
నిబంధనలకు విరుద్ధంగా అరెస్టయిన వ్యక్తి క్షణం కూడా జైల్లో ఉండకూడదు
తురకా కిశోర్ విడుదలకు ఆదేశాలిస్తాం: హైకోర్టు
ఆయన అరెస్టు, రిమాండ్ విషయంలో పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారు.. అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లండి
ఈ రోజుల్లో హత్యాయత్నం కేసులు పెట్టడం సులభం
తలచుకుంటే మాపైనా నమోదు చేసుకోవచ్చు
ఆరేళ్ల క్రితం ఘటన జరిగితే ఇప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా?
పోలీసుశాఖ తీరుపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం
సర్కారు తీరును పరోక్షంగా ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ నేత తురకా కిశోర్ అరెస్ట్, రిమాండ్ విషయంలో పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అరెస్ట్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నపుడు అరెస్ట్ అయిన వ్యక్తి ఒక్క క్షణం కూడా జైలులో ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పింది. తురకా కిశోర్ విడుదలకు ఆదేశాలు ఇస్తామని తెగేసిచెప్పింది. తమ ఉత్తర్వులపై అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చునని పోలీసులకు స్పష్టం చేసింది.
కిశోర్ రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రధాన పిటిషన్ సవరించేందుకు పిటిషనర్‌కి హైకోర్టు వెసులుబాటునిచ్చింది. దీనిపై వాదనలు వింటామని తెలిపింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కిశోర్‌పై పలు హత్యాయత్నం కేసులు ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాది చెప్పగా, ఈ రోజుల్లో ఎవరిపైనైనా హత్యాయత్నం కేసులు పెట్టడం సులభమంది. తమపై కూడా నమోదు చేయవచ్చునని వ్యాఖ్యానించింది.
ఎప్పుడో జరిగిన ఘటనను ఇప్పుడు బయటకు తీసి ఇప్పుడు హత్యాయత్నం కేసు పెట్టడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదని పేర్కొంది. ఏ కేసులు పెట్టినా, ఏం చేసినా చట్ట నిబంధనల ప్రకారం చేయాలని తేల్చి చెప్పింది. ఆరేళ్ళ క్రితం ఘటన జరిగితే ఇప్పుడు కిశోర్‌పై కేసు పెట్టి అరెస్ట్ చేశారని గుర్తు చేసింది. ఇదే రీతిలో రెండేళ్లు, మూడేళ్లు క్రితం జరిగిన ఘటనల్లో కూడా ఇదే రీతిలో తప్పుడు కేసులు పెట్టారన్నారని పేర్కొంది. కిశోర్‌పై కేసుల నమోదు విషయంలో పోలీసులు నిర్దిష్ట విధానాన్ని అనుసరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.
అక్రమ నిర్భంధంపై హైకోర్టును ఆశ్రయించిన తురకా సురేఖ..
గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త తురకా కిశోర్‌ను పల్నాడు జిల్లా, రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్భంధించారని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురకా సురేఖ గతవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం తురకా కిషోర్‌పై నమోదు చేసిన కేసుకు సంబంధించిన రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని రెంటచింతల పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే.
బెయిల్ పిటిషన్ వేయకుంటే రిమాండ్ విధించేస్తారా..?
బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, తురకా కిశోర్‌పై నమోదు చేసిన కేసుకు సంబంధించిన రికార్డులను పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) టి.విష్ణుతేజ ధర్మాసనం ముందుంచారు. వీటిని ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించింది. అలాగే కిశోర్‌ను రిమాండ్‌కు పంపుతూ మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులనూ మరోసారి పరిశీలించింది. అరెస్టయిన కిశోర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు కాబట్టి, తాను రిమాండ్ విధిస్తున్నట్లు మేజిస్ట్రేట్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారని తెలిపింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేయకుంటే, రిమాండ్ విధించేస్తారా? మిగిలిన అంశాలను పరిగణనలోకి తీసుకోరా? అంటూ మేజి్రస్టేట్ తీరును ప్రశ్నించింది.
పరస్పర విరుద్ధమైన వాదనలేంటి..?
‘రిమాండ్ రిపోర్ట్ తీసుకునేందుకు కిశోర్ తిరస్కరించారని మీరు (పోలీసులు) చెబుతున్నారు. కానీ మేజిస్ట్రేట్ తన ఉత్తర్వుల్లో దీని గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. మీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింది కోర్టులో కిశోర్ ఏ కాగితాలను తీసుకోలేదని చెబుతారు. మరోవైపు తీసుకున్నట్లు కిశోర్ సంతకం చేసినట్లు చెబుతారు. ఏంటీ పరస్పర విరుద్ధమైన వాదనలు? నేరాంగీకార వాంగ్మూలంపై కిశోర్ సంతకం చేయలేదని అంటున్నారు. మీరు చెబుతున్నట్లు అతను కరడుగట్టిన నేరస్తుడే అనుకున్నా, అన్ని నేరాలూ చేసేశానంటూ ఒప్పేసుకుని సంతకం చేస్తారా?’ అని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.
నిర్బంధం అక్రమమైనప్పుడు ఆ వ్యక్తిని ఒక్క క్షణం కూడా జైల్లో ఉంచకూడదు
ఒక వ్యక్తి నిర్బంధం అక్రమమైనప్పుడు ఆ వ్యక్తి ఒక్క క్షణం కూడా జైల్లో ఉండటానికి వీల్లేదు.. అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని, విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ఎస్‌జీపీ విష్ణుతేజ కోరగా.. ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది. అప్పటి వరకు కిశోర్‌ను జైల్లోనే ఉంచమంటారా? అంటూ ఘాటుగా ప్రశ్నించింది. పలు కేసుల్లో కిశోర్‌ను అరెస్ట్ చేయాల్సి ఉందని విష్ణుతేజ చెప్పగా, వాటితో తమకు సంబంధం లేదని, తమ ముందున్న కేసుతోనే తమకు సంబంధమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఎప్పుడో ఆరేళ్ల క్రితం ఘటన జరిగితే, ఇప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా.. అంటూ ప్రశ్నించింది.
అలాగే రెండు, మూడేళ్ల క్రితం ఘటనలు జరిగితే ఇప్పుడు అరెస్ట్‌లు చూపారంది. కిశోర్ అరెస్ట్, రిమాండ్ విషయంలో చట్ట నిబంధనలను అనుసరించలేదనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది. అందువల్ల కిశోర్ విడుదలకు ఆదేశాలిస్తామంది. విష్ణుతేజ జోక్యం చేసుకుంటూ, పిటిషనర్ రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేయలేదని తెలిపారు.
అలా అయితే రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రధాన పిటిషన్‌లో సవరణ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డికి సూచించింది. దీంతో కిశోర్ అరెస్ట్‌ను, రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ తురకా సురేఖ ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అనుబంధ పిటిషన్ మధ్యాహ్నం విచారణకు రాగా, దీనిపై గురువారం విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేస్తూ ఆ మేర విచారణను వాయిదా వేసింది.