
తురకా కిషోర్‌కు మేజిస్ట్రేట్ కళ్లుమూసుకుని యాంత్రికంగా రిమాండ్ విధించారు
మేజిస్ట్రేట్ల తీరుపై హైకోర్టు మళ్లీ తీవ్ర అసంతృప్తి.. పోలీసులూ చట్ట నిబంధనలను పాటించలేదు
మూడేళ్ల క్రితం ఫిర్యాదులో ఇప్పుడు అరెస్టుచేస్తారా?
హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
కోర్టులో తమ ఎదుటే పేపర్లను తీసుకోవడానికి ఏజీపీ నిరాకరించడంపైనా మండిపాటు
విచారణ నేటికి వాయిదా
సాక్షి, అమరావతి: ఎన్నిసార్లు చెప్పినా కూడా మేజిస్ట్రేట్లు తీరు మార్చుకోకపోతుండడంపై హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తికి, అసహనానికి గురైంది. ‘ఏం చేస్తాం.. వారికి మేం సరైన శిక్షణ ఇవ్వలేకపోయాం.. అది మా తప్పే’.. అంటూ నిర్వేదం వ్యక్తంచేసింది. వైఎస్సార్‌సీపీ నేత తురకా కిషోర్ అరెస్టు విషయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని.. అయినా మేజిస్ట్రేట్ కళ్లు మూసుకుని రిమాండ్ విధించారని హైకోర్టు ఆక్షేపించింది.
ఇదే సమయంలో ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు, కోర్టు జారీచేసిన ఉత్తర్వులు, మీడియేటర్ రిపోర్ట్, సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్, ఎఫ్‌ఐఆర్ తదితరాలతో కూడిన పేపర్లను పిటిషనర్ (తురకా సురేఖ) తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి అందచేస్తుండగా, వాటిని తీసుకునేందుకు ప్రభుత్వ సహాయ న్యాయవాది(ఎస్‌జీపీ) తిరస్కరించడంపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. అసలు ఏం జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టులో తమ ముందే పేపర్లు తీసుకోవడానికి తిరస్కరిస్తారా అంటూ ఏజీపీపై హైకోర్టు ఫైర్ అయింది.
పేపర్లను తీసుకోవడానికి ఏజీపీ తిరస్కరించడాన్ని హైకోర్టు తన ఉత్తర్వుల్లో రికార్డ్ చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఇచ్చిన పేపర్లను ప్రభుత్వ న్యాయవాది తీసుకోవడానికి నిరాకరించిన నేపథ్యంలో, ఆ పేపర్లను తీసుకుని సీల్డ్ కవర్‌లో ఉంచి వాటిని తమ ముందుంచాలని రిజి్రస్టార్ (జ్యుడీషియల్)ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి (నేటికి) వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ తుటా చంద్రధనశేఖర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది.
పోలీసుల తీరుపై హైకోర్టుకు తురకా సురేఖ..
గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త తురకా కిషోర్‌ను పల్నాడు జిల్లా, రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురకా సురేఖ బుధవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం అసలు తురకా కిషోర్‌పై ఎన్ని కేసులు నమోదయ్యాయి.. వాటినెప్పుడు నమోదుచేశారు.. ఎప్పుడు, ఏ ఘటనలో అరెస్టుచేశారు.. తదితర వివరాలను తమ ముందుంచాలని పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించిన విషయం తెలిసిందే.
మూడేళ్ల క్రితం ఫిర్యాదు చేస్తే ఇప్పుడు అరెస్టా!?
ఈ నేపథ్యంలో.. సురేఖ వ్యాజ్యం సోమవారం విచారణకు వచి్చంది. ప్రభుత్వ సహాయ న్యాయవాది స్పందిస్తూ.. కిషోర్‌పై పోలీసు కేసులకు సంబంధించి ఎస్పీ తయారుచేసిన వివరాలను ధర్మాసనం ముందుంచారు. అందులో కొన్ని కేసులను పరిశీలించిన ధర్మాసనం పోలీసుల తీరుపై విస్మయం వ్యక్తంచేసింది. ఇందులో.. రెండు, మూడేళ్ల క్రితం ఫిర్యాదులు చేస్తే ఇప్పుడు తురకా కిషోర్‌ను అరెస్టుచేసినట్లు గమనించిన ధర్మాసనం దీనిపై పోలీసులను ప్రశ్నించింది. కిషోర్‌పై మొత్తం 16 కేసులు నమోదు చేశారని, ఇందులో మూడేళ్ల క్రితం ఫిర్యాదు చేసిన కేసులో ఇప్పుడు హడావుడిగా అరెస్టుచేయాల్సిన అవసరం ఏమొచి్చందని నిలదీసింది.
కిషోర్‌తో బలవంత సంతకానికి యత్నం..
ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది రామలక్ష్మణరెడ్డి స్పందిస్తూ.. తురకా కిషోర్ విషయంలో పోలీసులు చట్ట నిబంధనలను అనుసరించలేదన్నారు. ఎఫ్‌ఐఆర్ కాపీ కూడా వినలేదన్నారు. మేజిస్ట్రేట్ సైతం వాదనలు వినలేదని, దీనిపై అభ్యంతరం చెప్పడంతో అప్పుడు వాదనలు విన్నారని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మేజి్రస్టేట్ యాంత్రికంగా రిమాండ్ విధించారన్నారు. అంతేకాక.. పోలీసులే నేరాంగీకార వాంగ్మూలాన్ని తయారుచేసి, దానిపై కిషోర్‌తో బలవంతంగా సంతకం చేయించేందుకు ప్రయత్నించారని, అయితే.. సంతకం చేసేందుకు అతను నిరాకరించారని తెలిపారు.