ఇంటర్ ఫలితాల్లో మెరిసిన బాలికలు | Girls dominate in intermediate exams | Sakshi
Sakshi News home page

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన బాలికలు

Apr 16 2026 5:51 AM | Updated on Apr 16 2026 5:51 AM

Girls dominate in intermediate exams

10,15,916 మంది హాజరవ్వగా 7,70,062 మంది ఉత్తీర్ణత  

మొదటి ఏడాది 77 శాతం.. రెండో ఏడాది 81 శాతం మంది పాస్‌ 

బాలికల ఉత్తీర్ణత మొదటి ఏడాది 81 శాతం.. రెండో ఏడాది 85 శాతం 

బాలుర ఉత్తీర్ణత ఫస్ట్‌ ఇయర్‌ 72 శాతం.. రెండో ఏడాది 76 శాతం 

ఉత్తీర్ణతలో తొలి మూడు స్థానాల్లో కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాలు  

చివరి స్థానంలో అన్నమయ్య జిల్లా 

ఈనెల 20 నుంచి 27 వరకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ అవకాశం  

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 25 వరకు జరిగిన పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా జనరల్, ఒకేషనల్‌ కలిపి 10,57,312 మందికి గాను 10,15,916 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 7,21,342 మంది జనరల్, 48,720 మంది ఒకేషనల్‌ కలిపి మొత్తం 7,70,062 మంది ఉత్తీర్ణత సాధించారు. 

ఇందులో రెండో ఏడాది విద్యార్థులు 3,84,967 మంది(81 శాతం).. మొదటి ఏడాదిలో 3,85,095 మంది(77 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలను విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ బుధవారం ‘ఎక్స్‌’లో విడుదల చేశారు. ఉత్తీర్ణత శాతం మొదటి ఏడాదిలో పెరగ్గా.. రెండో ఏడాదిలో తగ్గింది. 2025 మార్చిలో జరిగిన పరీక్షల్లో మొదటి ఏడాది 70 శాతం, రెండో ఏడాది 83 శాతం మంది పాసయ్యారు. ఈసారి ఉత్తీర్ణత మొదటి ఏడాది 7 శాతం పెరిగితే, రెండో ఏడాది 2 శాతం తగ్గింది.  

బాలికలదే హవా.. 
ఫలితాల్లో బాలికలే అత్యధిక ప్రతిభ కనబరిచారు. రెండో ఏడాదిలో 85 శాతం, మొదటి ఏడాదిలో 81 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. బాలురు రెండో ఏడాది 76 శాతం, మొదటి ఏడాదిలో 72 శాతం మంది పాస్‌ అయ్యారు. ఒకేషనల్‌ విభాగంలోనూ బాలికలు మొదటి ఏడాది 71 శాతం, రెండో ఏడాది 83 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. బాలురు మొదటి ఏడాది 49 శాతం, రెండో ఏడాది 62 శాతం మందే పాస్‌ అయ్యారు. ఒకేషనల్‌ పరీక్షలకు మొదటి ఏడాది 38,443 మంది హాజరవ్వగా.. 23,569 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండో ఏడాదిలో 33,852 మందికి గాను 25,151 మంది విజయం సాధించారు.  

టాప్‌లో కృష్ణా, గుంటూరు 
ఇంటర్‌ ఫలితాల్లో కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలు టాప్‌లో నిలిచాయి. మొదటి ఏడాది ఫలితాల్లో కృష్ణా 90 శాతం, గుంటూరు 88 శాతం, విశాఖపట్నం 85 శాతంతో మొదటి మూడుస్థానాల్లో ఉన్నాయి. రెండో ఏడాదికి సంబంధించి కృష్ణా 92 శాతం, గుంటూరు 88 శాతం, ఎన్టీఆర్‌ జిల్లా 87 శాతంతో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఇంటర్‌ మొదటి, రెండో ఏడాదికి సంబంధించి చివరి స్థానంలో అన్నమయ్య జిల్లా ఉంది.  

27 వరకు రీకౌంటింగ్‌కు అవకాశం 
ఇంటర్‌ ఫలితాల్లో అభ్యంతరాలు ఉంటే ఈనెల 20 నుంచి 27 వరకు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు కార్యదర్శి రంజిత్‌ బాషా తెలిపారు. రీ వెరిఫికేషన్‌ జవాబు పత్రానికి రూ.1,300, రీ కౌంటింగ్‌ కోసం జవాబు పత్రానికి రూ.260 చొప్పున చెల్లించాలని సూచించారు. 

ఇంటర్‌లో కేజీబీవీల ఉత్తమ ఫలితాలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల (ఐపీఈ–2026) ఫలితాల్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ) గణనీయమైన ప్రగతి సాధించాయి. రాష్ట్రంలోని 352 కేజీబీవీల నుంచి మొదటి సంవత్సరంలో 9,367 మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా.. 7,904 మంది (84 శాతం) ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే 15 శాతం పెరిగింది. ఈ ఉత్తీర్ణత రాష్ట్ర బాలికల సగటు 77%తో పోలిస్తే 7 అధికం. ద్వితీయ సంవత్సరంలో 8,073 మంది బాలికలు పరీక్షలు రాయగా.. 7,022 మంది (87 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 

ఈ ఫలితాలు రాష్ట్ర సగటు ఉత్తీర్ణత (81%) కంటే మెరుగ్గా నమోదైంది. యాజమాన్యాల వారీగా చూస్తే కేజీబీవీలు గతేడాది 6వ స్థానం ఉండగా, ఈసారి 5వ స్థానానికి పెరిగింది. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్ర సగటుతో పోలిస్తే కేజీబీవీ విద్యార్థినులు అత్యుత్తమ ఉత్తీర్ణత శాతాన్ని సాధించారని ప్రశంసించారు. విద్యార్థినులు, కేజీబీవీ కార్యదర్శి డి.దేవానందరెడ్డి, ఇతర సిబ్బందిని అభినందించారు. విద్యార్థినుల ఉత్తీర్ణత శాతం పెంచడానికి రూపొందించిన ‘విజయపథం’ శిక్షణ ఫలితాలు సాధనకు ఉపకరించిందని దేవానందరెడ్డి పేర్కొన్నారు.  

మే 21 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు
ఈనెల 20 నుంచి 27 వరకు ఫీజుల చెల్లింపునకు అవకాశం
సాక్షి, అమరావతి: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ బుధవారం విడుదలైంది. మే 21 నుంచి జూన్‌ 4 వరకు మొదటి ఏడాది ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, రెండో ఏడాదికి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు రంజిత్‌ బాషా తెలిపారు. ఈనెల 20 నుంచి 27 వరకు ఫీజు చెల్లించవచ్చని సూచించారు. 

మొదటి ఏడాది అన్ని పేపర్లకు రూ.600, ప్రాక్టికల్స్‌కు రూ.275, బ్రిడ్జి కోర్సులకు రూ.165, ఒకేషనల్‌ బ్రిడ్జి కోర్సుకు రూ.275 చెల్లించాలన్నారు. మొదటి, రెండో ఏడాదికి కలిపి అన్ని పేపర్ల కోసం రూ.1,200, ఒకేషనల్‌ ప్రాక్టికల్స్‌కు రూ.550, బ్రిడ్జి కోర్సులకు రూ.330 చెల్లించాలని సూచించారు. ఇంటర్‌ రెండేళ్లు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు బెటర్‌మెంట్‌ రాయాలనుకుంటే ఆర్ట్స్‌ సబ్జెక్టులకు రూ.1,350, సైన్స్‌ సబ్జెక్టులకు రూ.1,600 చెల్లించాలని స్పష్టం చేశారు.  

జూన్‌ 7 నుంచి ప్రాక్టికల్స్‌.. 
ఎథిక్స్, మానవ విలువల పరీక్ష జూన్‌ 5న, పర్యావరణ విద్య పరీక్ష జూన్‌ 6న ఉదయం 10 నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకు జరుగుతాయి. ప్రాక్టికల్‌ పరీక్షలు జూన్‌ 7 నుంచి 11 వరకు నిర్వహిస్తారు. జనరల్, ఒకేషనల్‌ కోర్సులకు రెండు సెషన్లలో అంటే ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement