ఏపీలో పెరిగిన సగటు విద్యుత్‌ వినియోగం

Increased average power consumption in Andhra Pradesh - Sakshi

బొగ్గు సంక్షోభంలోనూ డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్‌ సరఫరా

జాతీయ సగటును మించిపోయిన రాష్ట్ర వాడకం

అక్టోబర్‌లో 17.2 శాతం పెరిగిన వినియోగం  

సాక్షి, అమరావతి: వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయి. బొగ్గు సంక్షోభంలోనూ డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్‌ అందిస్తూ రాష్ట్రంలో వెలుగులు నింపుతున్నాయి. తీవ్ర బొగ్గు కొరత వల్ల అక్టోబర్‌లో అనేక రాష్ట్రాలు ఇబ్బందులు పడినా.. ఏపీలో మాత్రం జాతీయ సగటు కంటే ఎక్కువ విద్యుత్‌ వినియోగం నమోదయ్యింది.  

సంక్షోభంలోనూ రికార్డు.. 
ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి, వినియోగదారుల సంక్షేమానికి.. నిరంతరం విద్యుత్‌ సరఫరా అందించటం కీలకమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తగినట్లే విద్యుత్‌ పంపిణీ సంస్థలు, ఇంధన శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా జాతీయ సగటు విద్యుత్‌ వినియోగం అక్టోబర్‌లో 4.8 శాతం పెరిగితే, ఏపీలో ఏకంగా 17.2 శాతం పెరిగింది. గతేడాది ఇదే నెలలో రాష్ట్రంలో సగటు విద్యుత్‌ వినియోగం 4,972 మిలియన్‌ యూనిట్లుగా నమోదు కాగా.. ఈ ఏడాది అక్టోబర్‌లో 5,828 మిలియన్‌ యూనిట్లకు చేరింది. దేశంలో గతేడాది అక్టోబర్‌లో 109.17 బిలియన్‌ యూనిట్లుగా నమోదు కాగా.. ఈ ఏడాది 114.37 బిలియన్‌ యూనిట్లకు చేరింది. ఇక గతేడాది అక్టోబర్‌ 31న రాష్ట్రంలో గరిష్ట విద్యుత్‌ వినియోగం 8,820 మెగావాట్లుగా ఉండగా.. ఈ ఏడాది అక్టోబర్‌ 19న గరిష్ట విద్యుత్‌ వినియోగం 9,865 మెగావాట్లుగా నమోదైంది.  

ప్రతికూల పరిస్థితుల్లోనూ రాజీ లేదు 
ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన, చౌక విద్యుత్‌ అందించే విషయంలో ప్రభుత్వం రాజీపడదని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ చెప్పారు. విద్యుత్‌ డిమాండ్‌పై ఏపీ ట్రాన్స్‌కో, రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ విభాగాలతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. చౌక విద్యుత్‌ సరఫరాలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలని సీఎం జగన్‌ లక్ష్యమని శ్రీకాంత్‌ తెలిపారు. భవిష్యత్‌లో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు వంద శాతం నమ్మకమైన, నిరంతర విద్యుత్‌ సరఫరా కొనసాగించేందుకు అవసరమైన కృషి జరగాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని చెప్పారు.

సమావేశంలో ఏపీ ట్రాన్స్‌కో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లు ఇమ్మడి పృథ్వీతేజ్, బి.మల్లారెడ్డి, డైరెక్టర్‌ కె.ప్రవీణ్, చీఫ్‌ ఇంజనీర్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, వినియోగదారులకు నాణ్యమైన చౌక విద్యుత్‌ను అందించేందుకు, రాష్ట్రానికి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చేందుకు ఇంధన శాఖ అధికారులు చేస్తున్న కృషిని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభినందించారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top