శభాష్‌ వలంటీర్‌: బెంగళూరు వెళ్లి బీమా..

Grama Volunteer Go To Bangalore And Complete EKYC Of YSR Bima - Sakshi

కురబలకోట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్‌ బీమా పథకాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తిస్తున్నారు. కురబలకోట మండలం భద్రయ్యగారిపల్లె గ్రామ వలంటీర్‌ వేపలపల్లె దయ్యాల కిరణ్‌ కుమార్‌రెడ్డి  తన పరిధిలోని వారు కొందరు బెంగళూరులో ఉన్నట్లు తెలుసుకున్నారు.  గురువారం వారి వద్దకు వెళ్లి.. బీమా ఈకేవైసీ చేశాడు. తమ కోసం గ్రామ వలంటీర్‌ బెంగళూరు వచ్చి వైఎస్సార్‌ బీమా నమోదు చేయడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రం దాటిన వలంటీర్ల సేవలు
► ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పింఛన్‌దారులకు మూడు నెలల నగదు అందజేత

చీరాల టౌన్‌: అభాగ్యుల పాలిట వలంటీర్‌ వ్యవస్థ ఆశా దీపంగా మారుతున్నది. వరుసగా మూడో నెలకూడా పింఛన్‌ తీసుకోకపోతే కార్డు రద్దయ్యే ప్రమాదం ఉండడంతో వార్డు వలంటీర్లు చొరవ చూపిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వలంటీర్లు షేక్‌.నాగూర్‌బాబు,  కె.గోపి  మూడు నెలల పింఛన్‌ను ఒకేసారి చెల్లించడంతో సంబంధిత వ్యక్తులు హర్షం వ్యక్తం చేశారు. చీరాల బోస్‌ నగర్‌కు చెందిన కె.అంజలీకుమారి ఊపిరితిత్తుల వ్యాధితో చెన్నై పెరంబూర్‌లోని గ్లోబల్‌ హాస్పిటల్‌లో మూడు నెలల నుంచి చికిత్స పొందుతోంది.

పెరంబూర్‌ వైద్యశాలలో అంజలీకుమారికి పింఛన్‌ అందిస్తున్న వలంటీర్‌  కె.గోపి
గురువారం రాత్రి గోపి రైలులో పెరంబూర్‌ వెళ్లి  మూడు నెలల వైఎస్సార్‌ పింఛన్‌ ఒకేసారి అందజేశాడు. అలానే బోస్‌నగర్‌కు చెందిన గుంటి రామచంద్రరావు క్యాన్సర్‌ వ్యాధికి తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర మెడికల్‌ సైన్సెస్‌ హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ మూడు నెలలుగా పింఛన్‌ తీసుకోవడంలేదు. దీంతో వలంటీర్‌ షేక్‌.నాగూర్‌బాబు శుక్రవారం ఉదయం తిరుపతికి చేరుకుని మొత్తం నగదు అందజేశాడు. 

95.4 శాతం మందికి పింఛన్ల పంపిణీ
► నేడు కూడా వలంటీర్ల ద్వారా కొనసాగనున్న పంపిణీ 
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజు శుక్రవారం కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. శుక్రవారం రాత్రి వరకు మొత్తం 58,16,064 (95.4 శాతం) మందికి రూ.1,405.74 కోట్ల పింఛను డబ్బు పంపిణీ చేశారు. శనివారం కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి డబ్బులు పంపిణీ చేస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధికారులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top