
సాక్షి,విశాఖ: ఏపీకి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తూ పలు జిల్లాలకు రెడ్,ఆరెంజ్,ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురియనున్నట్లు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఎల్లో అలెర్ట్ చేస్తున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎంపీ ప్రఖర్ జైన్ తెలిపారు.
రాష్ట్రంలో 40-50కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని..ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెట్ల కింద నిలబడొద్దని, ప్రతి కూల వాతావరణంలో ఇంట్లోనే ఉండాలని తగు జాగ్రత్తలు చెప్పారు.