
ఒక్క ఎఫ్‌ఐఆర్‌తో అపరిమిత కేసుల నమోదుకు కుట్ర
సోషల్ మీడియా కార్యకర్తలపై దాష్టీకం
అక్రమ కేసులతో విరుచుకుపడుతున్న సీఐడీ
ఏకంగా సుప్రీం కోర్టు తీర్పు సైతం బేఖాతర్..
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ వేధింపులను చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తీవ్రతరం చేసింది. అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలు, హైకోర్టు మార్గదర్శకాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టుల పరంపరకు తెగించింది.
భావప్రకటన స్వేచ్ఛను హరించే కుట్రకు ఈసారి సీఐడీని అస్త్రంగా చేసుకుంది. పక్కా పన్నాగంతో ఓ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. ఆ ఒక్క ఎఫ్‌ఐఆర్ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ అరెస్టులతో విరుచుకుపడుతోంది. సీఐడీ, డీజీపీ కార్యాలయాల పర్యవేక్షణలో బరితెగించి సాగుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగ వేధింపుల కుట్ర ఇలా ఉంది...
ఒకే ఒక ఎఫ్‌ఐఆర్... అన్ లిమిటెడ్ అక్రమ కేసులు
రాష్ట్రంలో గతేడాది చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రజల భావ ప్రకటన హక్కును కాలరాయడమే పనిగా పెట్టుకుంది. ఏడాది కాలంలోనే సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమంగా ఏకంగా 282 పోలీసు కేసులు నమోదు చేయడంతోపాటు 84 మందిని అరెస్టు చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వ నియంతృత్వ వైఖరి, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనపై హైకోర్టు, సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించాయి. పోలీసులను గట్టిగా మందలించాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలను వేధించేందుకు మరో కొత్త ఎత్తుగడ వేసింది.
ఆ కుట్రలకు ఈసారి సీఐడీ విభాగాన్ని అస్త్రంగా చేసుకుంది. సోషల్ మీడియా పోస్టులపై ఈ నెల 9న సీఐడీ ఓ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఎవరిపై కేసు నమోదు చేశారన్నది స్పష్టం చేయకుండా ఫేస్‌బుక్ యూఆర్‌ఎల్, ఇన్‌స్ట్రాగామ్ యూఆర్‌ఎల్‌లను నిందితుల కాలమ్‌లో పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ప్రభుత్వ కుతంత్రాన్ని స్పష్టం చేస్తోంది. అంటే తాము లక్ష్యంగా చేసుకున్న సోషల్ మీడియా కార్యకర్తల్లో ఎవర్నయినా అక్రమంగా అరెస్టు చేసేందుకే ఈ కుయుక్తి పన్నిందన్నది సుస్పష్టం.
అక్రమ అరెస్టులకు తెగబడుతున్న సీఐడీ
ఎఫ్‌ఐఆర్ నమోదు తర్వాత డీజీపీ కార్యాలయం, సీఐడీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అక్రమ అరెస్టులకు తెగబడటం మొదలెట్టాయి. డీఎస్పీలు, ఇతర అధికారులతో కూడిన ఈ బృందాలకు ఐజీ ఆకే రవికృష్ణ నేతృత్వం వహిస్తుండటం గమనార్హం. డీజీపీ, అదనపు డీజీ(శాంతి భద్రతలు) ఈ వ్యవహారాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. స్థానిక పోలీసులకు కనీస సమాచారం లేకుండానే అక్రమంగా అరెస్టులకు తెగబడాలని కార్యాచరణ రూపొందించారు. ఈ అరాచక పర్వానికి ఈ ఘటనలే మచ్చుకు ఉదాహరణ..
గుంటూరులో నిర్బంధంలో సోషల్ మీడియా కార్యకర్త..
సోషల్ మీడియా కార్యకర్త పాలక ప్రతాప్‌రెడ్డిని గుంటూరులో బుధవారం అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను ఎవరు అదుపులోకి తీసుకున్నారు..? ఎక్కడికి తరలించారు? అనే కనీస సమాచారం కూడా లేదు. సోషల్ మీడియాలో ఏ పోస్టుపై అభ్యంతరంతో అదుపులోకి తీసుకున్నారో కూడా తెలియదు. సీఐడీ బృందాలుగా భావిస్తున్న అధికారులు గుంటూరు బస్ స్టేషన్ వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకుని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు.
సోషల్ మీడియా కార్యకర్త స్నేహితుడినీ....
సోషల్ మీడియా కార్యకర్తలనే కాదు.. వారి స్నేహితులను కూడా అక్రమంగా అరెస్టు చేస్తుండటం చంద్రబాబు సర్కారు పాశవిక విధానాలకు నిదర్శనం. నెల్లూరు జిల్లాకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త భరత్ చంద్రను అక్రమంగా అరెస్టు చేసేందుకు సీఐడీ అధికారులు యత్నించారు. ఆయన ఆచూకీ చెప్పాలంటూ భరత్ సోదరి ప్రీతిని పది రోజుల క్రితం ఆత్మకూరు పోలీసుస్టేషన్‌లో సీఐడీ పోలీసులు నిర్బంధించారు. భరత్ తల్లి, అక్క, చెల్లెలు ఫోన్‌లు సీజ్ చేశారు. న్యాయవాదుల చొరవతో భరత్ సోదరి విడుదలయ్యారు.
మహిళలను సైతం వేధిస్తుండటంపై నివ్వెరపోతున్నారు. భరత్ చంద్ర జాడ తెలియకపోవడంతో అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురానికి చెందిన ఆయన స్నేహితుడు బులగొండ సాయి భార్గవ్‌ను సీఐడీ అధికారులు అక్రమంగా అరెస్టు చేసేందుకు తెగబడటం విస్మయపరుస్తోంది. ఇంజనీరింగ్ కాలేజీలో స్నేహితులని, ఇద్దరి మధ్య బ్యాంకు లావాదేవీలున్నాయనే సాకుతో ఆయన్ను సీఐడీ అదుపులోకి తీసుకుని అమరావతికి తరలించింది.
వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరులో ఓ సోషల్ మీడియా కార్యకర్తను అక్రమంగా అరెస్టు చేసేందుకు సీఐడీ బృందాలు ప్రయతి్నస్తున్నాయని తెలుస్తోంది. రానున్న రోజుల్లో అక్రమ అరెస్టులను మరింత తీవ్రతరం చేసేందుకు సీఐడీ సన్నద్ధమవుతుండటం ప్రజాస్వామికవాదుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

సుప్రీం తీర్పు బేఖాతర్.. హైకోర్టు మార్గదర్శకాల ఉల్లంఘన
రెడ్‌బుక్ వేధింపులే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కారు సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తోంది. హైకోర్టు మార్గదర్శకాలను నిర్భీతిగా ఉల్లంఘిస్తోంది. సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు చేయవద్దని సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పునిచ్చింది. అటువంటి కేసుల్లో అరెస్టు చేస్తే రిమాండ్ విధించవద్దని కూడా న్యాయస్థానాలకు నిర్దేశించింది. ఈమేరకు ‘అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్’ కేసుల్లో విస్పష్టంగా పేర్కొంది.
చంద్రబాబు ప్రభుత్వం ఆ తీర్పును ఉల్లంఘిస్తూ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులతో విరుచుకుపడింది. ఏడాది కాలంలోనే 253 అక్రమ కేసుల్లో 822 మందికి నోటీసులిచ్చింది. 86 మందిని అక్రమంగా అరెస్టు చేసింది. ఈ అక్రమ అరెస్టులపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఈ ఏడాది జూలైలో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. సోషల్ మీడియా కేసుల్లో అక్రమ అరెస్టులు చేయవద్దని స్పష్టం చేసింది. అటువంటి కేసుల్లో రిమాండ్ విధించవద్దని మేజి్రస్టేట్‌లను ఆదేశించింది.
ఈమేరకు సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ మేజి్రస్టేట్‌లకు స్పష్టమైన మార్గదర్శకాలిచ్చింది. ప్రాథమిక విచారణ లేకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకూడదని స్పష్టం చేసింది. వీటిపై 14 రోజుల్లో విచారణ పూర్తి చేయాలంది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం, సీఐడీ విభాగం దీన్ని లెక్క చేయకుండా బరి తెగించాయి. సోషల్ మీడియా పోస్టులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే బీఎన్‌ఎస్ 35 (ఐపీసీ 41 ఏ) కింద నోటీసులిచ్చి వివరణ తీసుకోవాల్సి ఉండగా ఆ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి.
అక్రమ అరెస్టులతో అరాచకంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీసులు సోషల్ మీడియా యాక్టివిస్టు సవేంద్రరెడ్డిని తాడేపల్లిలో అక్రమంగా అదుపులోకి తీసుకుని ఏకంగా హైకోర్టునే బురిడీ కొట్టించేందుకు యత్నించడం సర్వత్రా తీవ్ర విభ్రాంతి కలిగించింది. హైకోర్టు తక్షణం స్పందించడంతో ఆయన్ను పోలీసులు విడిచిపెట్టారు.