
మీటింగ్స్, ఈ–మెయిల్స్, ఫైళ్ల నిర్వహణను సులభతరం చేస్తున్న ఏఐ టూల్స్
ఏఐతో పని సులువైందంటున్న 86 శాతం మంది ఉద్యోగులు
కార్యాలయాల్లో ఏఐ వినియోగంతో జెన్‌జెడ్ స్పీడ్
పాతతరం వారికి నూతన టెక్నాలజీ వినియోగాన్ని నేర్పుతున్న జెన్‌జెడ్
ఇంటర్నేషనల్ వర్క్‌ప్లేస్ గ్రూపు సర్వేలో వెల్లడి
సాక్షి, అమరావతి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందిపుచ్చుకుని వేగంగా పనులు పూర్తిచేయడంలో జెనరేషన్ జెడ్ (జెన్‌జెడ్– 1997–2012 మధ్య జన్మించినవారు) దూసుకుపోతోంది. కేవలం ఏఐను వినియోగించుకోవడమే కాకుండా దీన్ని ఏ విధంగా వాడుకోవాలన్నదానిపై పాతతరం ఉద్యోగులకు నేర్పించడంలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాలు ఇంటర్నేషనల్ వర్క్‌ప్లేస్ గ్రూపు తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
సమావేశాలకు సిద్ధం కావడం, ఈ–మెయిల్స్ పంపడం, ఫైళ్ల నిర్వహణ.. ఇలా రోజువారి ఆఫీసు కార్యాకలాపాల్లో ఏఐ టూల్స్‌ను జెన్‌జెడ్ వినియోగిస్తోంది. దీంతో సగటున రోజుకు 55 నిమిషాల సమయం ఆదా అవుతున్నట్లు సర్వే వెల్లడించింది. ఈ టూల్స్ వల్ల వారు ఒకసారి చేసిన పనిని తిరిగి చేయాల్సిన అవసరం లేకుండా కొత్త కార్యకలాపాలపై దృష్టిసారించడానికి వీలుకలుగుతోందని తేలింది.
అమెరికా, బ్రిటన్‌లలో రెండువేల మంది ఉద్యోగులపై నిర్వహించిన ఈసర్వేలో 86 శాతం మంది ఉద్యోగులు ఏఐతో చాలా ప్రయోజనం పొందుతున్నట్లు తెలిపారు. అంతేకాదు 76 శాతం మంది తమ పదోన్నతుల్లో ఏఐ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. అదే జెన్‌జెడ్‌లో అయితే 87 శాతం మంది పదోన్నతులు పొందడంలో ఏఐ కీలకపాత్ర పోషించిందని తెలిపారు.
ఏఐ వినియోగం తప్పనిసరి
రానున్న కాలంలో పనిచేసేచోట ఏఐ వినియోగం తప్పనిసరి కానుందని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. దీనికి అనుగుణంగా వ్యాపారసంస్థలు తమ విభాగాల్లో జెన్‌జెడ్‌ను ప్రోత్సహిస్తూ పాతతరం వారికి కొత్త టూల్స్‌పై అవగాహన కల్పించే విధంగా శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ విధంగా హైబ్రీడ్ టీమ్స్‌ను ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తున్నట్లు సర్వే వెల్లడించింది. ఏఐ టూల్స్ ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు పెరుగుతున్నాయని 82 శాతం మంది పేర్కొన్నారు.
ఇంటర్నేషనల్ వర్క్‌ప్లేస్ గ్రూపు సీఈవో మార్క్స్ డిక్సన్ మాట్లాడుతూ రోజువారి దైనందిన కార్యకలపాల్లో ఏఐ వినియోగం అన్నది తప్పనిసరి అవుతోందని, దీంతో వీటిని వినియోగించే జెన్‌జెడ్ యువతకు అవకాశాలు మరింత పెరుగుతున్నాయని చెప్పారు. పాతతరం కొత్తతరం కలిసి పనిచేయడం ద్వారా అధిక ఉత్పత్తిని పెంచవచ్చని 82 శాతం మంది అభిప్రాయపడినట్లు తెలిపారు.
కొత్తతరం డిజిటల్ వినియోగిస్తుంటే దీనికి సీనియర్ ఉద్యోగుల వృత్తి అనుభవాన్ని జోడించడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందుతున్నట్లు చెప్పారు. కంపెనీలు తమ లాభాలను పెంచుకోవడానికి జెన్‌జెడ్‌తో కలిసి సీనియర్లు పనిచేసే విధంగా పనిసంస్కృతిని పెంచుకుంటున్నట్లు డిక్సన్ తెలిపారు.