ఇస్రో చూసొద్దామా.. లక్కీ ఛాన్స్‌ మిస్సవకండి.. దరఖాస్తు చేయండిలా..

ISRO Young Scientist Program YUVIKA 2022 Invites Applications - Sakshi

రాజమహేంద్రవరం రూరల్‌/భానుగుడి (కాకినాడ సిటీ): అంతరిక్ష పరిజ్ఞానం పెంచేందుకు వీలుగా తొమ్మిదో తరగతి విద్యార్థులకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చక్కని అవకాశం కల్పిస్తోంది. ఇందుకు యువికా–2022 పేరుతో యంగ్‌ సైంటిస్ట్‌ ప్రోగ్రాం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని వివిధ అంతరిక్ష పరిశోధన కేంద్రాలను ప్రతిభావంతులైన విద్యార్థులు సందర్శించవచ్చు.

చదవండి: New Education Policy: డిగ్రీ ఇక నాలుగేళ్లు

అంతరిక్షంలో ఎలా ఉంటుంది, ఉపగ్రహ ప్రయోగాలు ఎలా చేస్తారు తదితర విషయాలు ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. నిపుణులతో చర్చలు తదితర కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఈ స్ఫూర్తితో భావి శాస్త్రవేత్తలుగా ఎదగవచ్చు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 9వ తరగతి విద్యార్థులు 82,412 మంది ఉన్నారు. అందరూ ఈ అవకాశానికి ప్రయతి్నంచాలని విద్యాశాఖాధికారులు సూచిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు విద్యార్థులను ఈ దిశగా ప్రోత్సహించాలని కోరుతున్నారు. 

దరఖాస్తు చేయడమిలా..
ఇస్రో ప్రధాన వెబ్‌సైట్‌ ‘ఐఎస్‌ఆర్‌ఓ.జీఓవీ.ఇన్‌’లో సొంత ఈ–మెయిల్‌ ఐడీతో విద్యార్థి లాగిన్‌ అయి, రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. తరువాత రెండు రోజులకు ఇస్రో నిర్వహించే ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీల్లో పాల్గొనాలి. ఆ తరువాత అదే వెబ్‌సైట్‌ ద్వారా ఏప్రిల్‌ 10వ తేదీ లోగా దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తుతో పాటు విద్యార్థులు తరగతిలో తమ ప్రతిభకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. ఎంపికైన వారి జాబితాను అదే నెల 20న వెబ్‌సైట్‌లో ఉంచుతారు. పరిశీలన అనంతరం ఇస్రో తుది జాబితా ప్రకటిస్తుంది. దేశవ్యాప్తంగా జరిగే వడపోతలో రాష్ట్రానికి ముగ్గురు చొప్పున అవకాశం కల్పిస్తారు.

చదవండి: కొత్త జిల్లాలకు కేబినెట్‌ ఆమోదం.. అవతరణకు ముహూర్తం ఖరారు

ఎంపికైన విద్యార్థులకు విక్రమ్‌ సారాభాయి స్పేస్‌ సెంటర్‌ (తిరువనంతపురం), యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌ (బెంగళూరు), స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ (అహ్మదాబాద్‌), నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (హైదరాబాద్‌), నార్త్‌ ఈస్ట్‌ స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ (షిల్లాంగ్‌)లలో మే 16 నుంచి 28వ తేదీ వరకూ 13 రోజుల పాటు రెసిడెన్షియల్‌ విధానంలో శిక్షణ ఇస్తారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సైతం అవకాశం కల్పించారు. శిక్షణ, బస, ప్రయాణ తదితర అన్ని ఖర్చులనూ ఇస్రో భరిస్తుంది. శిక్షణ పూర్తయిన విద్యార్థులకు శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో రాకెట్‌ ప్రయోగాలపై అవగాహన కల్పిస్తారు.

ఎంపిక చేస్తారిలా.. 
ఎనిమిదో తరగతిలో సాధించిన మార్కులకు 60 శాతం వెయిటేజీ ఇస్తారు. 2016 నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్, చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి 10 శాతం, క్రీడల్లో ప్రతిభకు 10 శాతం ఎన్‌సీసీ, స్కౌట్‌ విభాగాల్లో ఉన్న వారికి 5 శాతం, గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివే వారికి 15 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంపిక చేస్తారు.

అవకాశాన్ని అందుకోవాలి 
జిల్లాలోని తొమ్మిదో తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఏ రంగంలోనైనా అవకాశాలను అందిపుచ్చుకున్న వారినే విజయం వరిస్తుంది. చిన్న వయస్సులోనే శాస్త్ర, సాంకేతిక అంశాలు పరిచయమైతే భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. వివరాలకు 99127 88333 సెల్‌ నంబరులో సంప్రదించాలి. 
– ఎం.శ్రీనివాస్‌ వినీల్, జిల్లా సైన్స్‌ అధికారి, కాకినాడ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top