
తాడేపల్లి : తమ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోని రాష్ట్ర అప్పులపై ఎల్లో మీడియా, కూటమి నేతలు చేసిన తప్పుడు ప్రచారంలో వాస్తవమేంటో ప్రపంచానికి తెలిసిందన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా రూ. 3.70లక్షల కోట్లు అప్పులు మాత్రమే చేశామని, కరోనా సమయంలో ఆదాయాలు పడిపోయినా ప్రజలపై పన్నుల రూపంలో భారం వేయలేదన్నారు.
ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 23వ తేదీ) తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన చంద్రశేఖర్.. ‘ ‘జగన్ హయాంలో రాష్ట్ర అప్పులపై ఎల్లోమీడియా, కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారు. అసలు వాస్తవాలేంటో మేము ప్రపంచానికి తెలియచేశాం. రూ.3.70 లక్షల కోట్ల అప్పులు మాత్రమే చేశాం. కానీ మాపై నిత్యం విషం చిమ్మారు’ అని మండిపడ్డారు.
తప్పుడు లెక్కలు చెప్తుంటే పవన్ నిద్రపోతున్నారు..
‘గవర్నర్‌తో పది లక్షల కోట్ల అప్పు అంటూ అబద్ధం చెప్పించారు. రూ.15 లక్షల కోట్ల అప్పు చేసినట్టు మాపై విష ప్రచారం చేశారు. ఈ ఐదు నెలల్లోనే రూ 55,591 కోట్ల అప్పు చేశారు. ఇప్పటి వరకు రెండు లక్షల కోట్ల రూపాయిలు దాటిపోయింది. ఈ డబ్బంతా ఏం చేశారో చెప్పాలి. రాష్ట్రం తీసుకుంటున్న అప్పు, అసెంబ్లీలో చెప్తున్న మాటలకు, కాగ్ నివేదికల మధ్య చాలా తేడా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అప్పు ల్లో ఇంత తేడా ఏంటి?, ముఖ్యమంత్రి, ఆర్ధిక శాఖ మంత్రి తప్పుడు లెక్కలు చెప్తుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిద్ర పోతున్నారు.
రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరలు అందటం లేదంటే రూపాయి కూడా ఖర్చు చేయటం లేదు. మెడికల్ కాలేజిలను ప్రయివేటు వ్యక్తుల చేతిలో పెట్టటం వెనుక కారణం ఏంటి?, పేదవాడు వైద్యాన్ని ప్రయివేటు వ్యక్తుల దగ్గర కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. విలువైన మెడికల్ కాలేజీల భూములను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులన్నీ చంద్రబాబు మనుషులవే. వారి దోపిడీని అడ్డుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావటం లేదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు వెళ్తే మాపై అక్రమ కేసులు పెట్టారు’ అని ధ్వజమెత్తారు.
అమరావతిని పీపీపీ పద్ధతిలో ఎందుకు నిర్మాణం చేయడం లేదు?
‘నిజంగానే ppp మంచి పద్దతి ఐతే అమరావతిని కూడా అదే పద్దతిలో ఎందుకు నిర్మాణం చేయటం లేదు?, లక్ష కోట్లతో అమరావతి నిర్మాణం చేయటం ఏంటి?, వెలుగొండ ప్రాజెక్టు మీద చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. అసలు ఆ ప్రాజెక్టు కోసం చంద్రబాబు మొత్తం హయాంలో ఎంత ఖర్చు పెట్టారో బయట పెట్టగలరా?, ఈ ప్రాజెక్టుపై చర్చకు వచ్చే దమ్ము టీడీపీ నేతలకు ఉందా?, గవర్నర్ సాక్షిగా మేము అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశాం. కానీ అసెంబ్లీకి రావటం లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ప్రజా సమస్యలపై మాట్లాడటానికి టైం ఇవ్వమని అడిగితే ప్రభుత్వం పారిపోతోంది. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉంటూ ఉంటి అద్దె, జీతాలు, అలవెన్స్, చివరికి డీజిల్ డబ్బులు కూడా తీసుకున్నారు. చంద్రబాబు తీసుకున్న వాటన్నిటిపై ఆర్టిఐ కింద అడిగితే ప్రభుత్వం బయట పెట్టటం లేదు. ప్రభుత్వానికి దమ్ము ఉంటే చంద్రబాబు రాజీనామా చేయాలి. ప్రభుత్వ పనితీరును రెఫరెండం గా తీసుకుని ఎన్నికలు వెళ్దాం. మేము 11 మంది రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో తేలుతుంది. మా ఎమ్మెల్యేలపై ఎల్లోమీడియా విష ప్రచారం చేస్తోంది. ప్రజల కోసం మా పదవులను తృణప్రాయంగా వదిలేస్తాం. డబ్బులకు అమ్ముడుపోయే సంస్కృతి టీడీపీ నేతలది. కూటమి నేతల బెదిరింపులకు మేము భయపడం’ అని హెచ్చరించారు.
ఇదీ చదవండి: