వైఎస్సార్‌ జిల్లాకు రూ.35,090 కోట్ల పెట్టుబడులు

Investment Of Rs 35090 Crores To YSR District - Sakshi

ఒకే రోజు నాలుగు కీలక ప్రాజెక్టుల శంకుస్థాపనకు కార్యచరణ ప్రణాళిక   

కొప్పర్తిలో వైఎస్సార్‌ఈఎంసీ, వైఎస్సార్‌ జగనన్న ఎంఐహెచ్, పులివెందుల ఆటోనగర్, అపాచి లెదర్‌ పార్కుల పనులు 24న ప్రారంభించనున్న సీఎం 

3.54 లక్షల మందికి ఉపాధి  

తక్షణం పనులు ప్రారంభించేందుకు 10 భారీ పరిశ్రమలకు అనుమతి

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ జిల్లాలో 4,025.68 ఎకరాల్లో నాలుగు భారీ ప్రాజెక్టుల ద్వారా రూ.35,090 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చే ఈ కీలక ప్రాజెక్టుల పనులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేలా పరిశ్రమల శాఖ కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసింది.  ఈ ప్రాజెక్టుల వల్ల 3.54 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్‌ ఎల్రక్టానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ (వైఎస్సార్‌ ఈఎంసీ), వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండ్రస్టియల్‌ హబ్‌ (ఎంఐహెచ్‌), పులివెందులలో ఇంటిలిజెంట్‌ సెజ్‌ పాదరక్షల తయారీ కేంద్రం, పులివెందుల ఆటోనగర్‌ పార్కులకు డిసెంబర్‌ 24న సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇదే రోజు కంపెనీల నిర్మాణ పనులు కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పది కీలక కంపెనీలతో చర్చలు పూర్తి చేసి, పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

3,164 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ 
► వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తి వద్ద ఏపీఐఐసీ సేకరించిన 6,914 ఎకరాల్లో 3,164.46 ఎకరాలను వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండ్రస్టియల్‌ హబ్‌గా అభివృద్ధి చేయనున్నారు. తద్వారా 25,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, 2.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.  
► ఇప్పటికే ఎంఐహెచ్‌ ముఖ ద్వారంతో పాటు ఇతర మౌలక వసతుల కల్పనకు సంబంధించిన పనులు వేగంగా నడుస్తున్నాయి. ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పిత్తి ఇంజనీరింగ్‌ లిమిటెడ్, నీల్‌కమల్, ట్రియోవిజన్, సెంచురీ ప్లై, రొటోమాక్, ఫార్మా కంపెనీలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. 
► కొప్పర్తిలో 801 ఎకరాల్లో వైఎస్సార్‌ ఎల్రక్టానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ను అభివృద్ధి చేయనున్నారు. తొలి దశలో 540 ఎకరాలు అభివృద్ధి చేస్తున్నారు. రెడీటూ వర్క్‌ విధానంలో అభివృద్ధి చేస్తున్న ఈ పార్కులో 34 షెడ్లు నిర్మిస్తారు.  
► ఇప్పటికే వీటికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ క్లస్టర్‌ ద్వారా రూ.10,000 కోట్ల పెట్టుబడులు.. లక్ష మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. డిక్సన్‌ టెక్నాలజీస్, టెక్‌చరన్‌ బ్యాటరీస్‌ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. 
► అపాచీ పాదరక్షల తయారీ సంస్థ శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో ఏర్పాటు చేసే ఇంటిలిజెంట్‌ సెజ్‌ యూనిట్‌కు అదనంగా పులివెందులలో 28 ఎకరాల్లో రూ.70 కోట్లతో కాంపోనెంట్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. తద్వారా 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. 
► పులివెందులలో ఏపీఐఐసీ 32.22 ఎకరాల్లో ఆటోనగర్‌ పార్కును అభివృద్ధి చేస్తోంది.  సూక్ష్మ, మధ్య తరగతి సంస్థలను ఆకర్షించే విధంగా 281 ప్లాంట్లు అభివృద్ధి చేస్తారు. దీని ద్వారా రూ.20 కోట్ల పెట్టుబడితో పాటు 2 వేల మందికి పత్యక్షంగా ఉపాధి లభిస్తుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top