
నిబంధనలకు విరుద్ధంగా కౌన్సెలింగ్
పోస్టులు బ్లాక్ చేశారని ఆరోపణలు
సాధారణ బదిలీల్లోనూ పెద్ద ఎత్తున పోస్టులు బ్లాక్
డబ్బులు ఇచ్చినోళ్లకు పోస్టింగులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆరోగ్య శాఖలో వైద్యుల ప్రమోషన్లు, బదిలీ ప్రక్రియను చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయంగా మార్చేసింది. డిమాండ్ అధికంగా ఉండే ఆస్పత్రుల్లో పోస్టులను ప్రభుత్వ పెద్దలు బ్లాక్ చేసి అమ్మేస్తున్నారని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024–25 ప్యానల్ సంవత్సరానికి వైద్యులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ) పరిధిలో పదోన్నతిపై సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ (సీఎస్‌ఎస్) పోస్టింగుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.
డోన్, పుంగనూరు, గుంతకల్లు ఆసుపత్రుల్లో గైనకాలజిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, కౌన్సెలింగ్‌లో చూపించలేదని పదోన్నతి పొందిన వైద్యులు వెల్లడించారు. ఎమ్మిగనూరులో అనస్థీíÙయా పోస్టు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రదర్శించ లేదన్నారు. ఖాళీగా ఉన్న స్థానాలను ఎందుకు చూపలేదని కౌన్సెలింగ్ జరుగుతున్న సమయంలో వైద్యులు నిలదీస్తే అధికారులు పొంతన లేని సమాధానం చెప్పారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల కేసులో ఇటీవల కొందరు కేజీహెచ్ వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, పోలీసులు అరెస్ట్ చేసిన ఓ డాక్టర్‌ను డీఎంఈ అధికారులు కౌన్సెలింగ్‌కు పిలవడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
సాధారణ బదిలీల్లోనూ ఇదే తంతు
జూన్ నెలలో చేపట్టిన సాధారణ బదిలీల్లోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. డీఎంఈ పరిధిలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అవసరాలను సాకుగా చూపి, పాత వైద్య కళాశాలల్లో పోస్టులను ప్రభుత్వ పెద్దలు బ్లాక్ చేశారు. బదిలీలు ముగిశాక సీఎం ప్రత్యేక అనుమతులతో బ్లాక్ చేసిన పోస్టుల్లో వారికి ఇష్టం వ చ్చిన వారిని నియమించారు.
అప్పట్లో గుంటూరు, విజయవాడ, కాకినాడ, విశాఖ వంటి ప్రాంతాల్లో పోస్టింగ్స్ కోసం ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూళ్లుచేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. స్పౌజ్ (భార్యాభర్తలు) కేటగిరీలో ఒకరికి ఐదేళ్లలోపు సర్వీస్ ఉంటే ఇద్దరికీ బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. వైద్య దంపతులతో పెద్ద ఎత్తున డబ్బు వసూళ్లు చేసి ఈ నిబంధనను ప్రవేశ పెట్టారని వైద్య వర్గాల్లో చర్చ నడుస్తోంది. బదిలీలు ముగిశాక వసూళ్ల పర్వం వెలుగులోకి వచ్చింది.