సాక్షి, తిరుపతి/విశాఖ: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా.. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా రూపాంతరం చెందనుంది. దీంతో.. వాతావరణ శాఖ అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేసింది. ఇంకోవైపు..
తిరుమలలో వారం రోజులుగా ఎడతెరిపి ఇవ్వకుండా కురుస్తున్న వర్షాలతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు.. జలాశయాలలో బారీగా నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే గోగర్భం డ్యామ్ నిండిపోవడంతో అధికారులు గేట్లు ఎత్తేశారు. ముంపు ముప్పు దృష్ట్యా.. లోతట్టు ప్రాంతాల గ్రామాలను అప్రమత్తం చేశారు.
తిరుమల భక్తుల రద్దీ ఇలా..
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 20 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న(శుక్రవారం) శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 71,110గా ఉంది. తలనీలాలు సమర్పించిన భక్తులు 25,695 మంది. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.89 కోట్లు.
మరిన్ని వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఎల్లుండికి నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం. దీని ప్రభావంతో ఇవాళ(శనివారం, అక్టోబర్ 25)) కోనసీమ,కృష్ణా,బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే.. ప్రకాశం, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.


