స్కూల్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సులుగా హైస్కూళ్లు | High Schools as Schools of Excellence in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

స్కూల్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సులుగా హైస్కూళ్లు

Feb 14 2022 4:50 AM | Updated on Feb 14 2022 2:39 PM

High Schools as Schools of Excellence in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ హైస్కూళ్లను ‘స్కూల్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సు’లుగా తీర్చిదిద్దేందుకు పాఠశాల విద్యా శాఖ అడుగులు వేస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు నూతన విద్యావిధానంలోని లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు కదులుతోంది. విద్యార్థి కేంద్రంగా పాఠ్య, బోధన ప్రణాళికలు, ఫౌండేషన్‌ విద్యలో నిర్దేశించిన త్రిలక్ష్య సాధన, హైస్కూల్‌ విద్యార్థులకు సంపూర్ణ సామర్థ్యాలు సమకూరేలా సబ్జెక్టులవారీ బోధన.. అంతిమంగా ప్రతి విద్యార్థి ప్రపంచస్థాయి ప్రమాణాలను అందుకునేలా ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇందుకోసం అందుబాటులో ఉన్న మానవ, మౌలిక సదుపాయాల వనరులన్నిటినీ సమర్థంగా వినియోగించుకునేలా కార్యాచరణ చేపట్టింది. ఇందుకోసం పాఠశాలలను ఆరంచెల విధానంలో ఏర్పాటు చేస్తోంది. 2023–24 నాటికి వీటిని పూర్తి స్థాయిలో అమల్లోకి తేవాలని నిర్ణయించింది.   

ఉన్నత ప్రమాణాలతో విద్యే లక్ష్యం.. 
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే లక్ష్యంతో పాఠశాల విద్యలో అనేక సంస్కరణలు, కార్యక్రమాలు చేపట్టింది. అన్ని స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. విద్యార్థులకు మంచి ఆరోగ్యం, ప్రవర్తనలను అలవర్చడం, భావవ్యక్తీకరణ సామర్థ్యాలను పెంచడం, అభ్యసనం పట్ల ఆసక్తిని పెంచుతూ భాగస్వాములను చేయడం అనే లక్ష్యాలతో ఫౌండేషనల్‌ విద్యకు ఏర్పాట్లు చేయించింది.

రాష్ట్రంలో 2025 నాటికి ఫౌండేషనల్‌ లిటరసీ, న్యూమరసీ (అంకెల పరిజ్ఞానం)ని సాధించడమే వీటి ఉద్దేశం. ఇక 3వ తరగతి నుంచి విద్యార్థులకు సబ్జెక్టు అంశాలను బోధిస్తూ.. వారికి పూర్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు అలవడేలా హైస్కూళ్లకు అనుసంధానిస్తోంది. వీటిని ‘స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సులు’గా అభివృద్ధి చేస్తూ ఆరంచెల స్కూలింగ్‌ విధానాన్ని చేపట్టింది. 


మౌలిక వసతులతో అనేక కార్యక్రమాలు 
ఫౌండేషనల్‌ స్కూళ్లను అభివృద్ధి పర్చడంతోపాటు హైస్కూళ్లను స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సులుగా తీర్చిదిద్దేలా పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మనబడి నాడు – నేడు కింద మౌలిక వసతులను ఏర్పాటు చేసింది. మంచి అలంకరణలతో తరగతి గదులు, రన్నింగ్‌ వాటర్‌తో టాయిలెట్లు, తాగునీరు, మరమ్మతులు, ప్రహరీలు, విద్యుత్, ఫ్యాన్లు, లైట్లు, విద్యార్థులు–టీచర్లకు డ్యూయెల్‌ డెస్కులు, కుర్చీలు, అల్మారాలు వంటి ఫర్నిచర్, గ్రీన్‌చాక్‌ బోర్డులు, ఇంగ్లిష్‌ ల్యాబ్‌లు, కిచెన్‌ షెడ్లు నిర్మించింది.

జగనన్న అమ్మ ఒడితోపాటు జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద కార్యక్రమాలనూ అమలు చేస్తోంది. అలాగే ఫౌండేషనల్‌ స్కూళ్లలో ముగ్గురు అంగన్‌వాడీ వర్కర్, సహాయకులతోపాటు ఒకరు లేదా ఇద్దరు ఎస్‌జీటీ టీచర్లు ఉంటారు. హైస్కూళ్లలో సీబీఎస్‌ఈ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 10 నుంచి 15 మంది సబ్జెక్టు టీచర్లు ఉంటారు. ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, వర్చువల్‌ డిజిటల్‌ తరగతి గదులు కూడా అందుబాటులో ఉంటాయి. 

2023 నాటికి పూర్తి స్థాయిలో ఆరంచెల విధానం.. 
ఆరంచెల విధానానికి అనుగుణంగా 2023–24 నాటికి పూర్తి అయ్యేలా స్కూళ్ల మ్యాపింగ్‌ ప్రక్రియను అధికారులు ఇప్పటికే చేపట్టారు. ప్రస్తుతం 2,835 ప్రైమరీ స్కూళ్లను ఫౌండేషనల్‌ స్కూళ్లుగా తీర్చిదిద్దారు. 2,682 హైస్కూళ్లకు 3–5 తరగతుల విద్యార్థులను అనుసంధానించారు. ప్రభుత్వ, జెడ్పీ స్కూళ్ల నుంచి 1,73,441 మంది, మున్సిపల్‌ స్కూళ్ల నుంచి 30,013 మంది మొత్తం 2,03,454 మంది విద్యార్థులు హైస్కూళ్లకు అనుసంధానమయ్యారు.

2022–23లో కిలోమీటర్‌ పరిధిలోని ప్రైమరీ స్కూళ్లలో 3–5 తరగతుల విద్యార్థులను సమీపంలోని ప్రీ హైస్కూల్, హైస్కూళ్లకు అనుసంధానిస్తారు. వాటిలో అదనపు తరగతి గదులు నిర్మిస్తారు. ఇక జూనియర్‌ కాలేజీలు లేని 202 మండలాల్లోని హైస్కూళ్లలో +2 తరగతులు ప్రారంభిస్తారు. 2023–24లో 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రైమరీ స్కూళ్ల 3–5 తరగతుల విద్యార్థులను ప్రీ హైస్కూల్, హైస్కూళ్లలో అనుసంధానం చేస్తారు. ఈ హైస్కూళ్లను స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సులుగా మార్చేందుకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తారు. ఈ ప్రక్రియలో ఏ ఒక్క స్కూల్, అంగన్‌వాడీ కేంద్రం మూతపడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే ఏ ఒక్క టీచర్, అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టూ పోకుండా జాగ్రత్తలు తీసుకుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement