభ్యర్థులు గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు చేస్తే అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని తెలిపారు. అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా, బేఖాతరు చేస్తూ అప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసినట్లు కోర్టుకు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. డీఎస్సీ ఫలితాల ప్రకటన వరకు ఒక విధానం, సర్టిఫికెట్ల పరిశీలనకు మరో విధానం, తుది ఎంపిక జాబితా విడుదల సమయంలో మరో విధానాన్ని అమలు చేశారన్నారు. అలా పరీక్ష రాసిన అభ్యర్థులకు మెరిట్‌ లిస్ట్‌ పరిశీలించే వీలు లేకుండా చేశారన్నారు.

మామూలుగా ఏ పరీక్షలో అయినా, మెరిట్‌ లిస్ట్‌ ప్రకటించిన తర్వాత సెలక్షన్‌ లిస్టు తయారు చేసి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారని, కానీ, ఈ డీఎస్సీ–2025లో మాత్రం మెరిట్‌ లిస్ట్, సెలక్షన్‌ లిస్ట్‌ లేకుండా నేరుగా సెలెక్టెడ్‌ అభ్యర్థులకు ఒక పోస్టుకు ఒకరిని చొప్పున మాత్రమే ఎంపిక చేసి, సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారని, చివరకు వారికి కూడా మొండిచేయి చూపారన్నారు. అందుకే డీఎస్సీ–2025పై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement