గుంటూరు, తిరుపతి మధ్య కొత్త రైలు | Sakshi
Sakshi News home page

గుంటూరు, తిరుపతి మధ్య పట్టాలెక్కనున్న కొత్త రైలు

Published Tue, Aug 2 2022 7:12 PM

Guntur To Tirupati Train: New Express Flag off Date, Stoppings, Schedule - Sakshi

జమ్మలమడుగు (వైఎస్సార్‌ జిల్లా): నంద్యాల– ఎర్రగుంట్ల మధ్య మరో రైలు పట్టాలెక్కబోతుంది. ఈనెల 18వ తేదీన గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ (17261/17262) రాబోతుంది. ఇప్పటికే నంద్యాల– ఎర్రగుంట్ల రహదారిలో డెమో రైలు నడుస్తోంది. ప్రస్తుతం మరొకటి రాబోతుండటం.. నేరుగా తిరుపతికి వెళ్లే అవకాశం రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్తగా వస్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నంద్యాల, బనగాపల్లి, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడపలో మాత్రమే స్టాపింగ్‌ పెట్టారు. కొవెలకుంట్ల, జమ్మలమడుగులో స్టాపింగ్‌ లేకపోవడంతో ప్రజలు నిరుత్సాహపడుతున్నారు.  

మూడో రైలు పరుగులు తీయబోతుంది... 
ఇప్పటికే డెమో.. ధర్మవరం–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌లు ఎర్రగుంట్ల–నంద్యాల మీదుగా నడుస్తున్నాయి. కరోనా కారణంగా నంద్యాల– ఎర్రగుంట్ల డెమో రైలు దాదాపు రెండు సంవత్సరాలుగా నిలిపివేశారు. గత నెల 16వతేదీ నుంచి తిరిగి డెమో పునఃప్రారంభమైంది. అదేవిధంగా ధర్మవరం– విజయవాడ రైలు కూడా ఉదయం – రాత్రి పూట నడుస్తుంది. దీనికి అదనంగా రైల్వేశాఖ గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైలును నడపాలని సంకల్పించింది. గతంలో పాత రైలు నంబర్‌ 67232/67231 స్థానంలో 17261/17262 నంబర్‌ గల రైలును నడిపేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది.
    

18న గుంటూరులో, 19న తిరుపతిలో ప్రారంభం 

కడప మీదుగా గుంటూరు–తిరుపతి మధ్య రాకపోకలు సాగించేందుకు డైలీ రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాటు చేసినట్లు కడప రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ డి.నరసింహారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుంటూరులో ఈనెల 18వ తేదీ ఈ రైలు (17261) ప్రతిరోజు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురంరోడ్డు, కంభం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం మీదుగా కడపకు అర్ధరాత్రి 12.45 గంటలకు చేరుకుంటుంది. నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా తిరుపతికి మరుసటిరోజు ఉదయం 4.25 గంటలకు చేరుతుందన్నారు.  

ఈనెల 19వ తేదీన సాయంత్రం 7.35 గంటలకు తిరుపతిలో బయలుదేరి  కడపకు రాత్రి 9.55 గంటలకు చేరుకుంటుంది.  ఇదేమార్గంలో మరుసటిరోజు ఉదయం 8.00 గంటలకు గుంటూరుకు చేరుతుందన్నారు. ఈ రైలులో ఏసీ త్రీ టైర్‌ ఒకటి, స్లీపర్‌ 10, జనరల్‌  బోగీలు 2, బ్రేక్‌వ్యాన్‌ రెండింటితో కలిపి మొత్తం 15 కోచ్‌లు  ఉంటాయన్నారు. ప్రయాణీకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

డివిజన్‌ కేంద్రంలో రైలు ఆపాలి 
జమ్మలమడుగు ప్రాంతం నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమల వెంకన్న దర్శనం కోసం,విద్యార్థులు చదువుకోవటానికి తిరుపతికి వెళుతుంటారు. గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈనెల 18న ప్రారంభించబోతున్నారు. జమ్మలమడుగు డివిజన్‌ కేంద్రంగా..నియోజకవర్గ హెడ్‌క్వార్టర్‌గా ఉంది. రైల్వేశాఖ అధికారులు ఇక్కడ రైలును ఆపితే అందరికీ  ఎంతో  ఉపయోగకరంగా ఉంటుంది. 
– పి.నాగేశ్వరరెడ్డి, ఎస్పీ డిగ్రీకాలేజీ కరస్పాడెంట్

Advertisement
 
Advertisement
 
Advertisement