గుంటూరు తక్కెళ్లపాడులో ఘోరం.. ప్రేమకు నో చెప్పిందని గొంతుకోసి చంపాడు

Guntur Jilted Lover slit BDS Student Tapasvi throat Murdered - Sakshi

పెదకాకాని: ప్రేమను నో చెప్పిందనే కోపంలో యువతి గొంతుకోసి చంపేశాడు ఓ ప్రేమోన్మాది. గుంటూరు జిల్లా  తక్కెళ్లపాడు గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పెదకాకాని సీఐ సురేష్‌బాబు కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన తపస్వి (21) విజయవాడ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్‌ కళాశాలలో బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ (బీడీఎస్‌) తృతీయ సంవత్సరం చదువుతోంది. 

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ జ్ఞానేశ్వర్‌తో రెండేళ్ల క్రితం ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా జ్ఞానేశ్వర్‌ ప్రేమిస్తున్నానంటూ ఆ యువతిని వేధిస్తుండటంతో ఇటీవల విజయవాడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చి.. మరోసారి ఇలా చేయవద్దని హెచ్చరించి పంపించారు. అయినప్పటికీ జ్ఞానేశ్వర్‌ వేధింపుల్ని ఆపలేదు. దీంతో తపస్విని 10 రోజుల క్రితం తక్కెళ్లపాడు డెంటల్‌ కాలేజీ విద్యార్థిని అయిన తన స్నేహితురాలి రూమ్‌కు వెళ్లి అక్కడే ఉంటోంది. 

ఈ విషయం తెలుసుకున్న జ్ఞానేశ్వర్‌ సోమవారం రాత్రి సర్జికల్‌ బ్లేడు, కత్తి వెంట తీసుకుని తపస్వి ఉంటున్న ప్రాంతానికి చేరుకుని.. సర్జికల్‌ బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. అనంతరం తన చేతిని కూడా కోసుకున్నాడు. ఆమె స్నేహితురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని జ్ఞానేశ్వర్‌కు దేహశుద్ధి చేసి తాడుతో కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. తపస్విని చికిత్స నిమిత్తం మొదట ప్రైవేట్‌ ఆస్పత్రికి, ఆ తరువాత ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి తపస్వి (21) మరణించింది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న జ్ఞానేశ్వర్‌ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top